అంతరిక్ష విభాగం
azadi ka amrit mahotsav

స్పేస్‌క్రాఫ్ట్ మిషన్ ఆపరేషన్స్‌, ఎస్ఎంఓపీఎస్-2026 పై అంతర్జాతీయ సదస్సు

నాడు పోస్టు చేయడమైనది: 08 APR 2026 6:16PM by PIB Hyderabad

ఇన్నోవేటివ్ ఆపరేషన్స్ ఫర్ స్మార్ట్ అండ్ సస్టైనబుల్ స్పేస్ మిషన్ మేనేజ్‌మెంట్ – నెక్స్ట్ జనరేషన్"  ఇతివృత్తంతో "స్పేస్‌క్రాఫ్ట్ మిషన్ ఆపరేషన్స్: ఎస్ఎంఓపీఎస్-2026” అంతర్జాతీయ సదస్సు రెండవ ఎడిషన్, 2026 ఏప్రిల్ 8 నుంచి 10 వరకు బెంగళూరులో జరుగుతోంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రోనాటిక్స్ (ఐఏఏ) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు, అంతరిక్ష యాత్రల నిర్వహణ, అధునాతన మిషన్ డిజైన్, స్వయం చాలక వ్యవస్థలు, భారీ ఉపగ్రహ సమూహాల నిర్వహణ, మానవ సహిత అంతరిక్ష యాత్రలు, స్పేస్ రోబోటిక్స్, అంతరిక్ష విధానం, చంద్ర, గ్రహాంతర అన్వేషణ, అంతరిక్ష వ్యవస్థలలో సైబర్ భద్రత, కృత్రిమ మేధ, గ్రౌండ్ స్టేషన్ కార్యకలాపాలలో ప్రస్తుత, భవిష్యత్తు ధోరణులు వంటి అనేక అంశాలను చర్చిస్తుంది. అంతరిక్ష రంగంలోని అప్-స్ట్రీమ్, డౌన్-స్ట్రీమ్ విభాగాలలో భవిష్యత్ సాంకేతికతలను గురించి కూడా ఈ సదస్సు చర్చిస్తుంది. ఎస్ఎమ్ఓపిఎస్ లో భాగంగా 10వ తేదీన విద్యార్థులు,  యువ నిపుణుల కోసం ఒక ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహిస్తారు. 

ఇస్రో మాజీ చైర్మన్/డిఓఎస్ కార్యదర్శి శ్రీ ఏ ఎస్ కిరణ్ కుమార్ ఈ రోజు సదస్సును ప్రారంభించారు. ఇస్రో చైర్మన్/డిఓఎస్ కార్యదర్శి డాక్టర్ వి. నారాయణన్, యూఆర్ఎస్సి డైరెక్టర్ శ్రీ ఎం. శంకరన్, ఐఏఏ సెక్రటరీ జనరల్ డాక్టర్ జీన్ మిచెల్ కాంటాంట్, ఇస్ట్రాక్ డైరెక్టర్ డాక్టర్ ఏకే అనిల్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

భారత్ లో మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ సదస్సులో ఈ కింద పేర్కొన్న ముఖ్యమైన అంశాలు ఉన్నాయి:

  • మిషన్ ఆపరేషన్స్: రూపకల్పన (డిజైన్) ను విజయంగా మార్చడం

  •  ప్రస్తుత మైలురాళ్లు, భవిష్యత్ క్షితిజాలను అన్వేషించడం

  • మిషన్ డిజైన్, ఆపరేషన్స్

  • మిషన్ ఆపరేషన్స్ వ్యూహం, భవిష్యత్తు ప్రణాళిక

  • కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్

  • గ్రౌండ్ సెగ్మెంట్,  శాటిలైట్ కాన్స్టలేషన్స్

  • మానవ అంతరిక్ష కార్యక్రమం, గ్రహాంతర యాత్రలు,గ్రౌండ్ సెగ్మెంట్

  • ఆర్బిట్స్ ఆఫ్ ఆపర్చునిటీ: నూతన అంతరిక్ష ఆర్థిక వ్యవస్థకు సహకారం

  • మానవ అంతరిక్ష కార్యక్రమ సవాళ్లు

  •  అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంపై రోబోటిక్ మిషన్ ఆపరేషన్స్

