రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ట్రాఫిక్ రద్దీ తగ్గించి, అనుసంధానాన్ని బలోపేతం దిశగా శరవేగంగా సాగుతున్న డెహ్రడూన్ బైపాస్ నిర్మాణం
నాడు పోస్టు చేయడమైనది:
23 APR 2026 4:43PM by PIB Hyderabad
డెహ్రాడూన్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, ప్రాంతీయ రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో12 కిలోమీటర్ల పొడవైన, నాలుగు వరుసల గ్రీన్‌ఫీల్డ్ బైపాస్ రోడ్డును నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (భారత జాతీయ రహదారుల సంస్థ) నిర్మిస్తోంది. ఇది ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌కు అనుసంధానంగా నిర్మితమవుతోంది. ఈ ప్రాజెక్టు ఝాజ్రా నుంచి ఎన్ హెచ్ 7లోని కొత్త పాంటా సాహిబ్-బల్లుపూర్ సెక్షన్‌ను కలుపుతూ డెహ్రాడూన్ జిల్లాలోని అషారోరి చెక్ పోస్టు సమీపంలోని ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ వద్ద ముగుస్తుంది. సుమారు రూ. 716 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు ఇప్పటికే 44 శాతం పూర్తయ్యాయి. ఏప్రిల్ 2027 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
పూర్తిగా నియంత్రిత ప్రవేశంతో వ్యూహాత్మకంగా రూపొందించిన ఈ జాతీయ రహదారి.. డెహ్రాడూన్ నగరంలోకి వెళ్లాల్సిన అవసరం లేని వాహనాలను దారి మళ్లించడానికి ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఉత్తరాఖండ్‌లోని సెలాక్వి పారిశ్రామిక ప్రాంతం, వికాస్‌నగర్, హెర్బర్ట్‌పూర్, హిమాచల్ ప్రదేశ్‌లోని పాంటా సాహిబ్ వైపు వెళ్లే వాహనాలను నగరం బయట నుంచే నైరుతి వైపుగా వెళ్లిపోవచ్చు. ఫలితంగా డెహ్రాడూన్ నగరంలో ట్రాఫిక్ రద్దీ, వాహన కాలుష్యం గణనీయంగా తగ్గుతాయి. అలాగే ఈ కారిడార్ ద్వారా హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాలకు అంతర్రాష్ట్ర రవాణా మెరుగుపడుతుంది.
దీర్ఘకాలిక సుస్థిరతను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఈ రహదారిపై వాహనాల వేగం గంటకు 100 కిలోమీటర్లుగా నిర్ణయించినప్పటికీ, అటవీ ప్రాంతాల్లో అడవులకు నష్టం కలగకుండా కొన్ని చోట్ల వేగాన్ని 80 కిలోమీటర్లకు పరిమితం చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం సాధారణంగా ఉండే 60 మీటర్ల రహదారి (రైట్ ఆఫ్ వే) వెడల్పును ఈ ప్రాజెక్టులో 30 మీటర్లకు తగ్గించారు. దీనివల్ల అటవీ చెట్లను నరకాల్సిన అవసరం తగ్గి, పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది.
ఈ రహదారి అటవీ ప్రాంతాల గుండా వెళ్తున్నందున, వన్యప్రాణుల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పెద్ద జంతువుల స్వేచ్ఛా సంచారం కోసం 350 మీటర్ల పొడవైన వెహిక్యులర్ ఓవర్ పాస్ (వాహనాల వంతెన)తోపాటు పశువుల కోసం ప్రత్యేకంగా క్యాటిల్ ఓవర్ పాస్ ను కూడా నిర్మిస్తున్నారు. వీటితో పాటు 7 చిన్న వంతెనలు, 21 చోట్ల బాక్స్ కల్వర్టులను వన్యప్రాణుల కోసం కేటాయించారు. పాములు, కప్పల వంటి చిన్న జీవుల రాకపోకల కోసం అయిదు ప్రత్యేక హ్యూమ్ పైపు కల్వర్టులను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
భద్రత, పర్యావరణ పరిరక్షణ కోసం రహదారి పొడవునా నిరంతర కంచెను ఏర్పాటు చేస్తున్నారు. వన్యప్రాణుల జోన్లు, వేగ పరిమితులను సూచించే బోర్డులను సైతం ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల మనుషులకు, వన్యప్రాణులకు మధ్య ఘర్షణలు తగ్గడంతో పాటు, అటవీ ప్రాంతంలో జంతువులు సురక్షితంగా ప్రయాణించేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయి. ఈ ప్రాజెక్టు ముస్సూరీతో సహా ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. దీనిద్వారా ఆ ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది.
ఈ బైపాస్ నిర్మాణం పూర్తయితే భారీ వాహనాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలు నగరం వెలుపల నుంచే వెళ్తాయి. దీనివల్ల డెహ్రాడూన్ ప్రజలకు ట్రాఫిక్ కష్టాల నుంచి భారీ ఉపశమనం లభిస్తుంది. రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ఆ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి.
***
(రిలీజ్ ఐడి: 2255024)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4