శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థకు భూతాపం ముప్పు: డాక్టర్ జితేంద్ర సింగ్
దేశవ్యాప్తంగా 250 నగరాల్లో ఇప్పటికే అమలవుతోన్న "ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్": డాక్టర్ జితేంద్ర సింగ్
భారతదేశ వైవిధ్య వాతావరణానికి ప్రత్యేక శీతలీకరణ పరిష్కారాలు తప్పనిసరి... అన్నింటికీ ఒకే విధానం సరికాదు: డాక్టర్ జితేంద్ర సింగ్
అధిక శీతలీకరణ పద్ధతులతో పెరుగుతున్న ఇంధన భారం, బాధ్యతాయుతమైన వినియోగం అవసరం: డాక్టర్ జితేంద్ర సింగ్
నాడు పోస్టు చేయడమైనది:
20 APR 2026 6:08PM by PIB Hyderabad
సుస్థిర శీతలీకరణ లక్ష్యాలను, వాతావరణ స్థితిని భారత్ మెరుగుపరచుకుంటుందని, ఇందుకోసం రూపొందించిన "ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్" ఇప్పటికే దేశవ్యాప్తంగా 250కి పైగా నగరాల్లో అమలవుతోందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూవిజ్ఞాన శాఖ (స్వతంత్ర బాధ్యత) సహాయమంత్రి, ఎంఓఎస్ పీఎంఓ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదుల శాఖ, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్షయాన శాఖల సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. భూతాపం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థకు ముప్పు ఉందని హెచ్చరించారు.
‘గ్లోబల్ హీట్ అండ్ కూలింగ్’ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కేవలం పర్యావరణ సంబంధిత ఆందోళన మాత్రమే కాదని, అంటువ్యాధులు, అసంక్రమిత వ్యాధులతో సహా పెరుగుతున్న ఆరోగ్య ప్రమాదాలతో ముడిపడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. అధిక ఉష్ణోగ్రతల ఒత్తిడి కారణంగా డెంగ్యూ, గుండె సంబంధిత వ్యాధుల వంటి అనేక సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలోని పరిస్థితులకు అనువైన పరిశోధనలు, పరిష్కారాల ఆవశ్యకతను తెలియజేస్తూ, వాతావరణ మార్పులపై స్పందించటం ప్రజారోగ్య ప్రాధాన్యతగా మారాలని ఆయన స్పష్టం చేశారు.
శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్‌టీ), జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏ), కోయిలిషన్ ఫర్ డిజాస్టర్ రెజిలియంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (సీడీఆర్ఐ), నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్ (ఎన్ఆర్‌డీసీ), ఇతర వాటాదారుల భాగస్వామ్యంతో నిర్వహించిన ‘గ్లోబల్ హీట్ అండ్ కూలింగ్’ సదస్సు ప్రారంభంలో మంత్రి ప్రసంగించారు. ఈ సదస్సులో వాతావరణం, డిజాస్టర్ రెజిలియన్స్, సుస్థిరాభివృద్ధి రంగాల్లో పనిచేస్తున్న ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ సంస్థల నిపుణులు పాల్గొన్నారు. వారిలో డాక్టర్ కృష్ణ వత్స, డాక్టర్ నిషా మెండిరట్టా, శ్రీ మనీష్ బాప్నా, శ్రీమతి దీపా సింగ్ బగై, డాక్టర్ అడెల్ థామస్, డాక్టర్ రాధికా ఖోస్లా వంటి ప్రముఖులున్నారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే ఉష్ణోగ్రతలు, ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్య అని, దీని ప్రభావం అన్ని ప్రాంతాలపై ఉందని పేర్కొన్నారు. భారతదేశంలోని విభిన్న వాతావరణ పరిస్థితుల కారణంగా విలక్షణమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని, ఇక్కడ వివిధ భౌగోళిక ప్రాంతాల్లో ఒకే సమయంలో తీవ్రమైన ఎండలు, తీవ్రమైన చలి వంటి విరుద్ధ పరిస్థితులుంటాయని వివరించారు. ఈ వైవిధ్యం దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా అనుసరించే ఒకే రకమైన నమూనా కాకుండా, మన దేశ పరిస్థితులకు తగినట్లుగా రూపొందించిన ప్రత్యేక వ్యూహాల అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
మారుతున్న వ్యాధుల సరళిని ప్రస్తావిస్తూ.. భారతదేశం ప్రస్తుతం ఒకవైపు ఉష్ణమండల వ్యాధులను, మరోవైపు జీవనశైలి సంబంధిత అసంక్రమిత వ్యాధులను ఎదుర్కొంటోందని మంత్రి పేర్కొన్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఈ రెండు రకాల వ్యాధులను తీవ్రతరం చేస్తున్నాయని, ముఖ్యంగా గుండె జబ్బులు, మధుమేహం ఉన్నవారిపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలతో వాతావరణ శాస్త్రాన్ని అనుసంధానించే సమగ్ర పరిశోధనలు జరగాలని పిలుపునిచ్చారు.
