సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
పార్లమెంటు ప్రాంగణంలోని ప్రేరణా స్థల్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 136వ జయంతి ఉత్సవాలు
నాడు పోస్టు చేయడమైనది:
14 APR 2026 10:55PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని పార్లమెంటు భవన ప్రాంగణంలో ప్రేరణా స్థల్ వద్ద ఏప్రిల్ 14, 2026న అంబేద్కర్ 136వ జయంతి ఉత్సవాలను భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ (డీఏఎఫ్) నిర్వహించింది.
బాబాసాహెబ్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించటంతో ఈ స్మారక కార్యక్రమం ప్రారంభమైంది. భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి, డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ వీరేంద్ర కుమార్, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ కిరణ్ రిజిజు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు శ్రీ మల్లికార్జున ఖర్గేలు నివాళులర్పించారు. వీరితో పాటు జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్‌పర్సన్ శ్రీ కిషోర్ మక్వానా, కేంద్ర న్యాయశాఖ (స్వతంత్ర బాధ్యత) మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘవాల్, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత శాఖ (స్వతంత్ర బాధ్యత) మంత్రి శ్రీ జయంత్ చౌదరి, సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయమంత్రులు శ్రీ రామ్‌దాస్ అథవాలే, శ్రీ బి.ఎల్. వర్మ, ఢిల్లీ ప్రభుత్వ సామాజిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ రవీందర్ సింగ్ (ఇంద్రాజ్), జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్‌పర్సన్ సాధ్వి నిరంజన్ జ్యోతితో పాటు ఇతర పార్లమెంటు సభ్యులు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బౌద్ధ బిక్షువుల ప్రార్థనలు, సాంస్కృతిక ప్రదర్శనలతో వేడుకలు ఘనంగా జరిగాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను, వారసత్వాన్ని స్మరించుకుంటూ సంగీతం, నాటక విభాగం కళాకారులు హృదయాన్ని హత్తుకునేలా గీతాలను ఆలపించారు.
ఈ కార్యక్రమానికి సాధారణ పౌరులను అనుమతించటంతో, వేలాది మంది ప్రజలు తరలివచ్చి, బాబాసాహెబ్ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితాన్ని, ఆయన విశేష కృషిని గౌరవిస్తూ.. డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్, ఏటా అంబేద్కర్ జయంతిని నిర్వహిస్తుంది. సామాజిక సంస్కర్త, న్యాయకోవిదుడు, ఆర్థికవేత్త, భారత రాజ్యాంగ రూపశిల్పి అయిన అంబేద్కర్ గొప్ప దార్శనికుడు. సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్యం పట్ల ఆయనకున్న అంకితభావం నేటికీ భారత ప్రజలకే కాక, ప్రపంచవ్యాప్తంగా ఎందరికో స్ఫూర్తినిస్తూనే ఉంది.
డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ అధికారులు అంకితభావంతో చేసిన కృషి వల్లే 136వ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా, విజయవంతంగా జరిగాయి.
***
(రిలీజ్ ఐడి: 2252176)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11