రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
సరిహద్దు వాణిజ్యానికి కీలక మార్గంగా మారిన బారాబంకి - బహ్రైచ్ రహదారి
నాడు పోస్టు చేయడమైనది:
11 APR 2026 12:24PM by PIB Hyderabad
దక్షిణాసియాలో అత్యంత క్రీయాశీలకమైన భూమార్గ వాణిజ్య సంబంధాలను భారత్, నేపాల్ కలిగి ఉన్నాయి. నేపాల్ మొత్తం విదేశీ వాణిజ్యంలో 60 శాతం కంటే ఎక్కువ వాటాతో భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఇరు దేశాల లోతైన ఆర్థిక పరస్పర ఆధార సంబంధాలను ఇది ప్రతిబింబిస్తుంది. జాతీయ రహదారి-927లో భాగంగా బారాబంకి-బహ్రైచ్ మధ్య 4 లైన్ల నియంత్రిత ప్రవేశం కలిగిన రహదారి నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక మార్పునకు శ్రీకారం చుట్టనుంది.
వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన రూపైదిహా భూమార్గ ఓడరేవు, దాని సమీపంలోని నేపాల్ గంజ్ నగరానికి ఈ ప్రాజెక్టు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఇది సరిహద్దు వాణిజ్యాన్ని పెంచడమే కాకుండా, ప్రాంతీయ జీవనోపాధులకు మద్దతిస్తుంది. ఇరు పొరుగు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందిస్తుంది. వివిధ సరిహద్దు పాయింట్లలో రూపైదిహా – నేపాల్‌గంజ్ మార్గం అత్యంత ముఖ్యమైనది. భారత్ నుంచి నేపాల్‌కు జరిగే అత్యధిక ఎగుమతులు ఈ మార్గం ద్వారానే జరుగుతాయి. ఇప్పుడు నిర్మించబోయే కొత్త ఎన్‌హెచ్-927 రహదారి ద్వారా ప్రయాణం వేగవంతం కావడమే కాకుండా, రాబోయే ఏళ్లలో ఈ మార్గంలో వాణిజ్యం మరింత భారీగా పెరగనుంది.
రెండు దేశాల మధ్య ఆహార, వ్యవసాయ వాణిజ్యానికి తోడ్పాటు
భారత్-నేపాల్ మధ్య ఈ మార్గం ద్వారా జరిగే వాణిజ్యంలో వ్యవసాయ, ఆహార ఉత్పత్తుల రవాణా అత్యంత ముఖ్యమైనది. నేపాల్ ప్రజల రోజువారీ అవసరాల కోసం బియ్యం, గోధుమలు, కూరగాయలు, పాడి ఉత్పత్తులు, పశుగ్రాసం మోసుకెళ్లే ట్రక్కులు భారతీయ మార్కెట్ల నుంచి నిరంతరం అక్కడికి చేరుతుంటాయి. ఈ రహదారి ప్రాజెక్టు వల్ల బారాబంకి - బహ్రైచ్ మధ్య ప్రయాణ సమయం 150 నిమిషాల నుంచి 75 నిమిషాలకు.. అంటే దాదాపు 50 శాతం తగ్గుతుందని భావిస్తున్నారు. అంతేగాక వాహనాల సగటు వేగం గంటకు 40 కి.మీ నుండి 80 కి.మీకు పెరుగుతుంది. ప్రయాణం వేగవంతం కావడం వల్ల కూరగాయలు, పాలు వంటి త్వరగా పాడైపోయే వస్తువులు వృథా కాకుండా ఉంటాయి. దీంతో సరిహద్దుకు ఇరువైపులా ఉన్న రైతులు, వ్యాపారులు నేరుగా ప్రయోజనం పొందుతారు. మెరుగైన అనుసంధానం వల్ల తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని జిల్లాల రైతులు నేపాల్‌లోని పెద్ద మార్కెట్లను సులభంగా చేరుకోగలుగుతారు. తద్వారా వారి ఆదాయాలు పెరిగి, పంట కోత అనంతర నష్టాలు తగ్గే అవకాశం ఉంది.
నిత్యావసర వస్తువుల నిరంతర సరఫరా
వ్యవసాయ ఉత్పత్తులే కాకుండా ఈ కారిడార్ ద్వారా మందులు, ఇతర వినియోగ వస్తువుల రవాణా కూడా జరుగుతుంది. నేపాల్ ఆర్థిక వ్యవస్థకు, అక్కడి ప్రజల దైనందిన జీవితానికి ఈ సరఫరా చాలా కీలకం. స్థిరమైన సరఫరా వ్యవస్థను కొనసాగించడానికి నిరాటంకమైన రవాణా మార్గాలు చాలా అవసరం. గతంలో వ్యాపార కార్యకలాపాలు మందగించిన సమయాల్లో సరిహద్దుల వద్ద రవాణా ఇంధనం, కూరగాయలు, ఇతర సరుకులతో ఉన్న వందలాది ట్రక్కులు నిలిచిపోయేవి. దీనివల్ల రోజుకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లడమే కాకుండా వ్యాపారులు, వినియోగదారులు కూడా ప్రభావితమయ్యారు. ఇప్పుడు నిర్మించబోయే ఆధునిక రహదారి వల్ల ఇటువంటి జాప్యాలు తగ్గి, రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయి. ఫలితంగా వినియోగదారులకు, వ్యాపారులకూ మేలు జరుగుతుంది.
సరుకు రవాణా వృద్ధికి ఊతం
మెరుగుపడిన ఈ రహదారి వ్యవస్థ రూపైదిహా వద్ద సరుకు రవాణా సౌకర్యాల అభివృద్ధికి తోడ్పాటునందిస్తుంది. ఇక్కడ రోజువారీ ట్రక్కుల రాకపోకలు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు, ఇది సరిహద్దు వాణిజ్య పరిమాణంలో బలమైన వృద్ధి సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఈ పెరిగిన రాకపోకల వల్ల ఈ కారిడార్ పొడవునా గిడ్డంగులు, రవాణా సేవలు, సరుకు నిర్వహణ వ్యాపారాలకు అనేక అవకాశాలు లభిస్తాయి.
సరిహద్దు ప్రాంత ప్రజల జీవితాల్లో మార్పు
బారాబంకి – బహ్రైచ్ రహదారి వల్ల కలిగే అత్యంత ముఖ్యమైన ప్రభావం బహ్రైచ్ జిల్లా, దాని చుట్టుపక్కల సరిహద్దు జిల్లాల్లో నివసించే ప్రజలపై కనిపిస్తుంది. రూపైదిహా సమీపంలోని పట్టణాల్లో ఉన్న సరిహద్దు మార్కెట్లు ప్రధానంగా సరిహద్దు అవతలి వైపు వినియోగదారులపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. కొన్ని స్థానిక వ్యాపారాల ప్రకారం.. తమ అమ్మకాలలో అధిక భాగం నేపాల్ కొనుగోలుదారులపైనే ఆధారపడి ఉంది.
మెరుగైన రహదారి అనుసంధానం వల్ల ఈ కింది ప్రయోజనాలు కలుగుతాయని అంచనా
· వ్యాపారులకు మరిన్ని వ్యాపార అవకాశాలు
· రవాణా, సరుకు నిర్వహణ రంగంలో పెరిగిన ఉపాధి
· హోటళ్లు, భోజనశాలలు, చిన్న రిటైల్ దుకాణాల వృద్ధి
· వైద్యం, విద్య, మార్కెట్లకు మెరుగైన సౌలభ్యం
· ట్రక్ డ్రైవర్లు, రైతులు, చిన్న వ్యాపారులకు, వేగవంతమైన రహదారుల వల్ల అధిక ఆదాయం, తగ్గిన ఖర్చులు, మరింత నమ్మకమైన ఆదాయ అవకాశాలుగా మారతాయి.
***
(రిలీజ్ ఐడి: 2251294)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11