రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆధునిక కాంపోజిట్ స్లీపర్లను ప్రవేశపెట్టనున్న భారతీయ రైల్వేలు ట్రాక్ పర్యవేక్షణను మరింత మెరుగుపరచడానికి ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థలు

నాడు పోస్టు చేయడమైనది: 09 APR 2026 6:08PM by PIB Hyderabad

రైలు ప్రయాణం మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మారనుంది. రైల్వే మంత్రిత్వ శాఖలో ఈరోజు జరిగిన సమావేశంలో రైల్వే మంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఇందులో భాగంగా, వంతెనల వద్ద, పాయింట్లు, క్రాసింగ్‌ల వద్ద ఇకపై కాంపోజిట్ స్లీపర్లనే వాడాలని నిర్ణయించారు.

 

ప్రస్తుతం ఉన్న బరువువైన ఇనుము, సిమెంట్ దిమ్మలతో పోలిస్తే, ఈ కొత్త స్లీపర్లు బరువు తక్కువగా ఉండటమే కాకుండా ఎక్కువ భారాన్ని మోయగలవు. వీటి కుషనింగ్ కూడా మెరుగ్గా ఉంటుంది. వీటిని అమర్చడం, మరమ్మతులు చేయడం చాలా సులభం.

వీటిని ఉపయోగించే ప్రదేశం,  ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా ఈ స్లీపర్లను రూపొందించి అమర్చవచ్చు. వీటి వాడకం వల్ల, ముఖ్యంగా వంతెనలు, పాయింట్లు, క్రాసింగ్‌ల మీదుగా వెళ్లేటప్పుడు ప్రయాణికులకు మెరుగైన అనుభూతి కలుగుతుంది.

 

న్యూఢిల్లీలోని రైల్ భవన్‌లో ఈరోజు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రైల్వే మంత్రి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. సిమెంట్, ఇనుముతో పోలిస్తే, వివిధ మిశ్రమ పదార్థాలతో తయారైన ఈ కాంపోజిట్ స్లీపర్లు చదరపు సెంటీమీటరుకు 700 కిలోల వరకు భారాన్ని తట్టుకోగలవు. ఈ కాంపోజిట్ స్లీపర్లు ఎక్కువ కాలం మన్నుతాయి. వీటి వాడకం వల్ల రైల్వేకు ప్రస్తుతం ఉన్న స్లీపర్ల నిర్వహణ ఖర్చు కూడా తగ్గుతుంది.

రైల్వే ట్రాక్‌ల పర్యవేక్షణను ఇకపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా నిర్వహించాలని కూడా నిర్ణయించారు. దీని కోసం తనిఖీ వాహనాలలో ఒక ప్రత్యేక ఏఐ పరికరాన్ని అమరుస్తారు.  'గ్రౌండ్ పెనెట్రేషన్ రాడార్' అని పిలిచే ఈ పరికరం, ట్రాక్ పునాది స్థితిని అంచనా వేస్తుంది.

 

రైల్వే ట్రాక్‌లలో వెల్డింగ్ నాణ్యతను మరింత మెరుగుపరచడానికి ఒక కొత్త సాంకేతికత - మ్యాగ్నెటిక్ పార్టికల్ టెస్టింగ్ - ను వాడాలని నిర్ణయించారు. వెల్డింగ్ చేసిన చోట ఉండే అతి సూక్ష్మమైన లోపాలను గుర్తించడానికి ఈ పరీక్ష చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

 

ఈరోజు తీసుకున్న నిర్ణయాలన్నీ ప్రయాణికుల భద్రత పట్ల భారతీయ రైల్వేకు ఉన్న నిబద్ధతను చాటి చెబుతున్నాయి. ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడంలో రైల్వే శాఖ నిరంతర కృషిని, అంకితభావాన్ని కూడా ఈ నిర్ణయాలు స్పష్టం చేస్తున్నాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2250741) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Gujarati , Kannada