రక్షణ మంత్రిత్వ శాఖ
మెహర్ బాబా పోటీ-3 కి నమోదు ప్రక్రియను ప్రారంభిస్తున్న ఐఏఎఫ్
నాడు పోస్టు చేయడమైనది:
24 APR 2026 1:53PM by PIB Hyderabad
మెహర్ బాబా పోటీ-3లో భాగంగా మూడో సంచిక (https://indianairforce.nic.in/mehar_baba)ను భారత వైమానిక దళం ప్రారంభించింది. ‘‘సహకారాత్మక డ్రోన్- ఆధారిత నిఘా రాడార్లు’’ ఈ పోటీ (ఎమ్‌బీసీ-3) ఇతివృత్తం. ఆధునిక డ్రోన్, రాడార్ సాంకేతికతల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడమే ఈ పోటీ ముఖ్యోద్దేశం. ఈ పోటీలో పాలుపంచుకొనే ప్రతిభావంతులకు అభివృద్ధి ప్రక్రియకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని భారత వైమానిక దళం (ఐఏఎఫ్) అందిస్తుంది. మొదటి మూడు స్థానాల్లో నిలిచే విజేతలను పురస్కారాలను ప్రదానం చేసి గౌరవిస్తారు. మెహర్ బాబా పోటీ-3కి నమోదు ప్రక్రియను 2026 ఏప్రిల్ 27న ప్రారంభిస్తారు.
గౌరవ రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేఠ్ 2025 ఏరో ఇండియా సందర్భంగా ఈ పోటీని ప్రకటించారు. మానవ ప్రమేయానికి తావు ఉండని వైమానిక వ్యవస్థల అంతర నిర్వహణీయతపై ఆధారపడ్డ ఒక ప్రారంభిక మోడల్‌ను అభివృద్ధిపరచడం మెహర్ బాబా పోటీ-3 ప్రధానోద్దేశం. ఈ మోడల్.. కఠిన పరిస్థితుల్లో ఏరియల్ టార్గెట్స్‌ను గుర్తించడం, ట్రాకింగ్, రిపోర్టింగ్ విధుల నిర్వహణకు ఒక ఆకాశంలో ఉండే రాడార్‌లాగా పని చేయగలిగి ఉండాలి, అంతేకాదు.. ఏరియల్ టార్గెట్ల ఖచ్చిత స్థితి తాలూకు సమాచారాన్ని ఒక కేంద్రీయ నిఘా స్థావరానికి పంపగలిగేటట్లు కూడా ఈ మోడల్ ఉండాలి. ఈ పోటీలో పాల్గొనాల్సిందిగానూ, తద్వారా ఏరోస్పేస్ రంగంలో తదుపరి నూతన ఆవిష్కరణ పరంపరలో భాగం పంచుకోవాల్సిందిగానూ భారతీయ పరిశ్రమల్నీ, అంకుర సంస్థల్నీ, విద్యాసంస్థల్నీ, పరిశోధక సంస్థల్నీ ఐఏఎఫ్ ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్న భాగస్వాములు అధికారిక వెబ్‌సైట్ https://indianairforce.nic.in/mehar_baba లో అందుబాటులో ఉన్న ‘విజన్ డాక్యుమెంట్’ (Vision Document)ను చూసి, ఈ పోటీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

ఈ పోటీకి సంబంధించిన మార్గదర్శక నమూనా ఒక దృఢతర అనుబంధ విస్తారిత వ్యవస్థ (ఇకోసిస్టమ్)ను సఫలతాపూర్వకంగా ప్రోత్సహించింది. మానవ రహిత వ్యవస్థల తయారీ పరిశ్రమకు సుమారు రూ.2.000 కోట్ల ఆర్డర్లను సంపాదించి పెట్టింది. ఎమ్‌బీసీ ఒకటో సంచికకు ‘‘మానవీయ సహాయం, విపత్తు సహాయక కార్యకలాపాలకు ఉద్దేశించిన డ్రోన్ల సమూహం’ అంశం ఇతివృత్తంగా ఎంపిక చేయగా, రెండో సంచికకు ‘స్మార్మ్ డ్రోన్ బేస్‌డ్ ఫారిన్ ఆబ్జెక్ట్ డెబ్రి డిటెక్షన్ ఆన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటింగ్ సర్ఫేసెస్’ను ఇతివృత్తంగా నిర్దేశించారు. ఐఏఎఫ్ ఆధ్వర్యంలో ఈ పోటీ పట్ల పరిశ్రమ, అంకుర సంస్థలే కాక విద్యారంగ ప్రముఖులు కూడా ఎంతో ఉత్సాహంతో ప్రతిస్పందించారు. కీలక రక్షణ సంబంధిత సాంకేతికతలపై పని చేయడానికి ఒక ఉమ్మడి వేదికను ఎమ్‌బీసీ అందిస్తూ, భారతీయ పరిశ్రమ, విద్యారంగం, వినియోగదారుల మధ్య అంతరాన్ని భర్తీ చేయడంలో అగ్రగామిగా పేరు తెచ్చుకొంది.
