రక్షణ మంత్రిత్వ శాఖ
ఆధునిక ఆయుధ తరలింపు ట్రాక్డ్ అండ్ వీల్డ్ వాహన వేదికలను ఆవిష్కరించిన డీఆర్డీఓ
నాడు పోస్టు చేయడమైనది:
25 APR 2026 6:12PM by PIB Hyderabad
రక్షణ దళాల మారుతున్న నిర్వహణ అవసరాలను తీర్చడానికి అభివృద్ధి చేసిన అధునాతన ట్రాక్డ్, వీల్డ్ ఆయుధ తరలింపు వాహన వేదికలను రక్షణ శాఖ (పరిశోధన - అభివృద్ధి) కార్యదర్శి, డీఆర్డీఓ ఛైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ ఏప్రిల్ 25, 2026న మహారాష్ట్రలోని అహల్యనగర్ లో గల రక్షణ పరిశోధన,అభివృద్ధి సంస్థ ప్రయోగశాల ప్రాంగణంలో ఆవిష్కరించారు. వాహనాల పరిశోధన, అభివృద్ధి సంస్థ వీటికి రూపకల్పన చేసి అభివృద్ధి చేసింది.
చలనశీలత, అగ్నిశక్తి, రక్షణ అవసరాలను తీర్చగల అధునాతన లక్షణాలతో కూడిన స్వదేశీ రూపకల్పన, అభివృద్ధి చెందిన 30 మిల్లీమీటర్ల సిబ్బంది రహిత ఆయుధ పీఠాలను ఈ రెండు వేదికలకు అమర్చారు.
అధిక శక్తి గల ఇంజిన్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో సమగ్రంగా అమర్చిన ఈ వాహనాలు, అధిక శక్తి , బరువు నిష్పత్తి, ఎక్కువ వేగ సామర్థ్యం, ఏటవాలు ప్రాంతాలు, అడ్డంకులను అధిగమించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. స్టానాగ్ స్థాయి 4, 5 రక్షణను అందిస్తూ, చుట్టూ మాడ్యులర్ బ్లాస్ట్, బాలిస్టిక్ రక్షణతో వీటిని రూపొందించారు. జల చోదక యంత్రాలను చేర్చడం ద్వారా నీటి అడ్డంకులను దాటే మెరుగైన సామర్థ్యం కలిగిన ఈ ఉభయచర వాహనం కార్యాచరణ సౌలభ్యాన్ని అందిస్తుంది.
30 మిల్లీమీటర్ల సిబ్బంది రహిత ఆయుధ పీఠం, 7.62 మిల్లీమీటర్ల పికెటి తుపాకీతో పాటు ట్యాంకు విధ్వంసక మార్గదర్శక క్షిపణులను ప్రయోగించడానికి వీలుగా దీనిని రూపొందించారు. ప్రాథమిక నమూనాను బహుళ పాత్రలకు అనుగుణంగా మార్చుకునే సామర్థ్యం ఉంది. స్వదేశీ తయారీ ప్రస్తుత 65 శాతాన్ని 90 శాతానికి పెంచే ప్రణాళికలు ఉన్నాయి.
ఈ వేదికల తయారీని రెండు పరిశ్రమ భాగస్వాములు—టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్, భారత్ ఫోర్జ్ లిమిటెడ్ కలసి అనేక సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మద్దతుతో చేపట్టాయి. ఈ భాగస్వామ్యం అభివృద్ధి చెందుతున్న రక్షణ వ్యవస్థను బలోపేతం చేసింది.
ఆర్మమెంట్, కాంబాట్ ఇంజినీరింగ్ సిస్టమ్స్ (ఏసీఈ), ప్రొడక్షన్, కోఆర్డినేషన్ ,సర్వీసెస్ ఇంటరాక్షన్ (పీసీ అండ్ ఎస్ఐ) విభాగాల డైరెక్టర్లు జనరల్స్‌తో పాటు ప్రముఖ శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే, టిఏఎస్ఎల్, పుణె సీఈఓ, ఎండీ, బీఎఫ్ఎల్, పుణె వైస్ చైర్మన్, జాయింట్ ఎండీతో పాటు ఇతర పరిశ్రమ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. వాహనాల పరిశోధన, అభివృద్ధి సంస్థ, ఆయుధాల పరిశోధన,అభివృద్ధి సంస్థ, రక్షణ మెటలర్జికల్ పరిశోధన ప్రయోగశాల, హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ, కాంబాట్ వాహనాల పరిశోధన, అభివృద్ధి సంస్థ, రీసెర్చ్, డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఇంజినీర్స్) వంటి వివిధ డీఆర్డీఓ ప్రయోగశాలల డైరెక్టర్లు, శాస్త్రవేత్తలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
***
(రిలీజ్ ఐడి: 2255640)
సందర్శకుల సూచీ సంఖ్య : : 23