బొగ్గు మంత్రిత్వ శాఖ
2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో విద్యుత్ రంగ వినియోగదారుల కోసం పీఐ సడలింపు, నగదు తగ్గింపు పథకాన్ని ప్రవేశపెట్టిన భారత్ కోకింగ్ కోల్ సంస్థ
నాడు పోస్టు చేయడమైనది:
23 APR 2026 6:53PM by PIB Hyderabad
భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్) 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్ 2026) కాలానికి గాను విద్యుత్ రంగ వినియోగదారుల కోసం పనితీరు ప్రోత్సాహకం (పీఐ) సడలింపు, నగదు తగ్గింపు పథకాన్నిప్రకటించింది.
ఫ్లెక్సీ-లింకేజ్ పథకం కింద ఉన్న వారితో సహా ఇంధన సరఫరా ఒప్పందాల (ఎఫ్‌ఎస్‌ఏ) పరిధిలోకి వచ్చే అర్హతగల విద్యుత్ రంగ వినియోగదారులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. రైలు, రోడ్డు, ఆర్‌సీఆర్ రవాణా మార్గాల ద్వారా జరిగే వాస్తవ బొగ్గు సేకరణ ఆధారంగా ఈ ప్రోత్సాహకాలు ఉంటాయి. త్రైమాసిక పరిమాణం(క్యూక్యూ) ప్రాతిపదికన వివిధ స్లాబ్‌ల ప్రకారం ఈ పథకం అమలవుతుంది.
ఈ పథకం ద్వారా త్రైమాసిక పరిమాణంలో 120 శాతం కంటే తక్కువ బొగ్గు వినియోగానికి, ప్రస్తుత ఎఫ్‌ఎస్‌ఏ నిబంధనల ప్రకారం ముడి బొగ్గుపై మాత్రమే పీఐ వర్తిస్తుంది. ఎటువంటి నగదు తగ్గింపు లభించదు. శుద్ధి చేసిన విద్యుత్ బొగ్గును పీఐ లెక్కింపులో పరిగణనలోకి తీసుకోరు.
త్రైమాసిక పరిమాణం 120 నుంచి 140 శాతం వరకు బొగ్గు సేకరించినప్పుడు.. 90 శాతం కంటే ఎక్కువ సేకరించిన పరిమాణంపై పీఐ వర్తించదు. దీంతోపాటు క్యూక్యూలో 100 శాతం దాటి సేకరించిన బొగ్గుపై 5 శాతం నగదు తగ్గింపు లభిస్తుంది. ఈ నగదు తగ్గింపు నాణ్యత నిర్ధారణకు లోబడి కేవలం ముడి కోకింగ్ బొగ్గు, శుద్ధి చేసిన విద్యుత్ బొగ్గుపై మాత్రమే వర్తిస్తుంది. ఈ రాయితీ మొత్తాన్ని క్రెడిట్ నోట్ల రూపంలో జారీ చేస్తారు. వీటిని భవిష్యత్తులో సరఫరా చేసే బొగ్గు బిల్లుల నుంచి సర్దుబాటు చేసుకోవచ్చు.
ఒకవేళ బొగ్గు సేకరణ క్యూక్యూలో 140 శాతానికి మించితే గతంలో మాదిరిగానే క్యూక్యూలో 90 శాతం దాటిన పరిమాణంపై పీఐ వర్తించదు. 100 శాతం మించి సేకరించిన బొగ్గు పరిమాణంపై 10 శాతం నగదు తగ్గింపు లభిస్తుంది. ఇది కేవలం ముడి కోకింగ్ బొగ్గు, శుద్ధి చేసిన విద్యుత్ బొగ్గుపై మాత్రమే వర్తిస్తుంది.
అర్హులైన వినియోగదారులందరూ తమ బొగ్గు సేకరణను పెంచుకోవాలని, ముఖ్యంగా రైలు మార్గం ద్వారా ఎక్కువ బొగ్గును తీసుకుంటూనే, రోడ్డు, ఆర్‌సీఆర్ మార్గాల ద్వారా కూడా తగినంత సేకరణ జరిగేలా ప్లాన్ చేసుకోవాలని బీసీసీఎల్ సూచించింది. తద్వారా ఈ పథకం కింద గరిష్ట ప్రయోజనాలను పొందవచ్చని తెలిపింది.
బొగ్గు సేకరణను ప్రోత్సహించడం, రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరచడం, విద్యుత్ రంగానికి ఖర్చు భారాన్ని తగ్గించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థలో సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో.. ఈ నిర్ణయం దేశీయ బొగ్గు సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది దేశంలో స్థిరమైన విద్యుత్ ఉత్పత్తికి తోడ్పడుతూ, ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా నిలుస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2255027)
సందర్శకుల సూచీ సంఖ్య : : 23