బొగ్గు మంత్రిత్వ శాఖ
ఇంధన భద్రతే లక్ష్యంగా బొగ్గు మంత్రిత్వ శాఖ చర్యలు
కీలక భాగస్వాములతో సంప్రదింపుల సమావేశం.. 15వ విడత వాణిజ్య బొగ్గు గనుల వేలం ప్రారంభం
నాడు పోస్టు చేయడమైనది:
17 APR 2026 6:00PM by PIB Hyderabad
బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘ఆత్మనిర్భర్ భారత్: ఇంధన భద్రత కోసం బొగ్గు’ అంశంపై నేడు భాగస్వాముల సంప్రదింపుల సమావేశం జరిగింది. దీంతోపాటు 15వ విడత వాణిజ్య బొగ్గు గనుల వేలం ప్రక్రియను కూడా ప్రారంభమైంది. ఇది భారత ఇంధన భద్రతను బలోపేతం చేయడంలో బొగ్గు రంగంలో స్వయం సమృద్ధిని పెంపొందించడంలో మరో కీలక మైలురాయిగా నిలిచింది. దేశ బొగ్గు రంగ భవిష్యత్తును తీర్చిదిద్దే సంస్కరణలు, సాంకేతిక పురోగతి, బొగ్గును వాయువుగా మార్చే ప్రక్రియ, సుస్థిరత, సమగ్ర వృద్ధి వంటి అంశాలపై విధానకర్తలు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, నిపుణులు, వాటాదారులు పాల్గొని చర్చించారు.
బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అదనపు కార్యదర్శి, నామినేటెడ్ అధికారి శ్రీమతి రూపేందర్ బ్రార్, బొగ్గు నియంత్రణాధికారి శ్రీ సజీష్ కుమార్ ఎన్, మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, పారిశ్రామిక వేత్తలు, బొగ్గు రంగానికి చెందిన కీలక వ్యక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
15వ విడత వాణిజ్య బొగ్గు గనుల వేలాన్ని బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్ ప్రారంభించారు. 15వ విడతలో మొత్తం 11 బొగ్గు గనులను వేలం వేస్తున్నారు. వీటిలో 7 పూర్తిగా అన్వేషించిన గనులు, 4 పాక్షికంగా అన్వేషించిన గనులు ఉన్నాయి. వీటిలో 3 గనులను బొగ్గు గనుల (ప్రత్యేక నిబంధనలు) చట్టం 2015 (సీఎంఎస్‌పీ) కింద, 8 గనులను గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టం 1957 (ఎంఎండీఆర్ కింద వేలం వేస్తున్నారు. ఇందులో 1 కోకింగ్ బొగ్గు గని ఉండగా, మిగిలిన 10 నాన్-కోకింగ్ బొగ్గు గనులు ఉన్నాయి. ఇవి ఉక్కు, విద్యుత్ వంటి కీలక రంగాల అవసరాలను తీరుస్తాయి. అదనంగా 13వ విడత రెండో ప్రయత్నంలో మిగిలిపోయిన 6 బొగ్గు గనులను కూడా వేలం వేస్తున్నారు.
వేలం వేస్తున్న ఈ గనులు జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, తెలంగాణ వంటి బొగ్గు/లిగ్నైట్ నిక్షేపాలు కలిగిన రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇవి గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు దేశీయంగా బొగ్గు లభ్యతను పెంచి, ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని భావిస్తున్నారు.
ఇప్పటివరకు 13 విడతల వాణిజ్య బొగ్గు గనుల వేలం ద్వారా 135 బొగ్గు గనులను బొగ్గు మంత్రిత్వ శాఖ విజయవంతంగా వేలం వేసింది. వీటి వార్షిక గరిష్ట ఉత్పత్తి సామర్థ్యం (పీఆర్‌సీ) సుమారు 325 మిలియన్ టన్నులుగా ఉంది. ఇది భారత బొగ్గు సామర్థ్యాన్ని వెలికితీయడంలో ఉన్న బలమైన వేగాన్ని ప్రతిబింబిస్తుంది.
బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్ మాట్లాడుతూ.. బొగ్గు రంగంలో చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఉన్నాయని తెలిపారు. పారదర్శకత, సామర్థ్యం, బొగ్గు రంగం పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడంపై నిరంతర దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. 2020లో వాణిజ్య బొగ్గు గనుల తవ్వకం విధానాలను ప్రవేశపెట్టడం ఈ రంగంలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలికిందని.. ఇది మెరుగైన పోటీకి, ప్రైవేటు రంగ భాగస్వామ్యానికి, దేశీయ పరిశ్రమలకు బొగ్గు లభ్యతను పెంచడానికి మార్గం సుగమం చేసిందని చెప్పారు. ఇప్పటి వరకు సాధించిన పురోగతిని వివరిస్తూ.. వేలం వేసిన గనుల సంఖ్య పెరగడం, పెట్టుబడిదారుల ఆసక్తి పెంపొందడం, దేశీయ సరఫరా వ్యవస్థ బలోపేతం కావడం వంటి గణనీయమైన ఫలితాలను ఈ విధానం అందించిందని పేర్కొన్నారు. వరుసగా జరుగుతున్న వేలం రౌండ్లలో పాల్గొనేవారి సంఖ్య నిలకడగా పెరుతుండటంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది భాగస్వాములలో బలమైన, పెరుగుతున్న నమ్మకాన్ని సూచిస్తోందని అన్నారు. ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖల సమన్వయంతో కూడిన విధానం గురించి ఆయన ప్రస్తావించారు. విధానపరమైన అడ్డంకులను తొలగించడంలో, నియంత్రణ ప్రక్రియలను సరళీకరించడంలో, అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించడంలో వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమల భాగస్వాముల మధ్య సమన్వయం, సహకార ప్రయత్నాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ సమష్టి ప్రయత్నాలు బొగ్గు ఉత్పత్తిని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడమే కాకుండా దేశ ఆర్థిక వృద్ధి పథానికి గణనీయంగా దోహదపడతాయని ఆయన తెలిపారు.
సుస్థిరత, సమాజ సంక్షేమం, సాంకేతిక పురోగతి వంటి అనేక అంశాలపై మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని శ్రీ దత్ వివరించారు. శాస్త్రీయ పద్ధతిలో గనుల మూసివేత ప్రాముఖ్యతను ఆయన తెలిపారు. బొగ్గు తవ్వకం పూర్తయిన ప్రాంతాలను కేవలం ఖాళీ ప్రదేశాలుగా వదిలేయకుండా, వాటిని అందరి భాగస్వామ్యంతో పచ్చని ఆవాసాలుగా మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. తద్వారా పర్యావరణాన్ని పునరుద్ధరించడమే కాకుండా, స్థానిక ప్రజల సంక్షేమానికి, దీర్ఘకాలిక సామాజిక స్థిరత్వానికి భరోసా ఇవ్వవచ్చని తెలిపారు. బొగ్గు నిక్షేపాలు ఉన్న ప్రాంతాల్లో సానుకూల మార్పు తీసుకురావడంలో సీఎస్‌ఆర్ కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, స్థానిక ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి, ఆ ఫలాలను పొందేలా చేయడానికి ఈ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని అన్నారు. సాంకేతికత పరంగా బొగ్గును స్వచ్ఛమైన, అత్యంత సమర్థవంతమైన మార్గంలో వినియోగించుకోవడానికి బొగ్గు గ్యాసిఫికేషన్‌పై ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని వివరించారు. దీనికి ‘వయబిలిటీ గ్యాప్ ఫండింగ్’ వంటి విధానపరమైన చర్యల మద్దతు ఉందని, గత వేలం రౌండ్లలోనే భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ బ్లాకులను కేటాయించినట్లు గుర్తు చేశారు. మారుతున్న ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా భారత ఇంధన భద్రతను కాపాడుకోవడానికి దేశీయ బొగ్గు ఉత్పత్తిని పెంచడం ఎంతో ముఖ్యమని ఆయన చెప్పారు. రాబోయే వాణిజ్య బొగ్గు గనుల వేలం దశలలో భాగస్వాములందరూ చురుగ్గా పాల్గొనాలని, ఈ రంగం వృద్ధికి అర్థవంతమైన సహకారాన్ని అందిస్తూ.. పటిష్టమైన, సమగ్రమైన, స్వయం సమృద్ధి కలిగిన బొగ్గు రంగం వైపు సమష్టిగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి రూపేందర్ బ్రార్ ప్రసంగిస్తూ.. నిర్ణయాత్మకమైన, భవిష్యత్తు కార్యాచరణతో కూడిన దిశానిర్దేశం చేశారు. వృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు, సామాజిక శ్రేయస్సుకు మధ్య సమతుల్యతను పాటిస్తూ.. బాధ్యతాయుతమైన విధానంతో బొగ్గు ఉత్పత్తిని వేగవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఉత్పత్తి పరిమాణం ఎంత పెరిగినా, అది సుస్థిరతతో కూడి ఉండాలని చెప్పారు. బొగ్గు రంగంలో చేపట్టిన సంస్కరణల విప్లవాత్మక ప్రభావాన్ని వివరిస్తూ.. పారదర్శకత, స్థిరమైన విధానాలు, సులభతర వాణిజ్యం అనేవి పెట్టుబడులను ఆకర్షించడానికి, పోటీని పెంచడానికి, కొత్త ఆర్థిక మార్గాలను అన్వేషించడానికి కీలకమని చెప్పారు. ప్రపంచంలోనే భారత్ రెండో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారుగా ఉన్నప్పటికీ.. ఈ రంగానికి అంతకు మించిన సామర్థ్యం ఉందని, ఉపాధి కల్పనకు, పారిశ్రామిక వృద్ధికి, జాతీయ ఇంధన భద్రతకు బొగ్గు రంగం ఒక శక్తిమంతమైన ఇంజిన్ లాంటిదని ఆమె పేర్కొన్నారు.
