రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఉగ్రవాద స్థావరాలు తగిన శిక్షకు గురికాకుండా ఇక ఎంతమాత్రం తప్పించుకోలేవన్న భారత్ దృఢ సంకల్పాన్ని ‘ఆపరేషన్ సిందూర్’ నిరూపించింది :


కిర్గిజ్‌స్తాన్‌లో ఎస్‌సీఓ రక్షణ మంత్రుల సమావేశంలో రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్

సురక్షిత ఆశ్రయాల్ని నేలమట్టం చేయడం, రాజకీయ మినహాయింపుల్ని తోసిరాజనడం ద్వారా ఉగ్రవాదాన్ని, వేర్పాటు వాదాన్ని, అతివాదాన్ని ఎదుర్కొనేందుకు ఐక్య సంఘటన ఏర్పాటు చేయాలని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పిలుపు

‘‘ఉగ్రవాదానికి జాతీయత, ఆలోచనా స్రవంతి వంటివేం ఉండవు.. ఈ భూతానికి వ్యతిరేకంగా దేశాలు బలమైన, ఉమ్మడి వైఖరిని అవలంబించి తీరాలి’’

‘‘ఉగ్రవాదులకు కొమ్ముకాసే, నీడనిచ్చే, సురక్షిత ఆశ్రయాలను సమకూర్చే వారికి వ్యతిరేకంగా సముచిత చర్యలకు పట్టుబట్టడంలో ఎస్‌సీఓ వెనుకాడకూడదు’’

‘‘ప్రాంతీయ శాంతితో పాటు, ప్రపంచ శాంతి, సుస్థిరత్వాలను నిర్ధారించడం ఎస్‌సీఓ బాధ్యత’’

అరాజకత్వం, పోటీ, సంఘర్షణల కన్నా సహజీవనం, కలసిమెలసి ఉండడం, కరుణ... వీటిదే పైచేయి కావాలి... ఈ దిశగా ప్రపంచ ఏకాభిప్రాయంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది’’

