వ్యవసాయ మంత్రిత్వ శాఖ
భారత వ్యవసాయానికి కొత్త దిశానిర్దేశం చేసిన జైపూర్ ప్రాంతీయ వ్యవసాయ సదస్సు
నూనెగింజలు, పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వావలంబనకు భారీ ప్రోత్సాహం.. రైతు గుర్తింపు కార్డులు, ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి
రాష్ట్రాల వారీ పంటల వ్యూహాల రూపకల్పనకు ప్రాంతీయ వ్యవసాయ సదస్సులు చోదకాలుగా నిలవాలి: కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
ఎరువులు, విత్తనాలు, బీమా, నష్టపరిహారాన్ని పూర్తిగా పారదర్శకంగా మార్చేందుకు దేశవ్యాప్త రైతు గుర్తింపు కార్డు
దేశంలో 429.89 లక్షల టన్నుల రికార్డు స్థాయికి చేరిన నూనె గింజల ఉత్పత్తి.. ఉత్పాదకత హెక్టారుకు 1412 కిలోల వృద్ధి
నూనెగింజల సాగు విస్తీర్ణం, ఉత్పాదకత, ఉత్పత్తిని పెంచేందుకు రూ.10,103 కోట్లతో భారీ ప్రణాళిక
విత్తన విస్తరణ, కొత్త రకాలు, 100 శాతం సేకరణ ,పప్పు మిల్లుల వ్యవస్థపై పప్పుధాన్యాల మిషన్ ప్రత్యేక దృష్టి
‘ల్యాబ్ టు ల్యాండ్’ నమూనాను నేరుగా రైతుల వద్దకు తీసుకెళ్లనున్న 16,000 మంది శాస్త్రవేత్తలు
ప్రకృతి వ్యవసాయం, సమగ్ర నమూనాలకు ప్రోత్సాహం, నకిలీ ఉత్పాదకాలపై కఠిన చర్యలు
ఏపీటీ పంటల అత్యవసర అమ్మకాలను అరికట్టి, విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి
నాడు పోస్టు చేయడమైనది:
07 APR 2026 7:33PM by PIB Hyderabad
జైపూర్‌లో జరిగిన ప్రాంతీయ వ్యవసాయ సదస్సు అనంతరం కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక ప్రకటన చేశారు. ఇకపై దేశమంతటినీ వివిధ వ్యవసాయ-వాతావరణ మండలాలుగా విభజించి, ప్రతి రాష్ట్రానికి విడివిడిగా ప్రత్యేక వ్యవసాయ ప్రణాళికను రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. దేశంలోని రైతులందరినీ ‘రైతు గుర్తింపు సంఖ్య’తో అనుసంధానిస్తామని, దీనివల్ల ఎరువులు, విత్తనాల పంపిణీ, పంట బీమా, నష్టపరిహారం చెల్లింపు ప్రక్రియలన్నీ అత్యంత పారదర్శకంగా, నేరుగా లబ్ధిదారులకే చేరుతాయని మంత్రి పేర్కొన్నారు. జాతీయ వంట నూనెల మిషన్-నూనె గింజలు కింద 2024–25లో సాధించిన 429.89 లక్షల టన్నుల రికార్డు ఉత్పత్తి,పెరిగిన ఉత్పాదకతను ఆధారంగా చేసుకుని, నూనె గింజల సాగు విస్తీర్ణాన్ని 29 మిలియన్ హెక్టార్ల నుంచి 33 మిలియన్ హెక్టార్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే ఉత్పత్తిని 39.2 మిలియన్ టన్నుల నుంచి 69.7 మిలియన్ టన్నులకు పెంచనున్నట్లు వివరించారు. విత్తన ఉత్పత్తిని పెంచడం, పప్పు మిల్లుల ఏర్పాటు, కొత్త రకం విత్తనాలను అందుబాటులోకి తేవడం, విక్రయించడానికి సిద్ధంగా ఉన్న రైతుల నుంచి 100 శాతం పంట సేకరణ చేయడం ద్వారా పప్పుధాన్యాల రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తామని చెప్పారు.
రాష్ట్రాల వారీగా వ్యవసాయ అభివృద్ధి ప్రణాళిక, ప్రాంతీయ సమావేశాలు
పత్రికా సమావేశంలో శ్రీ చౌహాన్ మాట్లాడుతూ.. ఐసీఏఆర్ సీనియర్ శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు, ప్రగతిశీల రైతులు, ఎఫ్‌పీఓలు, నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్ వంటి సంస్థలు విత్తనాల నుంచి మార్కెట్ల వరకు విలువ ఆధారిత వ్యవస్థలో పనిచేస్తున్న సంస్థల ప్రతినిధులు ఒకే వేదికపైకి వచ్చిన దేశంలోనే మొట్టమొదటి ప్రాంతీయ సమావేశం ఇదేనని అన్నారు. ఇంతకుముందు ఖరీఫ్, రబీ పంటల కోసం కేవలం ఒక జాతీయ స్థాయి సమావేశం మాత్రమే జరిగేదని.. అక్కడ సమయాభావం కారణంగా లోతైన చర్చలు సాధ్యం కాలేదని తెలిపారు. ఇప్పుడు దేశాన్ని అయిదు వ్యవసాయ-వాతావరణ మండలాలుగా విభజించి, అయిదు ప్రాంతీయ సమావేశాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రంలోని వాతావరణం, నేల, నీటి లభ్యత, అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా ఆయా ప్రాంతాలకు అత్యంత అనువైన పంటలు, విత్తన రకాలు, వ్యవసాయ పద్ధతులను నిర్ణయించేలా ప్రత్యేక వ్యవసాయ అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు
రైతు గుర్తింపు సంఖ్య: ఎరువులు, విత్తనాలు, బీమా, పరిహారానికి వెన్నెముక
రైతు గుర్తింపు కార్డుల రూపకల్పన పనులు అన్ని రాష్ట్రాల్లో వేగంగా జరుగుతున్నాయని, సుమారు మూడు నెలల్లో రైతులందరికీ ఒకే రకమైన గుర్తింపు కార్డు అందుబాటులోకి వస్తుందని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దీనివల్ల ప్రభుత్వ పథకాల ప్రయోజనాలన్నీ నేరుగా, ఖచ్చితంగా రైతులకే అందుతాయని అన్నారు. మధ్యప్రదేశ్‌లో రైతు ఐడీ ఆధారంగా అమలు చేస్తున్న ఎరువుల పంపిణీ నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు. ఈ విధానం వల్ల రైతులు ఎరువుల కోసం క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం ఉండదన్నారు. వారి భూమి విస్తీర్ణం, సాగు చేసే పంట అవసరాలకు అనుగుణంగా ఎరువులు అందుతాయని, ఇది నకిలీ ఉత్పత్తులను, అక్రమ రవాణాను అరికట్టడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. భూ యజమాని అంగీకారంతో కౌలు రైతులు కూడా రైతు ఐడీ ద్వారా ఎరువులు, ఇతర ప్రయోజనాలను పొందవచ్చు. పంట బీమా, పంట నష్ట పరిహారం, ఇతర ప్రభుత్వ సాయం పొందడానికి కూడా ఉపయోగపడుతుంది.
జాతీయ వంట నూనెల మిషన్–నూనెగింజలు: రికార్డు స్థాయి పురోగతి, భవిష్యత్తు విస్తరణ
జాతీయ వంట నూనెల మిషన్ (నూనెగింజలు) పథకం ద్వారా దేశం అద్భుతమైన వృద్ధిని సాధించిందని కేంద్ర మంత్రి వివరించారు. 2023–24లో 396.69 లక్షల టన్నులుగా ఉన్న నూనె గింజల ఉత్పత్తి 2024–25 నాటికి 429.89 లక్షల టన్నులకు చేరుకుందని చెప్పారు. ఉత్పాదకత కూడా 2023-24లో హెక్టారుకు1314 కిలోల నుంచి 2024-25లో 1412 కిలోలకు పెరిగిందన్నారు. సరైన విధానాలు, విత్తనాలు, సాంకేతికత, ప్రోత్సాహకాలు ఉంటే నూనెగింజల రంగంలో దేశం వేగంగా స్వయం సమృద్ధి దిశగా పయనిస్తుందని ఇది నిరూపించిందని ఆయన అన్నారు. 2025–26లో 1,076 విలువ ఆధారిత క్లస్టర్ల ద్వారా అదనంగా 13.35 లక్షల హెక్టార్లను నూనె గింజల సాగు పరిధిలోకి తీసుకు వచ్చినట్లు తెలిపారు. ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ వరకు అన్ని దశలను బలోపేతం చేసేందుకు గాను.. ఇప్పటికే 60 విత్తన కేంద్రాలు, 50 విత్తన నిల్వ కేంద్రాలకు ఆమోదం లభించినట్లు చెప్పారు. 400 ఆయిల్ మిల్లులను ఏర్పాటు చేశారని, వీటిని 800 మిల్లులకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.
నూనెగింజల రంగంలో స్వయం సమృద్ధి లక్ష్యాలు: సాగు విస్తీర్ణం, ఉత్పాదకత, ఉత్పత్తి
నూనెగింజల రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రభుత్వం రూ.10,103 కోట్ల భారీ నిధులను కేటాయించిందని శ్రీ చౌహాన్ తెలిపారు. దీని ద్వారా సాంకేతికత, విత్తనాలు, నీటిపారుదల, శుద్ధి,మార్కెటింగ్ రంగాలలో రైతులకు పూర్తి మద్దతు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా నిర్దేశించుకున్న లక్ష్యాల్లో సాగు విస్తీర్ణాన్ని 29 మిలియన్ హెక్టార్ల నుంచి 33 మిలియన్ హెక్టార్లకు పెంచడం, ఉత్పాదకతను హెక్టారుకు 1,353 కిలోల నుంచి 2,112 కిలోలకు పెంచడం, మొత్తం ఉత్పత్తిని 39.2 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 69.7 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచడం వంటివి ఉన్నాయన్నారు. ఈ చర్యల ద్వారా వంట నూనె దిగుమతులపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించడమే కాకుండా అధిక విలువ కలిగిన పంటల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచవచ్చని తెలిపారు.
పప్పుధాన్యాల పథకం: విత్తనాలు, పప్పు మిల్లులు, కొత్త రకాలు, 100 శాతం పంట సేకరణ
పప్పుధాన్యాల పథకం కింద రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు విత్తనోత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించినట్లు కేంద్రమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. నాణ్యమైన విత్తనాల ఉత్పత్తిని పెంచేందుకు రైతులను ప్రోత్సహించే దిశగా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. కందిపప్పు క్వింటాలుకు రూ. 4,500, మినుములు క్వింటాలుకు రూ. 2,000, శనగలు క్వింటాలుకు రూ. 1,800 చొప్పున అందిస్తున్నామన్నారు. రాయితీపై విత్తనాల పంపిణీ కోసం రాష్ట్రాల వారీగా లక్ష్యాలను కూడా నిర్దేశించారు. మధ్యప్రదేశ్‌కు 3,10,870 క్వింటాళ్లు, రాజస్థాన్‌కు 2,45,000 క్వింటాళ్లు, మహారాష్ట్రకు 87,500 క్వింటాళ్లు, గుజరాత్‌కు 40,000 క్వింటాళ్లుగా ఈ లక్ష్యాలను ఖరారు చేశారు. కొత్త పప్పుధాన్యాల రకాలను విత్తన సరఫరాలోకి వేగంగా తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.ఇందులో భాగంగా రాజస్థాన్‌లో 79, గుజరాత్‌లో 58, మధ్యప్రదేశ్‌లో 63, మహారాష్ట్రలో 58 కొత్త రకాలను గుర్తించామని చెప్పారు.
పప్పుధాన్యాల ఉత్పత్తి కేంద్రాలు.. పప్పు మిల్లుల వ్యవస్థ, నిధుల కేటాయింపు
దేశంలోని మొత్తం పప్పుధాన్యాల ఉత్పత్తిలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలే 60 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నాయని కేంద్రమంత్రి తెలిపారు. నర్మదాపురం (మధ్యప్రదేశ్), ఝలావర్, టోంక్ (రాజస్థాన్), గడ్చిరోలి (మహారాష్ట్ర), జునాగఢ్ (గుజరాత్) వంటి జిల్లాలు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాయని, వీటిని ఆదర్శ జిల్లాలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. తక్కువ ఉత్పాదకత ఉన్న జిల్లాలపై ప్రత్యేక సమీక్ష జరిపి, దిగుబడి పెంచేందుకు ప్రణాళికలు అమలు చేస్తామన్నారు. ప్రాసెసింగ్ రంగాన్ని బలోపేతం చేసేందుకు పెద్ద ఎత్తున పప్పు మిల్లుల వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారని.. మధ్యప్రదేశ్‌లో 55, మహారాష్ట్రలో 34, గుజరాత్‌లో 28, రాజస్థాన్‌లో 30, గోవాలో 5 మిల్లులను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. పప్పుధాన్యాల పథకం కింద 2026–27 సంవత్సరానికి మధ్యప్రదేశ్‌కు రూ,344 కోట్లు, రాజస్థాన్‌కు రూ. 312 కోట్లు, మహారాష్ట్రకు రూ.166 కోట్లు, గుజరాత్‌కు రూ31 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వరి, గోధుమల తరహాలోనే కందులు, మినములు, మసూర్ పప్పు పండించే రైతుల నుంచి 100 శాతం పంటను కనీస మద్దతు ధరకే సేకరించేలా నిబంధనలు రూపొందించారని, దీనివల్ల రైతులకు పూర్తి ఆదాయ భరోసా లభిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