ఆవిష్కరణలపై దృష్టి సారిస్తూ.. ఉపరితల, భూగర్భబొగ్గు వాయువీకరణ మార్గాలను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. భూగర్భ బొగ్గు వాయువీకరణ కోసం అవసరమైన మార్గదర్శకాలను ఇప్పటికే జారీ చేశామని, ఇటువంటి ప్రాజెక్టులను సులభతరం చేయడానికి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఇప్పటికే సూచన నియమావళి విధానాలను అందించిందని ఆమె పేర్కొన్నారు. శాస్త్రీయ పద్ధతిలో గనుల మూసివేత ప్రాముఖ్యతను వివరించారు. గనుల తవ్వకం పూర్తయిన తర్వాత ఆ భూమిని బాధ్యతాయుతంగా వినియోగించడం ద్వారా ఆ ప్రాంతాలను సమాజానికి ఉపయోగపడే ఆస్తులుగా మార్చాలని ఆమె సూచించారు. బాధ్యత, మానవీయ కోణాలకు తగిన ప్రాధాన్యతనిస్తూ.. పర్యావరణ పునరుద్ధరణను, దీర్ఘకాలిక సామాజిక స్థిరత్వాన్ని నిర్ధారించాలని కోరారు. మొత్తం రంగాన్ని ఏకీకృతం చేసే విధానాన్ని బలపరుస్తూ.. సామర్థ్యాన్ని పెంచడానికి, ఉత్తమ పద్ధతులను అవలంబించడానికి, సుస్థిర గనుల తవ్వకం సాంకేతికతలను విస్తరించడానికి ప్రభుత్వం, పరిశ్రమలు, భాగస్వాముల మధ్య మధ్య సహకారం అవసరమని తెలిపారు. భాగస్వాములందరూ చురుగ్గా పాల్గొని, తమ అభిప్రాయాలను పంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సంప్రదింపుల సమావేశం దృఢమైన, సమగ్రమైన, స్వయం సమృద్ధి కలిగిన బొగ్గు పర్యావరణ వ్యవస్థ వైపు ఒక అర్థవంతమైన అడుగు కావాలని ఆకాక్షించారు.
ఈ భాగస్వాముల సంప్రదింపుల సమావేశం బొగ్గు రంగ పరివర్తనకు సంబంధించిన కీలక అంశాలపై లోతైన చర్చలకు వేదికైంది. సామర్థ్యాన్ని, విలువను పెంచడానికి సాంకేతికతను అవలంబించడం, ఆవిష్కరణలు, బొగ్గు వాయువీకరణ వంటి అంశాలపై ప్రధానంగా చర్చలు జరిగాయి. అలాగే పునరావాసం, పునరావాస కల్పన, భూమిని ఇతర అవసరాలకు వినియోగించడం, కార్మిక సంక్షేమం, కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్), సమాజాలతోపాటు వాటాదారులందరినీ కేంద్ర బిందువుగా చేసుకుని సాగే న్యాయబద్ధమైన మార్పు ద్వారా సమగ్ర వృద్ధిని సాధించడంపై చర్చించారు. దీనితో పాటు పర్యావరణహిత గనుల తవ్వకం, పర్యావరణ బాధ్యతను ప్రోత్సహించే సుస్థిర చర్యలపై కూడా దృష్టి సారించారు. ఈ కార్యక్రమాలన్నీ ఆధునిక, బాధ్యతాయుతమైన, భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉన్న, స్వయం సమృద్ధి కలిగిన బొగ్గు రంగానికి సంబంధించిన ఒక సమగ్ర ప్రణాళికను ప్రతిబింబించాయి. చర్చల అనంతరం భాగస్వాములతో పరస్పర ప్రశ్నోత్తరాల సమయం నిర్వహించారు. ఇది అభిప్రాయాల మార్పిడికి ఒక విలువైన వేదికను అందించింది.
బొగ్గు మంత్రిత్వ శాఖ ఈ రంగాన్ని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా, దృఢమైన, అంతర్జాతీయంగా పోటీ పడగలిగే బొగ్గు పర్యావరణ వ్యవస్థ వైపు నడిపిస్తోంది. 15వ విడత వాణిజ్య బొగ్గు గనుల వేలం కొత్త పెట్టుబడి మార్గాలను అన్వేషించేదుకు, దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు, దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ సంప్రదింపుల సమావేశం నిరంతర భాగస్వామ్యం, ఆవిష్కరణలు సుస్థిర పద్ధతుల పట్ల మంత్రిత్వ శాఖకు ఉన్న నిబద్ధతను చాటిచెప్పడమే కాకుండా, అభివృద్ధి చెందుతున్న ప్రపంచ వాస్తవాలు, జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా బొగ్గు రంగం అభివృద్ధి చెందేలా చూస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2253225)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7