నాడు పోస్టు చేయడమైనది: 28 APR 2026 12:49PM by PIB Hyderabad

‘‘ఉగ్రవాద దుర్గాలు ఇక తగిన దండనకు గురి కాకుండా ఉండజాలవన్న భారత్ దృఢసంకల్పాన్ని ‘ఆపరేషన్ సిందూర్’ నిరూపించింది’’ అని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆయన 2026 ఏప్రిల్ 28న కిర్గిజ్‌స్తాన్‌లోని బిష్కెక్‌లో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) రక్షణ మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, అతివాద దుష్టశక్తుల్ని ఎదుర్కోవడానికి ఒక ఏకీకృత మోర్చా (యునైటెడ్ ఫ్రంటు)ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతయినా ఉందని ఆయన అన్నారు.  ఇలాంటి ప్రక్రియలో సురక్షిత స్థావరాలను నేలమట్టం చేయడానికి, రాజకీయ అభ్యంతరాల్ని తోసిపుచ్చడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని సూచించారు. ఏదైనా దేశపు సార్వభౌమత్వంపైన దాడి చేసే ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని, సరిహద్దులకు అవతలి వైపు ప్రాపకాన్ని కలిగివున్న ఉగ్రవాదాన్ని ఉపేక్షించకూడదని, ఎందుకంటే రెండు రకాలైన ప్రమాణాలకు తావు లేదని ఆయన తేల్చిచెప్పారు.
ఉగ్రవాదులను ప్రోత్సహించే, వారికి ఆశ్రయాన్నిచ్చే, సురక్షిత స్థానాలను సమకూర్చే వర్గాలకు వ్యతిరేకంగా సముచిత చర్యలను చేపట్టడంలో ఎస్‌సీఓ వెనుకాడ కూడదని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ‘‘ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని, అతివాదాన్ని ఎలాంటి మినహాయింపులకూ తావు ఇవ్వకుండా ఎదుర్కొంటేనే మనం ప్రాంతీయ భద్రతను ఒక సవాలు నుంచి శాంతి, సమృద్ధిల మూలాధార స్థితికి చేర్చగలుగుతాం’’ అని ఆయన అన్నారు.
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం ఎస్‌సీఓ మౌలిక సిద్దాంతమని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఉగ్రవాద భూతాన్ని ఎదిరించి ఉమ్మడిగా పోరాడే క్రమంలో అలాంటి చేష్టలను, సూత్రాలను ఈ సంస్థ ఖండించిందని ఆయన గుర్తుకు తెచ్చారు. గతేడాది టియాంజిన్ ప్రకటన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత దృఢ, సామూహిక వైఖరిని ప్రతిబింబించిందని, అది ఉగ్రవాదంతో పాటు ఉగ్రవాదాన్ని అనుసరిస్తున్న వారికి కూడా వ్యతిరేకంగా భారత్ అవలంబిస్తున్న ‘జీరో-టాలరెన్స్’ దృక్పథానికి నిదర్శనమని శ్రీ సింగ్ స్పష్టం చేశారు. ‘‘సామూహిక విశ్వసనీయతకు సిసలు పరీక్ష నిలకడతనంతో వ్యవహరించడమే. ఉగ్రవాదానికి జాతీయత, ఆలోచనాస్రవంతి వంటివేమీ ఉండవు. దేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక బలమైన, ఉమ్మడి వైఖరిని తీసుకొని తీరాలి’’ అని ఆయన కరాఖండీగా చెప్పారు.
ఎస్‌సీఓ లో ప్రాంతీయ ఉగ్రవాద వ్యతిరేక వ్యవస్థ పోషిస్తున్న పాత్ర గొప్పదని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ఎస్‌సీఓకు భారత్ అధ్యక్షత వహించిన కాలంలో ఉగ్రవాదం, వేర్పాటు వాదం, అతివాదం.. వీటికి దారితీసే సమూల సంస్కరణవాదాన్ని నిరసిస్తూ దేశాధినేతలు విడుదల చేసిన సంయుక్త ప్రకటన ఈ విషయంలో ఉమ్మడి కట్టుబాటును సూచించిందని శ్రీ  సింగ్ చెప్పారు. ఇప్పుడున్న ప్రపంచ అనిశ్చిత స్థితులను పరిగణనలోకి తీసుకుంటే, ఇవాళ్టి ప్రపంచం చీలికలు వాలికలైనట్లు కనిపిస్తోందనీ, దేశాలు తమ సొంత ప్రయోజనాలకే మొగ్గు చూపుతున్న ధోరణి నానాటికీ పెచ్చు పెరుగుతోందని, ఈ స్థితిలో ఎస్‌సీఓ ఒక ప్రధాన భూమికను పోషించాల్సి ఉందని ఆయన వివరించారు.  
