శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఆధునిక విద్యుత్తు వాహన చార్జింగ్... మౌలిక సదుపాయాల కల్పనకు భారత్-యూకే సహకారపూర్వక పరిశోధన, అభివృద్ధి కార్యక్రమం.. ఎస్‌ఛార్జ్ సంస్థకు టీడీబీ-డీఎస్‌టీ సహకారం
నాడు పోస్టు చేయడమైనది:
06 APR 2026 1:17PM by PIB Hyderabad
‘‘పవరింగ్ ఈవీ చార్జింగ్ ఇన్నొవేషన్’’ (విద్యుత్తు వాహనాల చార్జింగుకు సంబంధించిన నూతన ఆవిష్కరణలకు సహకరించడం) పేరిట చేపట్టిన ఒక ప్రాజెక్టును సాకారం చేసేందుకు ఎస్‌చార్జ్ సంస్థతో ఒక ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వ శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన విభాగం (డీఎస్‌టీ)లోని సాంకేతిక అభివృద్ధి మండలి (టీడీబీ) కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టును పారిశ్రామిక స్థిరత్వ సాధన లక్ష్యంగా రూపొందించిన భారత్-యూకే సహకారపూర్వక పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) కార్యక్రమంలో భాగంగా బ్రిటన్ లోని అల్‌బ్రైట్ ప్రాడక్ట్ డిజైన్ సంస్థతో భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకొని విద్యుత్తు వాహనాల (ఈవీ) చార్జింగు కోసం అవసరమైన ఉన్నత, సమర్థ సేవలను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో చేపడుతున్నారు.
వాణిజ్య వాహనాలతో పాటు డిపో నిర్వహణ కార్యకలాపాలకు ఉపయోగపడే తదుపరి తరం ఈవీ చార్జింగ్ సదుపాయాన్ని అభివృద్ధిపరచడంపై ఈ ప్రాజెక్టు దృష్టిని కేంద్రీకరిస్తుంది. ప్రతిపాదిత సాంకేతికత.. ఎస్‌చార్జ్ సంస్థ రూపొందించిన ఒక కొత్త రకం ఈవీ చార్జర్ చార్జి కంట్రోలరును బ్రిటన్ భాగస్వామ్య సంస్థకు పేటెంట్ ఉన్న స్వయంచాలక కేబుల్ మేనేజ్‌మెంట్ వ్యవస్థతో ఏకీకరిస్తుంది. ఈవీ చార్జింగ్ అవసరాలకు గిరాకీ రోజు రోజుకూ అధికం అవుతున్నందు వల్ల, ఈ రంగంలో కార్యనిర్వహణ సామర్థ్యాన్నీ, భద్రతనీ, వినియోగ స్థాయినీ మెరుగుపరచడానికి ఈ ఏకీకరణ ప్రక్రియను అనుసరిస్తున్నారు.
దీనిలో భాగంగా ఒక యంత్రీకృత ఓవర్‌హెడ్ కేబుల్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను పరిచయం చేస్తారు. దీనిని, వాహన ఆధారిత సేవలను దృష్టిలో పెట్టుకొని తయారు చేశారు. ఇది మనిషి ప్రమేయాన్ని తగ్గిస్తూ, కేబుల్ తరుగుదలను కనీస స్థాయికి పరిమితం చేస్తూ, వినియోగదారుకు అనుకూలతలను పెంచి, చార్జింగ్ కార్యకలాపాల్ని సువ్యవస్థీకరిస్తుంది. దీనిని ఇప్పుడున్న ఏసీ టైప్-2 విద్యుత్తు వాహన చార్జర్లలోనూ ఉపయోగించవచ్చును. డిపోల స్థాయిలో సురక్షిత, వ్యవస్థీకృత మౌలిక సదుపాయాల్ని ఈ వ్యవస్థ అందుబాటులోకి తీసుకువస్తుంది. వాహన రీచార్జింగ్ సమయాన్ని ఇప్పటి కన్నా మెరుగుపరుస్తుంది.