విమానయానానికి సంబంధించిన విశిష్ట సాంకేతికతను దేశీయంగా అభివృద్ధి చేయడాన్ని ప్రోత్సహించడానికి ఐఏఎఫ్ నడుం కట్టి, ‘మెహర్ బాబా కాంపిటీషన్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ పోటీ.. 2018లో దీనిని మొదలుపెట్టినప్పటి నుంచీ ఎమ్‌బీసీ పరిశ్రమతో పాటు విద్యారంగానికి చెందిన ఎంతో మంది దృష్టిని ఆకర్షించింది. విమానయాన సవాళ్లను ఎదుర్కోవడానికి సముచితమైన నూతన పరిష్కారాల్ని దేశీయంగా అభివృద్ధిపరిచే స్ఫూర్తిని విద్యారంగ ప్రముఖులకూ, అంకుర సంస్థలకూ, పరిశ్రమకూ ఈ పోటీ అందించింది.
చిరకాల అనుభవం కలిగిన, వైమానిక దళ అధికారి మెహర్ సింగ్ డీఎస్ఓ ఎమ్‌వీసీ పేరిట ఎమ్‌బీసీని నిర్వహిస్తున్నారు. ఈయనను ఆప్యాయంగా ‘మెహర్ బాబా’ అని పిలుచుకుంటారు. ల్యాల్‌పూర్ జిల్లాలో 1915లో పుట్టిన మెహర్ బాబా 1934లో క్రాన్‌వెల్‌లోని రాయల్ ఎయిర్‌ఫోర్స్ కాలేజీలో చేరారు. విమానాలను నడపడంలో తనకు ఉన్న నైపుణ్యాన్ని గమనించిన తోటి వైమానికులు ఆయనంటే అమిత గౌరవాన్ని కనబరిచే వారు. 29 ఏళ్ల వయసులో, ఆయన ప్రభావవంత నాయకత్వాన్నీ, ధైర్య సాహసాల్నీ మెచ్చి డిస్టింగ్విష్డ్ సర్వీస్ ఆర్డర్ (డీఎస్ఓ)ను ఆయనకు అందించారు. 1945లో భారతీయ సైన్య తొలి దళాన్ని ఓ డకోటా ఎయిర్‌క్రాఫ్ట్‌లో శ్రీనగర్‌కు తీసుకు వెళ్లిన మిషన్‌కు సారథ్యాన్ని వహించడం ఆయన సాధించిన ఘనతల్లో అత్యంత స్మరణీయమైన ఘనతగా నిలిచింది. అప్పట్లో ప్రపంచంలో అతి ఎత్తయిన ఎయిర్‌స్ట్రిప్.. లే.ప్రాంతానికి విమానంలో వెళ్లిన ఘనత కూడా మెహర్ బాబా పేరిటే నమోదైంది. భారత వైమానిక దళంలో మొదటి మహా వీర్ చక్ర పురస్కారాన్ని పొందింది కూడా మెహర్ బాబాయే.
***
(రిలీజ్ ఐడి: 2255310)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15