‘‘మనకు ఒక కొత్త ప్రపంచ వ్యవస్థ అవసరమా, లేక మరింత క్రమశిక్షణ కలిగిన ప్రపంచం అవసరమా? ఈ ప్రపంచంలో ప్రతి పౌరుడి పట్ల, ప్రతి పౌరురాలి పట్ల ఆత్మగౌరవంతో, ఆదరంతో నడుచుకొనే వ్యవస్థ మనకి కావాలి. భేదాలు వివాదాలుగా మారని, వివాదాలు వైపరీత్యాల కన్న ముందే విరుచుకు పడని వ్యవస్థంటూ ఏర్పడాలి. ప్రస్తుత అసలు సిసలు సంక్షోభం మనుగడలో లేని వ్యవస్థ కానే కాదు.. ఈసరికే రూపుదాల్చిన నియమాల ఆధారిత ప్రపంచ వ్యవస్థను నిలదీసే వైఖరి. అరాజకత్వం, పోటీ, సంఘర్షణల కన్న సహజీవనం, కలసి మెలసి మనుగడ సాగించడం, కరుణ.. ఇవే ఆధిక్యాన్ని సంపాదించుకొనే దిశగా ప్రపంచ స్థాయి ఏకాభిప్రాయాన్ని సాధించడంపై మనం దృష్టిని కేంద్రీకరించక తప్పదు’’ అని రక్షణ మంత్రి అన్నారు.
ప్రాంతీయ స్థాయిలో శాంతి, సుస్థిరత్వంతో పాటు ప్రపంచం అంతటా శాంతి, సుస్థిరత్వం విలసిల్లేటట్లు చూడడం ఎస్‌సీఓ బాధ్యత అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ‘‘పట్టపగ్గాలు లేని బలానికి బదులు చర్చలు, దౌత్య మార్గం.. వీటిని అనుసరించాల్సిన అవసరం ఉంది. ఈ యుగాన్ని హింస, యుద్ధ యుగంగా మారనివ్వ కూడదు మనం. అంత కన్న శాంతి, సమృద్ధిల యుగంగా రూపొందనివ్వాలి. ఒక కన్నును తీస్తే ఇంకో కన్నును కూడా తీసేయాలనే పద్ధతిలో చివరకు మిగిలేది గుడ్డితనమేనని మహాత్మాగాంధీ ఇచ్చిన సందేశాన్ని గుర్తుకు తెచ్చుకుందాం. ఏదైనా ఒక పనికి పూనుకొనే ముందు ఆ పని పేదల, ఆపన్నుల జీవితంలో ఏవైనా మార్పులను తీసుకు రాగలుగుతుందా అని మనం గ్రహించుకోవాలని చెప్పాలనుకుంటున్నా. రక్షణకి, భద్రతకు బాధ్యులం అయిన మనకు సోదరభావాన్ని, సద్భావనను నిలబెట్టాల్సిన బాధ్యత కూడా ఉంది. శక్తికి నిజమైన పరీక్ష ఏది అంటే, దానిని పేదలపై, బలహీనులపై ప్రయోగించడం కాక తమను తాము కాపాడుకోలేని వర్గాల వారి మేలుకు ఉపయోగించడమే’’ అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వివరించారు.
శాంతికీ, సుస్థిరత్వానికీ చెప్పుకోదగిన స్థాయిలో తోడ్పడడానికి అవసరమైన బలం, సంకల్పం ఎస్‌సీఓకు ఉన్నాయని భారత్ నమ్ముతోందని రక్షణ మంత్రి అన్నారు. ప్రాచీన భారత్ తత్త్వ దర్శనం ‘వసుధైవ కుటుంబకమ్‌’ ఈ కలుపుగోలుతనానికి సూచిక అనీ, ఈ భావన జాతి, మతం తాలూకు అన్ని భేదాలను అధిగమించిందని ఆయన వివరించారు.
ఎస్‌సీఓ కర్తవ్యాల అమలుకు నిర్మాణాత్మకంగా తోడ్పాటును అందించడానికి భారత్ కట్టుబడి ఉందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. సమానత్వం, పరస్పర గౌరవం, లోతైన అవగాహన ప్రాతిపదికలుగా సభ్య దేశాల మధ్య ఒక దేశమంటే మరో దేశానికి నమ్మకం ఉండడం, ఇదివరకటి కన్న ఎక్కువ సహకారాన్ని అందించడం అవసరమనీ, ఇవే ఈ సంస్థను ఆశకీ, శాంతికీ దారిదీపంగా నిలబెడతాయనీ ఆయన అన్నారు.
ఈ సమావేశం సందర్భంగా రక్షణ మంత్రి సభ్య దేశాలతో కలసి.. భద్రత, ఉగ్రవాదం, ఈ ప్రాంతంపై ప్రభావాన్ని చూపుతున్న సమూల సంస్కరణవాదం, అది ప్రపంచ శాంతికి సృష్టిస్తున్న చిక్కులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఎస్‌సీఓ సభ్యులు 2026కు ఉన్న సంకేతాత్మక ప్రాధాన్యాన్ని చాటిచెప్పారు. ఎస్‌సీఓ ఏర్పడి 2026కు 25 సంవత్సరాలయ్యాయి. అంతటా అనిశ్చితి, అస్థిరత్వం పెచ్చుపెరుగుతున్న కారణంగా ఎస్‌సీఓ పాత్రకు గల ప్రాధాన్యం ఇదివరకటితో పోలిస్తే ఇప్పుడు మరింత అధికంగా ఎలా మారుతున్నదీ వారు ప్రస్తావించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2256255) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Gujarati