ఔషధాల విభాగం
ఔషధ రంగంలో నూతన ఆవిష్కరణల ప్రోత్సాహానికి నిధులు, మౌలిక సదుపాయాలు, అమలు వేగాన్ని పెంచాలన్న పిలుపుతో ముగిసిన రెండు రోజుల ‘ఇండియా ఫార్మా-2026’ సదస్సు
రెండో రోజున వ్యూహాత్మక పెట్టుబడులు, భవిష్యత్ ప్రణాళికపై చర్చలు
800 మందికి పైగా ప్రతినిధులు, 60 మంది జాతీయ, అంతర్జాతీయ వక్తలతో విజయవంతంగా ముగిసిన 10 సెషన్లు
నాడు పోస్టు చేయడమైనది:
14 APR 2026 5:15PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఔషధ విభాగం, ఫిక్కీ, న్యూఢిల్లీలోని ఐపీఏ సహకారంతో నిర్వహించిన ‘ఇండియా ఫార్మా-2026’, 9వ ఎడిషన్ నేడు ఘనంగా ముగిసింది. భారత ఔషధ, బయోఫార్మా రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో కీలక చర్చలు, విశ్లేషణలు జరిగాయి.

ఈ సదస్సు రెండో రోజున ఔషధ రంగ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటం, ఆవిష్కరణల ఆధారిత వృద్ధికి బాటలు వేయటంపై దృష్టి సారిస్తూ రెండు ప్లీనరీ సెషన్లు, ఒక ముగింపు సెషన్ నిర్వహించారు. పరిశ్రమలు, ఆర్థిక రంగం, విద్యాసంస్థలు, విధాన రూపకల్పనకు చెందిన కీలక వ్యక్తులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఔషధ రంగం పరివర్తనలో వ్యూహాత్మక పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, వేగం కీలకమని స్పష్టం చేశారు. కేవలం పరిమాణం మాత్రమే కాక, అత్యాధునిక చికిత్స పద్ధతులు, నూతన ఆవిష్కరణల ద్వారా అభివృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవటంపై ఈ సమావేశాలు దృష్టి సారించాయి.
రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో 800 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. 6 ప్లీనరీ సెషన్లతో సహా మొత్తం 10 సెషన్లలో 60 మందికి పైగా వక్తలు ప్రసంగించారు. 20కిపైగా భాగస్వామ్య సంస్థలు ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించాయి.
సెషన్ ముగింపు సందర్భంగా రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ, ఔషధ విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీ సత్యప్రకాష్ టీ.ఎల్ ప్రసంగించారు. తదుపరి దశ వృద్ధికి మూడు అంశాలు.. నిధులు, మౌలిక సదుపాయాలు, వేగం అత్యంత కీలకమని వివిధ చర్చా సమావేశాల్లో ఏకాభిప్రాయం వ్యక్తమైందని పేర్కొన్నారు. వీటి ప్రాధాన్యతలపై భాగస్వామ్య పక్షాల మధ్య భిన్నాభిప్రాయాలున్నప్పటికీ, ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య సమన్వయ చర్యలు అవసరమని అందరూ ఏకీభవించినట్లు చెప్పారు. అంతర్జాతీయంగా మారుతున్న ఔషధ రంగ ముసాయిదాలో భారత్ పోటీతత్వాన్ని నిలుపుకోవాలంటే, అందరూ కలిసికట్టుగా క్రియాశీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఇవాళ ఉదయం రెండు ప్లీనరీ సెషన్లు జరిగాయి. "డెవలపింగ్ ఎ వైబ్రెంట్ ఫార్మా ఫైనాన్సింగ్ ఎకోసిస్టమ్" అంశంపై జరిగిన సెషన్లో, ఔషధ ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లటంలో సమయానుకూల, వ్యూహాత్మక పెట్టుబడుల కీలక పాత్రను స్పష్టం చేశారు. ఈ రంగంలో నిరంతర వృద్ధి కేవలం శాస్త్రీయ పురోగతిపైనే కాక, విభిన్నమైన, సులభంగా అందుబాటులో ఉండే ఆర్థిక విధానాలపైనా ఆధారపడి ఉంటుందని వక్తలు అభిప్రాయపడ్డారు. అనుసంధన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఏఎన్ఆర్ఎఫ్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ శివకుమార్ కళ్యాణరామన్ మాట్లాడుతూ.. మారుతున్న పరిశోధనా నిధుల విధానాలను వివరించారు. విద్యాసంస్థలు, లాభాపేక్ష లేని సంస్థలకు గ్రాంట్ల రూపంలో మద్దతిస్తూనే, ప్రైవేట్ రంగానికి పెట్టుబడి ఆధారిత సాధనాల ద్వారా నిధులందించే విధానాన్ని రూపొందించినట్లు తెలిపారు.
ఔషధ సంస్థల వృద్ధికి నూతన బాటలు వేస్తున్న వెంచర్ క్యాపిటల్, ప్రైవేట్ ఈక్విటీ, బ్లెండెడ్ ఫైనాన్స్, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాల వంటి వివిధ నిధుల మార్గాలను ఈ చర్చలో అన్వేషించారు. పటిష్టమైన, క్రియాశీలకంగా స్పందించే ఆర్థిక వ్యవస్థ ఏర్పాటునకు పరిశ్రమలు, పెట్టుబడిదారులు, నియంత్రణ సంస్థలు, పరిశోధనా సంస్థల మధ్య బలమైన సహకారం అవసరమని స్పష్టం చేశారు. దీర్ఘకాలిక పరిశోధన, అభివృద్ధి వ్యవస్థలు, హై రిస్క్ పెట్టుబడులు, నియంత్రణపరమైన, మార్కెట్ అనిశ్చితుల వంటి అంశాలపై ప్యానల్ సభ్యులు చర్చించారు. ఆవిష్కరణలను వేగవంతం చేయటం, అంతర్జాతీయ స్థాయిలో పోటీతత్వాన్ని పెంపొందించటానికి ప్రారంభ పరిశోధన నుంచి వాణిజ్యీకరణ వరకు విలువ వ్యవస్థ అంతటా మద్దతిచ్చే వినూత్న ఆర్థిక నమూనాల ఆవశ్యకతను తెలియజేశారు.

భారత ఔషధ రంగం స్వల్ప మార్పులకే పరిమితం కాకుండా, ఆవిష్కరణల దిశగా సాహసోపేతమైన అడుగులు వేస్తూ తదుపరి దశకు చేరుకోవటంపై ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ సెక్రటరీ జనరల్ శ్రీ సుదర్శన్ జైన్ అధ్యక్షతన జరిగిన ఆరో ప్లీనరీ సెషన్ లో చర్చించారు. 'రిఫ్లెక్షన్స్ అండ్ బిగ్ మూవ్స్ టు లీప్‌ఫ్రాగ్ ఇన్నోవేషన్' అంశంపై ప్రసంగించిన భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగ మాజీ కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్.. భారతదేశ బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ వ్యవస్థ పరిణామాన్ని వివరించారు. గత దశాబ్ద కాలంలో పరిశోధన, అభివృద్ధి, అమలు వంటి విభాగాల్లో సమగ్రమైన ఆవిష్కరణల విలువ వ్యవస్థను నిర్మించటంలో భారత్ గణనీయమైన పురోగతిని సాధించిందని ఆమె స్పష్టం చేశారు. గతంలో వేర్వేరుగా ఉన్న విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య సంబంధాలను భారత్ విజయవంతంగా బలోపేతం చేయటం వల్ల వస్తువుల అభివృద్ధికి సమన్వయ వ్యవస్థ ఏర్పడింది. కొవిడ్-19 మహమ్మారి అనుభవాన్ని ప్రస్తావిస్తూ.. దాన్ని టెస్ట్‌బెడ్‌గా అభివర్ణించారు. ఆర్థిక సహాయం, భాగస్వామ్యాలు, మౌలిక సదుపాయాలు, వేగవంతమైన ఆవిష్కరణల వంటి రంగాల్లో భారత్ సామర్థ్యాన్ని ఇది నిరూపించిందని ఆమె అన్నారు.
ఔషధ రంగంలో ఆవిష్కరణలు రిస్క్‌తో కూడుకున్నవని, ఈ రిస్క్‌ను వివిధ వాటాదారుల మధ్య పంచుకోవటానికి తగిన వ్యవస్థలు అవసరమని సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ శ్రీ దిలీప్ సంఘ్వీ అన్నారు. పరిశోధన, అభివృద్ధిలో నిరంతర పెట్టుబడులు, రీయింబర్స్మెంట్ మార్గాల ప్రాముఖ్యత, భారతదేశంలో వినూత్న ఉత్పత్తుల శ్రేణిని ఏర్పాటు చేయటంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. జెనరిక్స్, వ్యాక్సిన్ల తయారీలో భారత్ ఇప్పటికే ప్రపంచ అగ్రగామిగా నిలిచినప్పటికీ, ప్రపంచ ఆరోగ్య రంగాన్ని ప్రభావితం చేసేందుకు తదుపరి దశలో సరికొత్త మందులు, అత్యాధునిక విజ్ఞాన శాస్త్రం దిశగా అడుగులు వేయాలని పేర్కొన్నారు. పరిశోధనలకు మరింత పటిష్టమైన ఆర్థిక సాయం అందించాలని, నూతన ఔషధాల కోసం మార్కెట్‌ను విస్తరించాల్సిన అవసరం ఉందని జైడస్ లైఫ్ సైన్సెస్ ఛైర్మన్ శ్రీ పంకజ్ పటేల్ స్పష్టం చేశారు.
ఫిక్కీ ఫార్మా కమిటీ కో-చైర్, ఎలీ లిల్లీ ఇండియా ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ శ్రీ విన్స్‌లో టక్కర్ మాట్లాడుతూ.. ఔషధ రంగంలో విజయవంతమైన మార్పునకు స్పష్టమైన వ్యూహాత్మక ఉద్దేశం ఉండాలి. దానికి తోడు నిర్ణీత కాల వ్యవధుల్లో సాధించాల్సిన లక్ష్యాలతో దశలవారీ ప్రణాళిక మద్దతు తప్పనిసరని స్పష్టం చేశారు.
ప్రభుత్వం, విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య లోతైన సహకారాన్ని పెంపొందించాల్సిన అవసరాన్ని పారిశ్రామిక ప్రముఖులు స్పష్టం చేశారు. ఏఐ పోషించే కీలక పాత్రను, భాగస్వాములందరిలో ఉండాల్సిన బాధ్యతాయుతమైన ధోరణి ప్రాముఖ్యతను వారు ప్రస్తావించారు.
ఔషధ రంగంలో భారత్ ఇప్పటికే బలమైన పునాదులను నిర్మించుకుందని, తదుపరి దశ వృద్ధికి పెట్టుబడులు, వ్యవస్థల మధ్య సహకారం, ఆవిష్కరణ ఆధారిత అభివృద్ధి అవసరమని.. అప్పుడే అత్యాధునిక చికిత్స రంగంలో ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ ఎదగగలదని ఈ చర్చలు స్పష్టం చేశాయి.
***
(రిలీజ్ ఐడి: 2252227)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15