పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
విమానయాన భద్రతలో ఆత్మనిర్భరతను పెంపొందించేందుకు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యవేక్షణలో బీసీఏఎస్ – ఆర్ఆర్యూ మధ్య అవగాహన ఒప్పందం
భారత స్వదేశీ విమానయాన భద్రతా పరికరాల పరీక్షా కేంద్రం ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న బీసీఏఎస్ – ఆర్ఆర్యూ
నాడు పోస్టు చేయడమైనది:
06 APR 2026 8:24PM by PIB Hyderabad
భారతీయ విమానాశ్రయాల్లో వాడే ఫుల్ బాడీ స్కానర్లు (ఎఫ్బీఎస్), ఇతర భద్రతా తనిఖీ పరికరాల పనితీరును పరిశీలించడానికి, తనిఖీ పరీక్షలు నిర్వహించి ధృవీకరణ పత్రాలు ఇవ్వడానికి ఒక ప్రత్యేక స్వదేశీ పరీక్షా కేంద్రాన్ని నెలకొల్పి నిర్వహించడానికి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్), రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ (ఆర్ఆర్యూ) ఈరోజు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పౌర విమానయాన శాఖ కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా, బీసీఏఎస్ డైరెక్టర్ జనరల్ రాజేష్ నిర్వన్, రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ బిమల్ పటేల్ సమక్షంలో ఈ ఒప్పందంపై న్యూఢిల్లీలో సంతకాలు జరిగాయి.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, “బీసీఏఎస్, రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ మధ్య కుదిరిన ఈ ఒప్పందం భద్రతా పరిశోధన, సామర్థ్య పెంపుపై ఎన్డీయే ప్రభుత్వం పెడుతున్న ప్రత్యేక దృష్టి దిశగా మరో ముందడుగు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో పరిశోధనలు, ఆవిష్కరణలు, నైపుణ్యాల ద్వారా భద్రతను బలోపేతం చేయడం అత్యంత ప్రాధాన్యతగా మారింది. ఇది ప్రధానంగా ఆత్మనిర్భర్ భారత్, ఆత్మసురక్షిత్ భారత్ నిర్మాణం కోసమే!” అని పేర్కొన్నారు.
PQ72.jpeg)
ఆర్ఆర్యూ వారసత్వాన్ని, సంస్థాగత సామర్ధ్యాన్ని ప్రస్తావిస్తూ, “రాష్ట్రీయ సురక్ష సర్వోపరి’ అనే స్పష్టమైన లక్ష్యంతో 2010లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ఈ రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీని స్థాపించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో ఇది ఈ రంగంలో ప్రపంచంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సంస్థలలో ఒకటిగా ఎదిగింది” అని అన్నారు.
విమానయాన భద్రతా పరికరాల పరీక్షలు, ధృవీకరణ, పరిశోధన, శిక్షణ, ప్రమాణాల అభివృద్ధిలో బీసీఏఎస్, ఆర్ఆర్యూ మధ్య భాగస్వామ్యం కోసం ఈ ఒప్పందం ఒక అధికారిక సంస్థాగత రూపాన్ని ఇస్తుంది. నమ్మకమైన, స్వతంత్ర, శాస్త్రీయ పద్ధతులతో కూడిన మూల్యాంకనం, నియంత్రణ మద్దతు ద్వారా భారత విమానయాన భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడం దీని లక్ష్యం.

ఈ అవగాహన ఒప్పందం ప్రకారం, ఆర్ఆర్యూ ఫుల్ బాడీ స్కానర్లు, ఇతర విమానయాన భద్రతా పరికరాల పరీక్షలు నిర్వహించడానికి బీసీఏఎస్ భాగస్వామ్యంతో ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఓఈఎంఎస్) సరఫరా చేసే పరికరాల ప్రమాణాలు, పనితీరును ఈ కేంద్రం స్వతంత్రంగా తనిఖీ చేసి ధృవీకరిస్తుంది. నిష్పక్షపాతమైన, శాస్త్రీయమైన నివేదికలను నియంత్రణ సంస్థల పరిశీలన కోసం సమర్పిస్తుంది.
విమానయాన భద్రతలో ఆత్మనిర్భరత ప్రాధాన్యతను వివరిస్తూ, “ఈ భాగస్వామ్యంలో విమానయాన భద్రతా పరికరాల తయారీలో ఆత్మనిర్భరత సాధించడం అత్యంత ముఖ్యం. విదేశీ ధృవీకరణ పద్ధతులతో సమానంగా ఎదుగుతూనే, విమానయాన భద్రతా సర్టిఫికేషన్ రంగంలో మనం అంతర్జాతీయ కేంద్రంగా మారాలి. ముఖ్యంగా భారతీయ తయారీదారులకు పరీక్షా సౌకర్యాలు కల్పించడం ద్వారా 'భారత ప్రమాణాల’ అభివృద్ధిని వేగవంతం చేయవచ్చు” అని అన్నారు.

“బీసీఏఎస్ నియంత్రణ అధికారాన్ని, ఆర్ఆర్యూ సాంకేతిక నైపుణ్యాన్ని కలపడం ద్వారా భద్రతా పరికరాల ధృవీకరణ కోసం ఒక స్వదేశీ వ్యవస్థను నిర్మిస్తామని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇది అమెరికాలోని టీఎస్ఏ, ఐరోపాలోని ఈసీఏసీ వంటి అంతర్జాతీయ పద్ధతులతో సమానంగా ఉంటుంది” అని శ్రీ రామ్మోహన్ నాయుడు అన్నారు,
అత్యున్నత స్థాయి పనితీరు, భద్రత, పరస్పర అనుసంధాన ప్రక్రియలను పరీక్షించడానికి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆర్ఆర్యూnలో అత్యాధునిక ప్రయోగశాలలను ఏర్పాటు చేయడానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. నిర్దేశించిన సాంకేతిక, నిర్వహణ ప్రమాణాలను అందుకునే పరికరాలను మాత్రమే కీలకమైన విమానయాన భద్రతా విభాగాలలో వాడేలా చూసేందుకు ఒక క్రమబద్ధమైన అక్రిడిటేషన్ వ్యవస్థను ఇది బలోపేతం చేస్తుంది.
ఈ ఒప్పందం విద్యా పరిశోధన, విస్తరణ,, శిక్షణ కార్యక్రమాలలో పరస్పర ప్రయోజనం కోసం సహకార విస్తరణకు కూడా దోహదపడుతుంది. విమానయాన భద్రతలో వస్తున్న కొత్త సాంకేతికతలు, పరీక్షలు, అక్రిడిటేషన్ రంగాలలో వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంపొందించడానికి వర్క్‌షాప్‌లు, ప్రత్యేక శిక్షణ, విజ్ఞానాన్ని పంచుకునే కార్యక్రమాల ద్వారా సామర్థ్యాన్ని పెంచుతారు.
ఈ భాగస్వామ్యం విమానయాన భద్రత రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. దీనివల్ల మారుతున్న సవాళ్లు, సాంకేతిక మార్పులకు అనుగుణంగా పరీక్షా పద్ధతులు, అక్రిడిటేషన్ ప్రమాణాలు, వినియోగ నిబంధనలను నిరంతరం మెరుగుపరచవచ్చు. అంతేకాకుండా, భారత తనిఖీ, ధృవీకరణ వ్యవస్థను అంతర్జాతీయ అత్యుత్తమ విధానాలతో అనుసంధానించడానికి దేశీయ, అంతర్జాతీయ సహకారానికి ఇది తోడ్పడుతుంది.
విమానయాన రంగం శరవేగంగా విస్తరిస్తున్న తీరును కేంద్ర మంత్రి ప్రస్తావిస్తూ, “పౌర విమానయాన రంగంలో చోటు చేసుకుంటున్న విప్లవాత్మక వృద్ధిని మనమంతా చూస్తున్నాం. దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 ఉండగా, ఇప్పుడు 165కు పైగా పెరిగింది. ప్రతి గంటకు మన విమానాశ్రయాలు 250 నుంచి 300 విమానాల రాకపోకలను నిర్వహిస్తూ, సుమారు 40-45 వేల మంది ప్రయాణికుల అవసరాలను తీరుస్తున్నాయి. కేవలం ప్రయాణికులే కాకుండా, గత 10-12 ఏళ్లలో విమానాల ద్వారా సరకు రవాణా పరిమాణం కూడా దాదాపు 50% మేర భారీగా పెరిగింది.అందుచేత బీసీఏఎస్ కార్యకలాపాలలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలను, వృత్తిపరమైన నైపుణ్యాన్ని అవలంబించడం చాలా ముఖ్యం. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా పటిష్టమైన విమానయాన భద్రత వ్యవస్థను నిర్మించే దిశగా బీసీఏఎస్, ఆర్ఆర్యూ మధ్య కుదిరిన ఈ ఒప్పందం ఒక ముందడుగు” అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2249532)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14