అణుశక్తి విభాగం
azadi ka amrit mahotsav

ప్రపంచంలో వాణిజ్య స్థాయి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్‌ను నిర్వహించే రెండో దేశంగా భారత్‌: డాక్టర్ జితేంద్ర సింగ్


· రష్యా తర్వాత స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ తొలి క్రిటికాలిటీ సాధన ఓ కీలక ఘట్టం

· భారత 3 దశల అణు కార్యక్రమం ‘పీఈఎఫ్‌బీ’లో భాగంగా రెండో దశ వైపు ఇదొక ముందంజ... దేశంలోని అపార థోరియం నిల్వల భవిష్యత్ వినియోగానికి మార్గం సుగమం చేస్తుంది

· ఇటీవల ప్రారంభించిన “న్యూక్లియర్ మిషన్” కింద 2033 నాటికి 5 చిన్న మాడ్యులర్ రియాక్టర్ల ఏర్పాటుకు ప్రణాళిక

· భారత అణుశక్తి సామర్థ్యం పెంపులో ప్రైవేట్ రంగ భాగస్వామ్యానికి శాంతి చట్టం సౌలభ్యం కల్పిస్తుంది

నాడు పోస్టు చేయడమైనది: 27 APR 2026 5:28PM by PIB Hyderabad

ప్రపంచంలో వాణిజ్య స్థాయి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్‌ను నిర్వహిస్తున్న రెండో దేశంగా భారత్‌ నిలుస్తుందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. “స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్‌” అంశంపై ఇవాళ ఎంపీలు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన వర్క్‌ షాప్‌లో ఆయన మాట్లాడారు. తమిళనాడులోని కల్పక్కంలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 500 మెగావాట్ల ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (పీఎఫ్‌బీఆర్‌)ను రూపొందించడం ద్వారా రష్యా తర్వాత భారత్‌ ఓ కీలక ఘట్టాన్ని ఆవిష్కరించిందని చెప్పారు. ఈ క్రమంలో 2026 ఏప్రిల్ 6న ఇది తొలి ‘క్రిటికాలిటీ’ని సాధించిందని ఈ సందర్భంగా వివరించారు.

ఇందిరా గాంధీ అణు పరిశోధన కేంద్రం (ఐజీసీఏఆర్‌) రూపకల్పన చేయగా, భావిని (BHAVINI) సంస్థ ఈ రియాక్టరును నియమించింది. ఇది తాను వినియోగించుకునే దానికన్నా ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ క్రమంలో యురేనియం-ప్లూటోనియం మిశ్రమ ఆక్సైడ్ ఇంధనాన్ని ఉపయోగించే మూడు దశల జాతీయ అణు విద్యుత్ కార్యక్రమం రెండో దశకు ఇది నాంది పలికింది. ఈ విజయంతో జాతీయ అణు వ్యూహం మూడో దశలో తన వద్దగల అపార థోరియం నిల్వలను వినియోగించుకునే దిశగా భారత్‌ అడుగులు వేస్తోంది. ఈ రియాక్టర్‌ పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలైతే, వాణిజ్య స్థాయి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్‌ను నిర్వహించే దేశాల్లో రష్యా తర్వాత భారత్‌ రెండో స్థానంలో నిలుస్తుందని ఆయన తెలిపారు.

శ్రీ తరుణ్ చుగ్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఈ విజయం ప్రాధాన్యాన్ని డాక్టర్‌ శ్రీ జితేంద్ర సింగ్‌ వివరించారు. దీనిద్వారా భారత్‌ తన అణు వ్యూహం మూడో దశలో తన అపార థోరియం నిల్వల వినియోగం దిశగా ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు.