వికసిత్ కృషి సంకల్ప్, సమగ్ర ప్రకృతి సాగు, నకిలీ ఎరువులపై ఉక్కుపాదం
రాష్ట్రాల వారీ వ్యవసాయ-వాతావరణ పరిస్థితులు, పంటల కాల చక్రాలకు అనుగుణంగా ఇకపై వికసిత్ కృషి సంకల్స్ అభియాన్ సాగుతుందని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. సుమారు 16,000 మంది శాస్త్రవేత్తలు, ఐసీఏఆర్ సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు ల్యాబ్ నుంచి భూమి వరకు విధానంలో నేరుగా రైతులతో కలిసి పనిచేస్తాయని తెలిపారు. చిన్న కమతాల నుంచి ఆదాయాన్ని పెంచడానికి.. పంటలతో పాటు పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కలు, పశుపోషణ, తేనెటీగల పెంపకం, మత్స్య సంపద, గొర్రెల పెంపకం,వ్యవసాయ అటవీకరణ వంటి సమగ్ర వ్యవసాయ నమూనాలను ప్రోత్సహిస్తారని చెప్పారు.. నేల ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్రకృతి వ్యవసాయాన్ని వేగవంతం చేయాలని, సేంద్రీయ ధ్రువీకరణ ద్వారా రైతులకు అంతర్జాతీయ మార్కెట్లలో అధిక ధరలు దక్కేలా చూడాలని సదస్సులో ఏకాభిప్రాయం కుదిరిందన్నాను. నకిలీ ఎరువులు, పురుగుమందుల తయారీదారులపై ఇప్పటికే కఠిన చర్యలు తీసుకున్నామని, పలు పరిశ్రమలను మూసేశాయని మంత్రి చెప్పారు. ఉత్పత్తి నుంచి సరఫరా వరకు పర్యవేక్షించేందుకు సమగ్ర ట్రాకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 1968 నాటి చట్టంలో జరిమానాలు తక్కువగా ఉన్నందున నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల విక్రేతలపై కఠిన చర్యలు తీసుకునేలా తదుపరి అసెంబ్లీ సమావేశాల్లో కొత్త చట్టం లేదా సవరణలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు.
పంట నష్ట అంచనా, ప్రపంచ ప్రభావం, ఏపీటీ పంటలకు భరోసా
ఉపగ్రహ ఆధారిత రిమోట్ సెన్సింగ్ ద్వారా పంట నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనివల్ల ఎస్‌డీఆర్‌ఎఫ్ కింద రాష్ట్ర ప్రభుత్వాలు త్వరగా సాయం అందించవచ్చని కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే రైతు గుర్తింపు కార్డుల ద్వారా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన క్లెయిములను వేగంగా పరిష్కరించగలవని చెప్పారు.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి అంతర్జాతీయ సంక్షోభాలు ఎరువుల సరఫరాపై ప్రభావం చూపుతున్నప్పటికీ, భారతీయ రైతులపై ఆ భారం పడకుండా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఖరీఫ్, రబీ పంటలకు సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. బంగాళదుంప, ఉల్లి, టమమా వంటి పంటలను రైతులు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి రాకుండా.. రాష్ట్ర ప్రభుత్వాలే నేరుగా సేకరించి ప్రధాన నగరాలకు సరఫరా చేస్తాయని పేర్కొన్నారు. దీనికి అయ్యే రవాణా, నిల్వ ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర, వినియోగదారులకు తక్కువ ధర లభిస్తుందన్నారు. బిందు సేద్యం, యాంత్రీకరణ లేదా శుద్ధి.. ఇలా రాష్ట్రాల అవసరాలను బట్టి నిధుల కేటాయింపులో కేంద్రం వెసులుబాటు కల్పిస్తుందని, ఎక్కడ అవసరమైతే అక్కడ వనరులను కేటాయిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2249919)
సందర్శకుల సూచీ సంఖ్య : : 20