  •  స్పేస్ డొమైన్ అవేర్నెస్: భావనలు, సామర్థ్యాలు, అనువర్తనాలు

  • అంతరిక్ష అనువర్తనాల వినియోగం

ఈ సదస్సులో 120 మౌఖిక,  88 పోస్టర్ ప్రెజెంటేషన్లతో పాటు, ఈఎస్ఏసీఎన్ఈఎస్, డీఎల్ఆర్,ఐబీఎమ్పీ, రష్యాకు చెందిన ఐకేఐ, నాసా, జాక్సా, సెలెస్ట్రాక్, యూమెట్‌శాట్, యూటెల్‌శాట్, టీయూ డెల్ఫ్ట్, కెనడా వంటి సంస్థల నుంచి నుండి ప్రముఖ నిపుణులు ముఖ్య వక్తలుగా,  ప్యానెలిస్టులుగా పాల్గొన్నారు. వేగంగా మారుతున్న అంతరిక్ష రంగంలో అత్యాధునిక సాంకేతికతలు, ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడంపై అంతరిక్ష సంస్థలు, స్టార్టప్‌లు, పరిశ్రమలు, విద్యాసంస్థలు తమ అభిప్రాయాలను పంచుకోవడానికి ఈ సదస్సు ఒక అద్భుతమైన వేదికగా నిలిచింది. సదస్సు చివరి రోజున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంపై రోబోటిక్ మిషన్ ఆపరేషన్స్, స్పేస్ డొమైన్ అవేర్నెస్, అంతరిక్ష అనువర్తనాలు, మానవ అంతరిక్ష యాత్రలు, వ్యోమగాముల శిక్షణపై ఆహ్వానిత ప్రసంగాలతో కూడిన వర్క్‌షాప్ ఉంటుంది. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రతినిధులు పాల్గొంటారు. 

ఇస్రో ఛైర్మన్ తమ ప్రారంభోపన్యాసంలో, అంతరిక్ష ప్రయోగాల విజయం కోసం వ్యోమనౌక మిషన్ కార్యకలాపాల విషయంలో అత్యంత జాగ్రత్తతో కూడిన ప్రణాళిక, లోప రహిత అమలు కీలక పాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు. అంతరిక్ష రంగంలో ఎదురవుతున్న సవాళ్లకు వినూత్న పరిష్కారాలను కనుగొనడంలో, భారతీయ అంతరిక్ష రంగం ప్రపంచ దేశాలతో చురుకుగా భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు.

సాంకేతిక, విధానపరమైన అంశాల నుంచి ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా అధిగమించడం ప్రధాన ఇతివృత్తాలలో ఒకటి.  విచ్ఛిన్నకర సాంకేతిక ఆవిష్కరణలు, భారీ ఉపగ్రహ సమూహాల రాక, అంతరిక్ష ట్రాఫిక్ రద్దీ పెరగడం, భూమికి ఆవల సాహసోపేతమైన మానవ అంతరిక్ష పరిశోధనల వంటి కారణాల వల్ల... విభిన్నమైన, విస్తృతమైన మిషన్ నిర్వహణ అంశాల సంక్లిష్టత మరింత పెరుగుతోంది. మనుషులు, యంత్రాల మధ్య సమన్వయంతో మరింత స్వయంప్రతిపత్తి కలిగిన, సమర్థవంతమైన మిషన్ కార్యకలాపాలను నిర్వహించడంలో కృత్రిమ మేధ,  మెషిన్ లెర్నింగ్ పోషించే కీలక పాత్రను ఈ సందర్భంగా జరిగిన సెషన్లలో వివరించారు. 

ఆర్యభట్ట ఉపగ్రహం నుంచి నిసార్ వరకు, భూమికి దగ్గరగా ఉండే కక్ష్యలు అలాగే సుదూర అంతరిక్ష ప్రయోగాల కార్యకలాపాలకు కేంద్రమైన ఇస్ట్రాక్ ఎన్నో అద్భుత విజయాలను సాధించింది. చారిత్రాత్మక మంగళయాన్ మిషన్, చంద్రయాన్-3 సురక్షిత ల్యాండింగ్, సూర్యుడి చుట్టూ ఉన్న లాగ్రాంజియన్ పాయింట్ వద్ద ఆదిత్య-ఎల్1 నౌకను ప్రవేశపెట్టడం, స్పేడెక్స్ మిషన్ డాకింగ్ ప్రయోగాలు వంటివి ఇందులో ప్రధానమైనవి. ఈ ఎస్ఎమ్ఓపీఎస్ సదస్సు నిర్వహణలో  ఇస్ట్రాక్ కీలక పాత్ర పోషిస్తోంది. భారత అంతరిక్ష రంగం ప్రైవేటు సంస్థలకు అందుబాటులోకి రావడం, ఇస్రో మానవ అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఈ ఎస్ఎమ్ఓపీఎస్ సదస్సు వివిధ రంగాలకు చెందిన ఆలోచనల కలయికగా నిలిచింది. భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాల నిర్వహణ కోసం సురక్షితమైన, స్థిరమైన, తెలివైన ప్రణాళికను రూపొందించే క్రమంలో ప్రపంచ అంతరిక్ష సమాజం మధ్య పరస్పర సహకారం, భాగస్వామ్యాలను పెంపొందించడానికి ఇది ఒక వేదికగా మారింది.


(రిలీజ్ ఐడి: 2250302) సందర్శకుల సూచీ సంఖ్య : : 35
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी