శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
గంగామైదాన ప్రాంతంలో ప్రాచీన వ్యవసాయ రహస్యాలను ఛేదించిన గడ్డి పరాగ రేణువుల అధ్యయనం
నాడు పోస్టు చేయడమైనది:
06 APR 2026 3:16PM by PIB Hyderabad
సాగు పంటల నుంచి వచ్చే పరాగ రేణువులకు, అడవి గడ్డి పరాగ రేణువులకు మధ్య ఉన్న తేడాలను గుర్తించే ఒక కొత్త విధానాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ భారత్ లో వ్యవసాయం అసలు ఎలా మొదలైందనే చరిత్రను తెలుసుకోవడానికి పరిశోధకులకు సహాయపడింది. ముఖ్యంగా మధ్య గంగా మైదాన ప్రాంతంలో వేల సంవత్సరాలుగా మనుషులు భూమిని ఎలా మార్చారో, వ్యవసాయం ఎలా అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవడానికి గొప్ప అవకాశాన్ని అందించింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆహార వనరులైన వరి, గోధుమ ఉత్పత్తిలో భారత్ రెండో అతిపెద్ద దేశంగా ఉంది. ఈ నేపథ్యంలో గడ్డి జాతికి చెందిన మొక్కలలో ఏవి ఆహార ధాన్యాలు, ఏవి సాధారణ గడ్డి అనే తేడాను గుర్తించడం చాలా ముఖ్యమైన విషయం. ఇందుకోసం శాస్త్రవేత్తలు ఆయా ప్రాంతాలకు అనుగుణంగా కొన్ని ప్రత్యేకమైన బయోమెట్రిక్ ప్రమాణాలను ఏర్పరిచారు. ఈ విధానం ద్వారా పంట పొలాల పరాగ రేణువులను, అడవి గడ్డి పరాగ రేణువులను ఖచ్చితంగా వేరు చేసి గుర్తించవచ్చు. దీని ద్వారా గతంలో మానవులు ఎక్కడ నివసించారు.. ఏయే ప్రాంతాల్లో వ్యవసాయం చేశారు వంటి అంశాలను తెలుసుకునేందుకు ఈ అధ్యయనం ఎంతో దోహదపడుతుంది.
గోధుమ, వరి, బార్లీ, చిరుధాన్యాలు వంటి చాలా రకాల ధాన్యపు పంటలు పోయేసి అనే గడ్డి జాతి కుటుంబానికి చెందినవి. వీటి పరాగ రేణువులు చూడటానికి అచ్చం అడవి గడ్డి పరాగ రేణువుల లాగే ఉంటాయి. సూక్ష్మదర్శినితో చూసినప్పుడు కూడా వీటి మధ్య తేడాలను గుర్తించడం చాలా కాలంగా కష్టతరంగా మారింది. ఈ పరాగ రేణువులు మట్టి పొరల్లో భద్రంగా నిల్వ ఉంటాయి. వీటి సమూహాలను విశ్లేషించడం ద్వారా హోలోసీన్ కాలంలో (గత11,700 ఏళ్లలో) జరిగిన వ్యవసాయం, అడవుల నరికివేత, మానవ నివాసాల ఏర్పాటు గురించి వివరాలను తెలుసుకోవచ్చు.
పరాగ రేణువుల సూక్ష్మ నిర్మాణాన్ని పరిశీలించడం ద్వారా.. ధాన్యం మొత్తం పరిమాణం, పరాగ రేణువు రంధ్రం చుట్టూ ఉండే వలయ పరిమాణం ఆధారంగా పండించిన పంట ధాన్యాలకు, అడవి గడ్డికి మధ్య ఉన్న తేడాలను గుర్తించవచ్చు. ఈ విధానం ద్వారా గతంలో పర్యావరణ పరిస్థితులు ఎలా ఉండేవి ప్రకృతిపై మానవ ప్రభావం ఎలా ఉండేదనే అంశాల గురించి తెలుసుకునేందుకు వీలవుతుంది.
పోయేసి గడ్డి జాతికి చెందిన ప్రధాన ఆహార పంటల గురించి, వాటికి సంబంధించిన అడవి జాతుల పరాగ రేణువుల సూక్ష్మ ఆకృతిపై పూర్తి స్థాయి అధ్యయనం ఇప్పటి వరకు జరగలేదు. గత కొన్ని వేల సంవత్సరాల నాటి మానవ కార్యకలాపాలను తిరిగి అంచనా వేయాలంటే శిలాజ పరాగరేణువులను ఖచ్చితంగా గుర్తించడం చాలా ముఖ్యం.
దేశంలోనే తొలిసారిగా జరిగిన ఈ పరిశోధనలో శాస్త్ర, సాంకేతిక విభాగం పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థ బీర్బల్ సాహ్ని ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలియోసైన్సెస్ (బీఎస్ఐపీ) శాస్త్రవేత్తలు, వారి సహచరులతో కలిసి 22 రకాల ధాన్యపు, అడవి గడ్డి జాతులను విశ్లేషించారు. ఒక నమ్మకమైన బయోమెట్రిక్ ప్రమాణాన్ని రూపొందించడం కోసం వీరు లైట్ మైక్రోస్కోపీ (ఎల్ఎం), కన్ఫోకల్ లేజర్ స్కానింగ్ మైక్రోస్కోపీ (సీఎల్ఎస్ఎం), ఫీల్డ్ ఎమిషన్ స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ (ఎఫ్ఈఎస్ఈఎం) వంటి అత్యాధునిక సాంకేతికత పద్దతులను ఉపయోగించారు. ఈ పరిశోధనలో శాస్ర్తవేత్తలు ప్రధానంగా మధ్య గంగా మైదాన ప్రాంతంపై దృష్టి సారించారు.
సాగు పంటలు, అడవి గడ్డి జాతుల మధ్య తేడాను ఖచ్చితంగా గుర్తించేందుకు.. ఆయా ప్రాంతాలకు అనుగుణమైన బయోమెట్రిక్ ప్రమాణాలను రూపొందించడం అత్యంత అవసరం. దేశంలో విస్తారమైన సాగుభూములు వైవిధ్యమైన పంటలు ఉన్న మధ్య గంగా మైదాన ప్రాంతంలో ప్రాచీన మానవ నివాసాలను, వ్యవసాయ పద్ధతులను ఖచ్చితంగా అంచనా వేసేందుకు ఇది ఒక శక్తిమంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది. అందుకే ఈ అధ్యయనానికి ఈ ప్రాంతం సరైనదిగా భావించి ఎంచుకున్నారు.
ఈ పరిశోధన శాస్త్రవేత్తలకు గతంలోని పర్యావరణాలను పునర్నిర్మించడానికి, అక్కడ పెరిగిన మొక్కలను గుర్తించడానికి, కాలక్రమేణా భూమి ఎలా మారిందీ, పర్యావరణ వ్యవస్థలపై మానవుల ప్రభావం ఎలా ఉన్నదీ తెలుసుకోవడానికి సహాయపడింది.
ది హోలోసీన్ (సేగ్ పబ్లికేషన్) శాస్త్రీయ పత్రికలో ప్రచురితమైన ఈ పరిశోధన.. ఒక స్పష్టమైన పెయిర్డ్ బయోమెట్రిక్ థ్రెషోల్డ్ ను రూపొందించింది. దీని ప్రకారం సాగు పంటల పరాగ రేణువుల మొత్తం వ్యాసం సుమారు 46 మైక్రాన్ల కంటే ఎక్కువగా, వాటి రంధ్రం చుట్టూ ఉండే వలయ పరిమాణం 9 మైక్రాన్ల కంటే ఎక్కువగా ఉంటుంది. (అయితే 'సజ్జలు' మాత్రం దీనికి మినహాయింపు, ఇవి కొంచెం చిన్నవిగా ఉంటాయి). అడవి గడ్డి పరాగ రేణువుల కొలతలు ఈ విలువల కంటే తక్కువగా ఉంటాయి.
ఈ విధానం ద్వారా భారతీయ ‘ఆహార భాండాగారం’గా పేరుగాంచిన మధ్య గంగా మైదాన ప్రాంతంలో సాగు పంటల పరాగ రేణువులను అడవి గడ్డి నుండి వేరు చేయడం సులభమవుతుంది. దీనివల్ల ప్రాచీన కాలంలో వ్యవసాయం ఎప్పుడు మొదలైంది, ఎంత విస్తృతంగా జరిగింది అనే విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవచ్చు.
గంగా మైదాన ప్రాంతం నుంచి సేకరించిన స్థానిక సమాచారం ఆధారంగా ఇలాంటి ఒక నమూనాను రూపొందించడం ఇదే మొదటిసారి. దీనివల్ల శాస్త్రవేత్తలు ఐరోపా దేశాల పరాగ రేణువుల డేటాబేస్‌లపై ఆధారపడకుండా.. స్వదేశీ స్థానిక ఆధారాలతోనే మన వ్యవసాయ చరిత్రను తిరిగి తెలుసుకునే అవకాశం లభించింది.
లక్నోలోని బీఎస్ఐపీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి త్రిపాఠి నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది. ఆమెతోపాటు డాక్టర్ ఆర్తి గార్గ్ (బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా- ప్రయాగ్రాజ్), ఆర్య పాండే, అనుపమ్ శర్మ (బీఎస్ఐపీ), ప్రియాంక సింగ్ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం, ముంబయి), అన్షిక సింగ్ (లక్నో విశ్వవిద్యాలయం) కలిసి పనిచేశారు.
ఈ ఆవిష్కరణ ప్రాచీన వ్యవసాయం, భూ వినియోగం, పర్యావరణ వ్యవస్థలపై మానవ ప్రభావం వంటి అంశాలపై జరిగే పరిశోధనల ఖచ్చితత్వాన్ని గణనీయంగా పెంచుతుంది. గంగా నది పరివాహక ప్రాంతంలోని సారవంతమైన మైదానాలను మన పూర్వీకులు క్రమంగా ఒక ప్రధాన వ్యవసాయ కేంద్రంగా ఎలా మార్చారో అర్థం చేసుకోవడానికి పురావస్తు శాస్త్రవేత్తలకు, పర్యావరణ చరిత్రకారులకు ఎంతో సహాయపడుతుంది.

దేశంలో వ్యవసాయం, మానవ నివాసాల ఆవిర్భావాన్ని మరింత ఖచ్చితత్వంతో గుర్తించడానికి ఈ అధ్యయనం మన దేశానికి తొలిసారి ప్రాంతానుసారమైన, స్పష్టమైన శాస్త్రీయ సాధనాన్ని అందించింది.
ఈ పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ కింది లింకు ద్వారా చదవవచ్చు..
https://doi.org/10.1177/09596836251414010
షోటో క్యాప్షన్ 1... గడ్డి జాతి పరాగ రేణువుల సూక్ష్మ నిర్మాణం
2.. సాగు పంటల పరాగ రేణువుల సూక్ష్మ నిర్మాణం
***
(రిలీజ్ ఐడి: 2249407)
సందర్శకుల సూచీ సంఖ్య : : 28