పెరుగుతున్న మానవాళి అనుకూలత మార్పుల గురించి కూడా మంత్రి ప్రస్తావించారు. ఆధునిక శీతలీకరణ వ్యవస్థలపై ఆధారపడటం అధికమవటంతో సహజంగా ఉష్ణోగ్రతలను తట్టుకునే సామర్థ్యం మారిపోయిందని అన్నారు. శీతలీకరణ సౌకర్యాలు కల్పించటంతో పాటు పర్యావరణ సుస్థిరతను కాపాడుకోవటం మధ్య సమతుల్యత పాటించటం ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ఎయిర్ కండిషనర్ల మితిమీరిన వాడకం వల్ల విద్యుత్ వినియోగం పెరగడమే కాక.. పర్యావరణం, ఆర్థిక వ్యవస్థపై అదనపు భారం పడుతుందని హెచ్చరించారు.
శీతలీకరణ పరిష్కారాలు అందరికీ సమానంగా అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి స్పష్టం చేశారు. వీటి లభ్యతలో వ్యత్యాసాల వల్ల సామాజిక అసమానతలు మరింత పెరిగే ప్రమాదముందని హెచ్చరించారు. అదే సమయంలో బాధ్యతాయుతమైన వినియోగ పద్ధతులను అలవాటు చేసుకోవాలని కోరారు. ఏసీ వంటి పరికరాల్లో సరైన ఉష్ణోగ్రతలను పాటించటం ద్వారా విద్యుత్ డిమాండ్‌ను గణనీయంగా తగ్గించవచ్చని తద్వారా జాతీయ వనరుల ఆదాకు తోడ్పడవచ్చని తెలిపారు.
ప్రపంచ వాతావరణ పరిరక్షణ చర్యల్లో 140 కోట్లకు పైగా జనాభా గల భారత్ కీలక పాత్ర పోషిస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. వేడి, శీతలీకరణ నిర్వహణలో మన దేశం అనుసరించే విధానం కేవలం మన దేశంపైనే కాక, ప్రపంచంపైనా ప్రభావం చూపుతుందన్నారు.
ఈ సదస్సులో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వ సంస్థలు, పరిశోధన సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు కలిసికట్టుగా కృషి చేయటం ద్వారానే ఆచరణాత్మకమైన, విస్తరించదగిన, సమ్మిళిత పరిష్కారాలను అభివృద్ధి చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. అటువంటి ఉమ్మడి ప్రయత్నాలే కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఇలాంటి వేదికల ద్వారా ఆచరణాత్మక ఫలితాలు రావాలని పిలుపునిస్తూ మంత్రి ప్రసంగాన్ని ముగించారు. తక్షణ, ఆచరణాత్మక చర్యలతో పరిష్కారాలు ప్రారంభం కావాలని.. అదే సమయంలో దీర్ఘకాలిక సుస్థిర లక్ష్యాల సాధనకు దోహదపడేలా ఉండాలని ఆయన పేర్కొన్నారు.




***
(రిలీజ్ ఐడి: 2254231)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15