కేబుల్ నిర్వహణ, సామగ్రి రక్షణ, మెరుగైన పనితీరు వంటి కీలక నిర్వహణ సంబంధ సవాళ్లను పరిష్కరించడం ద్వారా, ఈవీ చార్జింగ్ డిపోల సామర్థ్యాన్ని ఈ సాంకేతికత చెప్పుకోదగినంతగా మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. కేబుళ్లు దెబ్బతినడాన్నీ, విధ్వంసం, ఇతరత్రా కార్యకలాపాల్లో ఎదురయ్యే ప్రమాదాల్నీ నివారించడం ద్వారా ఈ వ్యవస్థ చక్కని సురక్షా ప్రమాణాల్ని కూడా సమకూరుస్తుంది.
భారత విద్యుత్తు వాహన సాంకేతిక రంగంలో ప్రవర్ధమాన సంస్థల్లో ఎస్‌చార్జ్ సంస్థ ఒకటి. ఈ సంస్థ.. ఆధునిక పవర్ ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ చార్జింగ్ వ్యవస్థలను అభివృద్ధిపరచడంపై దృష్టిని కేంద్రీకరించింది. ఈ ప్రాజెక్టును చేపట్టి ఈవీ చార్జింగ్ సాంకేతిక రంగంలో దేశీయ శక్తిసామర్థ్యాలను బలోపేతం చేయాలనీ, అంతకంతకూ అభివృద్ధి చెందుతున్న విద్యుత్తు ఆధారిత రాక పోకల రంగంలో విస్తరించదగిన, దీర్ఘకాలం మన్నికతో కూడిన మౌలిక సదుపాయాల్ని సమకూర్చాలనీ ఈ సంస్థ ధ్యేయంగా పెట్టుకుంది.
టీడీబీ కార్యదర్శి శ్రీ రాజేశ్ కుమార్ పాఠక్ మాట్లాడుతూ... భారత్-యూకే కార్యక్రమం వంటి సహకారపూర్వక ఆర్ అండ్ డీ కార్యక్రమాలు ఉన్నత, పరిశ్రమలకు సంబంధించిన సాంకేతికతల అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడంలో ఒక కీలక పాత్రను పోషిస్తున్నాయన్నారు. విద్యుత్తు వాహనాల్ని అధిక సంఖ్యలో వినియోగించడానికీ, భారత్లో దృఢతర, సమర్థ, రాబోయే కాలం అవసరాలను తీర్చగల విద్యుత్తు వాహన చార్జింగ్ సంబంధిత మౌలిక సదుపాయాల కల్పనలో నూతన ఆవిష్కరణల్ని ప్రవేశపెట్టడంతో పాటు అనుబంధ విస్తారిత వ్యవస్థను ఏర్పాటు చేయడం కూడా ప్రధానమేనని ఆయన తెలిపారు.
ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ఎస్‌చార్జ్ సంస్థ ప్రమోటరు ప్రశంసించారు. ఈ ప్రాజెక్టు ఎప్పటికప్పుడు మార్పులకు లోనవుతున్న ఫ్లీట్ ఆపరేటర్ల, మౌలిక సదుపాయాల సేవల ప్రదాత సంస్థల అవసరాలను తీర్చడంతో పాటు వినూత్న విద్యుత్తు వాహన చార్జింగ్ సదుపాయాల్నీ , ప్రపంచ దేశాలతో పోటీ పడ గలిగే విద్యుత్తు వాహన చార్జింగ్ సదుపాయాల్నీ మార్కెట్టుకు అందించడంలో తమ సంస్థకు దోహద పడుతుందని ఎస్‌చార్జ్ సంస్థ యజమాని వ్యాఖ్యానించారు.
***
(రిలీజ్ ఐడి: 2249375)
సందర్శకుల సూచీ సంఖ్య : : 17