కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
టెలికాం ఆధారిత ఆర్థిక మోసాలపై పోరాటాన్ని బలోపేతం చేసే దిశగా డీవోటీ, సెబీ మధ్య కుదిరిన ఎంవోయూ
సెక్యూరిటీల మార్కెట్ మోసాలను ముందుగానే గుర్తించి పెట్టుబడిదారులను రక్షించేందుకు ఉద్దేశించిన వ్యూహాత్మక సమాచార భాగస్వామ్యం
నాడు పోస్టు చేయడమైనది:
15 APR 2026 5:00PM by PIB Hyderabad
భారత ఆర్థిక వ్యవస్థ భద్రతను పటిష్టం చేసే దిశగా చేపట్టిన కీలక చర్యలో భాగంగా.. టెలికమ్యూనికేషన్ల విభాగం, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) మధ్య వ్యూహాత్మక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. సెక్యూరిటీల మార్కెట్ మోసాలు, పెట్టుబడి సంబంధిత కుంభకోణాల్లో టెలికాం వనరుల దుర్వినియోగాన్ని అరికట్టడంలో సహకారాన్ని విస్తరింపజేయడమే ఈ ఒప్పందం ఉద్దేశం.
ఈ ఒప్పందంపై డీవోటీలోని ఏఐ అండ్ డిజిటల్ ఇంటిలిజెన్స్ యూనిట్ (ఏఐ అండ్ డీఐయూ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీ సంజీవ్ కుమార్ శర్మ, సెబీలో పూర్తికాల సభ్యులు శ్రీ సందీప్ ప్రధాన్ సంతకాలు చేశారు. డిజిటల్ కమ్యూనికేషన్ల కమిషన్ సభ్యులు (సేవలు) శ్రీ దేబ్ కుమార్ చక్రబర్తి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. టెలికాం నిఘా వ్యవస్థలు, ఆర్థిక మార్కెట్ నియంత్రణా సంస్థల మధ్య బలమైన సహకారం దిశగా వేసిన ముందడుగుని ఇది సూచిస్తుంది.

డీవోటీ-సెబీ భాగస్వామ్యంలో ముఖ్యాంశాలు
మోసపూరిత కార్యకలాపాలను ముందుగానే గుర్తించి అడ్డుకోవడమే లక్ష్యంగా నిర్మాణాత్మక సమాచార భాగస్వామ్య వ్యవస్థ ఈ ఒప్పందంలో ప్రధాన భాగంగా ఉంది. బహుముఖ విశ్లేషణ ద్వారా అనుమానాస్పద చర్యలతో ముడిపడి ఉన్న మొబైల్ నంబర్లను గుర్తించేలా ఆర్థిక మోసాల ముప్పు సూచీ (ఎఫ్ఆర్ఐ)ను సెబీతో డీవోటీ పంచుకుంటుంది. మొబైల్ నంబర్ రివోకేషన్ లిస్టు (ఎంఎన్ఆర్ఎల్)ను కూడా పంచుకుంటుంది. దీని వల్ల ప్రస్తుతం పనిచేస్తున్న, చెల్లుబాటయ్యే మొబైల్ కనెక్షన్లతో మాత్రమే పెట్టుబడిదారుల ఖాతాలను అనుసంధానించే వీలు మధ్యవర్తులు, ఆస్తి నిర్వహణ సంస్థలతో సహా సెబీ నియంత్రిత సంస్థలకు కలుగుతుంది. ఈ ఒప్పందంలో భాగంగా.. సైబర్ మోసాలు, నకిలీ లేదా మనీ మ్యూల్ కార్యకలాపాలతో సంబంధం ఉన్న ఖాతాలకు అనుసంధానమైన టెలికాం నంబర్లకు సంబంధించిన సమాచారాన్ని సెబీ అందిస్తుంది. తద్వారా టెలికాం విభాగంలో సత్వరమే చర్యలు తీసుకోవడానికి వీలు కలుగుతుంది.
డీవోటీకి చెందిన డిజిటల్ ఇంటిలిజెన్స్ వేదిక (డీఐపీ) ద్వారా ఈ సమాచార ప్రసారం జరుగుతుంది. ఈ వేదిక ఇప్పటి వరకు 1400కు పైగా భాగస్వాములను అనుసంధానించింది. తగిన చర్యలు చేపట్టే విధంగా సమాచారాన్ని వివిధ సంస్థలకు ఎప్పటికకప్పుడు చేరవేస్తుంది.

పెట్టుబడిదారుల భద్రత దిశగా చురుకైన, సమీకృత విధానం
భారత్‌లో డిజిటల్ పెట్టుబడుల రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ సహకారం ప్రత్యేక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. టెలికాం నిఘా వ్యవస్థలను మార్కెట్ పర్యవేక్షణ వ్యవస్థలతో ఏకీకృతం చేయడం ద్వారా... ఫిర్యాదులపై స్పందించే స్థాయి నుంచి ముందస్తు నివారణ చేపట్టే స్థాయికి మార్పులను తీసుకు వస్తుంది. సంచార్ సాథీలో టెలికాం విభాగం నిర్వహిస్తున్న చక్షు ద్వారా స్వీకరించిన సమాచారం ఆధారంగా ఆర్థిక మోసాల ముప్పు సూచీ - ఆర్థిక సంస్థలకు, లా ఎన్ఫోర్స్‌మెంట్ సంస్థలు ముందస్తు హెచ్చరికల వ్యవస్థగా పనిచేస్తుంది. ఇది ఆర్థిక మోసాలు జరగకముందే మోసపూరితమైనవని భావిస్తున్న మొబైల్ నంబర్లను ముందుగానే గుర్తిస్తుంది.
ప్రస్తుతం కొనసాగుతున్న డీవోటీ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన బలమైన పునాదిపై ఈ భాగస్వామ్యం నిర్మితమైంది. సంచార్ సాథీ పరిధిలో 88 లక్షలకు పైగా మోసపూరిత మొబైల్ నంబర్లను ఏఎస్‌టీఆర్ ఉపయోగించి నిలిపివేశారు. గడచిన పది నెలల్లో సుమారుగా రూ.2300 కోట్ల మేర ఆర్థిక నష్టాలు జరగకుండా నివారించడంలో ఎఫ్ఆర్ఐ తోడ్పడింది.
భవిష్యత్తులో సమన్వయ చర్యలకు, సంస్థాగత స్థాయిలో ప్రమాద సూచికలను పంచుకోవడానికి వీలు కల్పించే ప్రామాణిక కార్యాచరణ పద్ధతులను అభివృద్ధి చేయడంలో ఈ అవగాహన ఒప్పందం వీలు కల్పిస్తుంది. కొనసాగుతున్న సంప్రదింపులు, మారుతున్న సైబర్ ముప్పులను ఎదుర్కోవడంలో ఆచరణీయ యంత్రాంగాల సహాయంతో పెట్టుబడిదారుల భద్రతను గణనీయంగా బలోపేతం చేయడానికి, భారత డిజిటల్, ఆర్థిక వ్యవస్థలపై నమ్మకాన్ని పెంపొందించేందుకు డీవోటీ-సెబీ మధ్య కుదిరిన ఒప్పందం సహకరిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2252616)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9