ప్రస్తుతం ప్రపంచంలో వాణిజ్య ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లను (ఎఫ్‌బీఆర్‌) నిర్వహించే ఏకైక దేశం రష్యా మాత్రమే. ఆ తర్వాత ఇటువంటి రియాక్టర్‌ను ప్రారంభించే ప్రక్రియలో ఉన్నత దశ చేరిన నేపథ్యంలో భారత్‌ తర్వాతి స్థానం పొందనుంది. చారిత్రకంగా అనేక దేశాలు... ముఖ్యంగా అమెరికా, యూకే, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ, చైనా ఈ ప్రయోగాత్మక ఫాస్ట్ రియాక్టర్లను రూపొందించి, నిర్వహించినా అవి చాలావరకు మూతపడ్డాయి.

భారత్‌ చేపట్టిన మూడు దశల అణు కార్యక్రమంలో ఇటీవలి పరిణామాలను డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావించారు. ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్‌ను విజయవంతంగా ఏర్పాటు చేయడమన్నది అణు కార్యక్రమ రెండో దశ వైపు కీలక మలుపుగా ఆయన అభివర్ణించారు. దీనిద్వారా అణు ఇంధనాన్ని మరింత సమర్థంగా వినియోగించుకునే వీలుంటుందని ఆయన చెప్పారు. అలాగే, భారత్‌ తన వద్దగల అపార థోరియం నిల్వలను భవిష్యత్తులో సద్వినియోగం చేసుకునే మార్గం సుగమం కాగలదని తెలిపారు.

ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ సాంకేతికతలో కేవలం కొన్ని దేశాలు మాత్రమే పురోగతి సాధించాయని, ఈ నేపథ్యంలో అధునాతన అణు సామర్థ్యం రీత్యా భారత్‌ నేడు అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట స్థానంలో నిలిచిందని మంత్రి వివరించారు.

కాలుష్య రహిత ఇంధన మార్పిడి, దీర్ఘకాలిక సుస్థిరత లక్ష్యాలలో... ముఖ్యంగా 2047 నాటికి భారత్‌ 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్య సాధనలో అణుశక్తి కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి వివరించారు.

ఆధునిక అవసరాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ- కృత్రిమ మేధ, డేటా మౌలిక సదుపాయాలు, అధునాతన తయారీ తదితర రంగాలు విశ్వసనీయ, నిరంతర కాలుష్య రహిత ఇంధన వనరులపై ఎక్కువగా ఆధారపడతాయని, ఇటువంటి రంగాలకు అణు విద్యుత్ అనివార్య అవసరమని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

భారత అణుశక్తి సామర్థ్యం పెంపులో ప్రైవేట్ రంగానికి అధిక భాగస్వామ్యం దిశగా చిన్న మాడ్యులర్ రియాక్టర్ల (ఎస్‌ఎంఆర్‌) ఏర్పాటు, విధానపరమైన మద్దతు, శాంతి చట్టం వంటి కార్యక్రమాల ప్రాధాన్యాన్ని కూడా మంత్రి స్పష్టం చేశారు. మన దేశం ఇటీవల ప్రారంభించిన ‘న్యూక్లియర్ మిషన్’ కింద రూ.20,000 కోట్ల కేటాయింపుతో 2033 నాటికి ఐదు ‘ఎస్‌ఎంఆర్‌’లను ఏర్పాటుకు యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ముఖ్యంగా పరిశ్రమలలో, అధిక జనాభాగల ప్రాంతాల్లో, గ్రిడ్ కనెక్షన్ లేని మారుమూల ప్రదేశాల్లో సొంత విద్యుదుత్పత్తికి, థర్మల్ ప్లాంట్ల పునరుపయోగం తదితరాలకు ‘ఎస్‌ఎంఆర్‌’లు ఉపయోగపడతాయన్నారు.

ప్రభుత్వ దార్శనికతను పునరుద్ఘాటిస్తూ- 2070 నాటికి నికరశూన్య ఉద్గార లక్ష్య సాధన దిశగా అణు, పునరుత్పాదక, ఇతర కాలుష్య రహిత ఇంధన వనరుల సమ్మేళనంతో సమతుల ఇంధన మిశ్రమాన్ని ఉపయోగించడం కీలకమని మంత్రి వివరించారు.

***


(రిలీజ్ ఐడి: 2256163) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी