శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కృత్రిమ మేధ అందుబాటులో ఉన్నా కూడా వైద్య విద్యలో బలమైన చికిత్స విధానానికి పునాది వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
బాలల్లో జీర్ణాశయాంతరశోధ, కాలేయ రుగ్మతలకు సంబంధించిన తాజా చికిత్స విధానాల్ని పొందుపరిచిన పాఠ్య పుస్తకాన్ని విడుదల చేసిన డాక్టర్ జితేంద్ర సింగ్
శిశువుల్లో జీర్ణాశయాంతర శోధ పాఠ్యపుస్తకం విస్తారిత సంచిక ఇది.. వైద్య విజ్ఞానశాస్త్రంలో శీఘ్ర పురోగతికి అద్దం పడుతోంది
జ్ఞానం శరవేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత కాలంలో, చికిత్స విధానంలో భావన-ఆధారిత శిక్షణకు ప్రాధాన్యాన్ని ఇవ్వాలని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టీకరణ
నాడు పోస్టు చేయడమైనది:
14 APR 2026 3:29PM by PIB Hyderabad
బాలల జీర్ణాశయాంత్ర శోధ సంబంధి వైద్య శాస్త్రం, కాలేయ వైద్యశాస్త్రం, పోషణ (‘‘పేడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజీ, హెపాటాలజీ అండ్ న్యూట్రిషన్’’) పేరుతో తీసుకు వచ్చిన స్నాతకోత్తర పాఠ్యగ్రంథం రెండో సంచికను కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు విడుదల చేశారు. కృత్రిమ మేధ (ఏఐ) పాత్ర రోజు రోజుకూ పెరుగుతున్న తరుణంలో, వైద్య విద్యలో రోగచికిత్స సంబంధిత పునాదిని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి పిలుపునిచ్చారు. డాక్టర్ జితేంద్ర సింగ్ వైద్య, మధుమేహ శాస్త్రాల విభాగంలో ప్రముఖ ఆచార్యుడు కూడా. ఆయన ఆవిష్కరించిన పాఠ్యగ్రంథానికి సంపాదకులుగా ప్రొఫెసర్ అనుపమ్ సిబల్, డాక్టర్ శరత్ గోపాలన్ వ్యవహరించారు. ముందుమాటను జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ క్యాథలీన్ బి. శ్వార్ట్‌జ్ రాశారు.
రోగచికిత్స విషయంలో బలమైన పునాదిని ఏర్పరిచిన తరువాత, ఏఐ విలువైన సహాయకారిగానూ, మార్గాన్ని సుగమం చేసేదిగానూ ఉపయోగపడగలదని మంత్రి అన్నారు. చికిత్స పద్ధతుల మూల తత్వాన్ని అర్థం చేసుకోకుండానే ఏఐ సాయాన్ని తీసుకొంటే అలాంటి వ్యక్తి ... ఏ ఉపకరణాలూ, యంత్ర సాధనాలు, పరిశోధనలు, మందులు కూడా దగ్గర లేని స్థితిలో.. సమాజానికి సేవలందించే సమర్థ వైద్యునిగా మారలేడన్నారు. ఆ వ్యక్తి మౌలిక శిక్షణ ప్రక్రియకు నోచుకోక పోయే ప్రమాదం పొంచి ఉంటుందని డాక్టర్ జితేంద్ర సింగ్ హెచ్చరించారు.
వైద్య విజ్ఞానం చాలా త్వరిత గతిన విస్తరిస్తున్న సంగతిని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావిస్తూ పరిశోధనలు, ప్రచురణల వేగం చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగిందన్నారు. ఈ కారణంగా చికిత్సకు సంబంధించిన శిక్షణలో భావనాత్మక స్పష్టత, మూలాధార రోగనిర్ధారణ శిక్షణలపై దృష్టి కేంద్రీకరించడం ఎంతో ఆవశ్యకంగా మారిందన్నారు. సరికొత్త సాంకేతికతలు సమాచారాన్ని సులభంగా అందుబాటులోకి తీసుకు వస్తున్నప్పటికీ, నేర్చుకొనే ప్రక్రియ కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. చికిత్స సంబంధిత ప్రాథమిక అవగాహన, అనుభవాలది కీలక పాత్ర అవుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
సాంకేతికత ఏకీకరణ, రోగాల్లో సంక్లిష్టతలు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఆయా సవాళ్లకు అనుగుణంగా వైద్య విద్య వ్యవస్థల స్థాయులను కూడా పెంచుకోవలసి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. వైద్య రంగంలో యువ వృత్తినిపుణులు పటిష్ఠ మౌలిక జ్ఞానాన్ని అభివృద్ధిపరుచుకోవాలని, వారు ఎంపిక చేసుకున్న రంగాల్లో నైపుణ్యాన్ని సాధించేలా వారిని ప్రోత్సహించాలని ఆయన సూచించారు.
పేడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజీ, హెపాటాలజీ అండ్ న్యూట్రిషన్ పాఠ్యగ్రంథం రెండో సంచికలో ఈ రంగంలో చోటు చేసుకున్న అతి నవీన పురోగతిని 45 అధ్యాయాల్లో పొందుపరచడమే కాక అనేక కొత్త విషయాలను కూడా చేర్చారు. ఈ పుస్తకంలో బాధాకర ఆంత్ర (పేగులకు సంబంధించిన) వ్యాధి, న్యూరో-గ్యాస్ట్రోఎంటరాలజీ, సిలియక్ డిసీజ్, గోవు పాల ప్రొటీన్ పట్ల ఎలర్జీ వంటి కీలక రంగాలతో పాటు జీర్ణాశయాంత్ర శోధ, కాలేయ సంబంధిత రోగాల్లో ఆనువంశికత పోషించే భూమిక, ఎండోస్కోపీ, కాలేయ మార్పిడి వంటి కొత్తగా తెర మీదకు వస్తున్న రంగాలకు సంబంధించిన విస్తృత సమాచారాన్ని అందించారు.
శిశువ్యాధి చికిత్సకుల దగ్గరకు వస్తున్న బాలల్లో జీర్ణక్రియకు, కాలేయానికి సంబంధించిన అనారోగ్యాల బాధితులు దాదాపు 30 శాతం ఉంటున్నారు. ఇది.. ఈ రంగంలో తాజా జ్ఞానానికి, ప్రత్యేక శిక్షణకి ఎంత ప్రాధాన్యం ఉందో చాటిచెబుతోంది. ఈ టెక్స్‌ట్‌బుక్‌ను శిశువైద్యంలో, బాలల జీర్ణాశయాంత్ర శోధ సంబంధి వైద్య శాస్త్రంలో శిక్షణ పొందుతున్న వారితో పాటు శిశువైద్యులకు కూడా బహుళోపయోగకరమైందిగా రూపొందించారు.
దీనికి సంపాదకులుగా అపోలో హాస్పిటల్స్ గ్రూపు మెడికల్ డైరెక్టరు, సీనియర్ పేడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు, హెపాటాలజిస్టు ప్రొఫెసర్ అనుపమ్ సిబల్‌తో పాటు ఢిల్లీలోని మధుకర్ రెయిన్‌బో బాలల ఆసుపత్రిలో కన్సల్టెంట్ పేడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు, హెపటాలజిస్టు డాక్టర్ శరత్ గోపాలన్ వ్యవహరించారు. సహ సంపాదకత్వ బాధ్యతను శ్రీనగర్ లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసరు, పేడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు, హెపాటాలజిస్టు డాక్టర్ మొహమ్మద్ ఇశాక్ మలిక్ నిర్వహించారు.
ఈ పుస్తకానికి ముందుమాటను జాన్సన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసరు క్యాథలీన్ బి. శ్వార్ట్‌జ్ రాశారు. ఈ పాఠ్యగ్రంథం మొదటి సంచికను 2016లో ప్రచురించారు. ఆ పుస్తకాన్ని అప్పటి కేంద్ర ఆరోగ్య మంత్రి ఆవిష్కరించారు. ప్రస్తుత రెండో సంచికలో ఈ రంగంలోని తాజా శాస్త్రీయ పరిణామాలనూ, రోగచికిత్స పద్ధతులనూ పొందుపరిచారు.




***
(రిలీజ్ ఐడి: 2252203)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15