నీతి ఆయోగ్
తెలంగాణలోని 379 అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌లో 'పాఠశాల నుంచి అంకురాలు' అనే ఆవిష్కరణలకు ఊతమిచ్చేందుకు ప్రారంభమైన 'ఏటీఎల్ సారథి', 'మెంటార్ ఇండియా అకాడమీ'
ఇలాంటి కార్యక్రమాలు ఆత్మవిశ్వాసం, సామర్థ్యం, భవిష్యత్తు సవాళ్లను
ఎదుర్కోగల తరాన్ని తీర్చిదిద్దడంలో ఎంతో కీలకం: తెలంగాణ గవర్నర్
దీనిని సాకారం చేస్తోన్న అటల్ ఇన్నోవేషన్ మిషన్: తెలంగాణ గవర్నర్
నాడు పోస్టు చేయడమైనది:
04 APR 2026 5:11PM by PIB Hyderabad
ప్రధానమంత్రి 'వికసిత్ భారత్ 2047' దార్శనికతకు అనుగుణంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం), నీతి ఆయోగ్ ఈ రోజు తెలంగాణలో ఏటీఎల్ సారథి, మెంటార్ ఇండియా అకాడమీలను ప్రారంభించాయి. పాఠశాల స్థాయి నుండే ఆవిష్కరణలను ప్రోత్సహించాలనే నిబద్ధతను ఇది పునరుద్ఘాటించింది. దీని ద్వారా 379 అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌కు (ఏటీఎల్) క్రమబద్ధమైన మార్గదర్శకత్వం, సంస్థాగత మద్దతు లభిస్తుంది. ఇది యువ ఆవిష్కర్తలు తమ ఆలోచనలను పరిష్కారాలుగా మార్చడానికి తద్వారా భారత అభివృద్ధి ప్రయాణంలో భాగస్వామ్యం కావడానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా దేశంలో విస్తరిస్తోన్న క్షేత్ర స్థాయి ఆవిష్కరణల వ్యవస్థలో తెలంగాణను ఒక కీలక కేంద్రంగా నిలుపుతుంది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా, కేంద్ర బొగ్గు- గనుల శాఖ మంత్రి శ్రీ జీ. కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఏఐఎం, తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారుల భాగస్వామ్యంతో జరిగిన ఈ కార్యక్రమం.. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోగల ఆవిష్కర్తలను తీర్చిదిద్దడంలో ఉన్న ఉమ్మడి నిబద్ధతను చాటిచెప్పింది.
అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కేవలం అందుబాటులో ఉండటమే కాకుండా వాటి ద్వారా నిరంతర భాగస్వామ్యం, లోతైన ప్రభావం ఉండేలా చేయాలనే లక్ష్యంతో ఏటీఎల్ సారథి, మెంటార్ ఇండియాలను రూపొందించారు. ఇది ఏటీఎల్‌లను ప్రాంతాల వారీ క్లస్టర్లుగా విభజించి వాటిని ప్రముఖ స్థానిక సంస్థలతో అనుసంధానిస్తుంది. తద్వారా నిరంతర మార్గదర్శకత్వం, ఉపాధ్యాయ శిక్షణ, ఇంక్యుబేషన్‌తో పాటు అంకురాలకు మద్దతు కోసం అవసరమైన మార్గాలు ఉండేలా చూసుకుంటుంది. ఈ నమూనా ప్రకారం తెలంగాణలోని 379 ఏటీఎల్‌లను క్లస్టర్లుగా విభజిస్తారు. ప్రతి క్లస్టర్‌ను ఒక ప్రముఖ స్థానిక సంస్థతో అనుసంధానిస్తారు. తెలంగాణ రాష్ట్రానికి నోడల్ సంస్థగా వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాల ఎంపికైంది. ఇది ఏటీఎల్ పాఠశాలలకు మద్దతు ఇవ్వడానికి, స్థానిక ఆవిష్కరణల వ్యవస్థను బలోపేతం చేయడానికి సాంకేతిక విద్య, ఆవిష్కరణలు, వ్యవస్థాపకతలో తనకున్న నైపుణ్యాన్ని అందిస్తుంది.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశాన్ని ఉద్దేశించి తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా మాట్లాడుతూ.. “ఏటీఎల్ సారథి, మెంటార్ ఇండియా అకాడమీ యువ అభ్యాసకులు, అత్యున్నత విద్యా సంస్థలకు మధ్య అర్థవంతమైన అనుసంధానాన్ని ఏర్పరచడం ద్వారా మన పాఠశాలల్లో ఆవిష్కరణల పునాదిని బలోపేతం చేస్తుంది. ఇది విద్యార్థులను సృజనాత్మకంగా ఆలోచించేలా, వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించేలా, దేశ నిర్మాణంలో పాలుపంచుకునేలా శక్తిమంతులను చేస్తుంది. ఆత్మవిశ్వాసం, సామర్థ్యం, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోగల తరాన్ని తీర్చిదిద్దడంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతో కీలకం. అటల్ ఇన్నోవేషన్ మిషన్ దీనిని సాకారం చేస్తోంది” అని అన్నారు.
ఏటీఎల్ సారథి, మెంటార్ ఇండియా అకాడమీలను విద్యార్థులకు వర్ధమాన సాంకేతికతలపై ఆచరణాత్మక అవగాహన, క్రమబద్ధమైన సమస్య పరిష్కార పద్ధతులు, వారి ఆవిష్కరణలను విస్తరించుకునే అవకాశాలను కల్పించడం ద్వారా వారిని శక్తిమంతులుగా చేసేందుకు రూపొందించారు. ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంపొందించడం, సంస్థాగత మద్దతును అందించడం ద్వారా పాఠశాలల్లో ఆవిష్కరణ అనేది నిరంతరంగా, ఎల్లప్పుడూ అభివృద్ధి చెందే ప్రక్రియగా మారేలా ఈ కార్యక్రమం చూసుకుంటుంది.
అటల్ ఇన్నోవేషన్ మిషన్ మిషన్ డైరెక్టర్ శ్రీ దీపక్ బాగ్లా మాట్లాడుతూ.. “గౌరవ ప్రధానమంత్రి వికసిత్ భారత్ దార్శనికతతో ప్రేరణ పొంది ఆవిష్కరణలు చిన్న వయస్సులోనే ప్రారంభమై నిరంతరంగా వృద్ధి చెందే సంస్కృతిని నిర్మించే దిశగా మేం వేసిన ముఖ్యమైన అడుగులు... ఏటీఎల్ సారథి, మెంటార్ ఇండియా అకాడమీ. ప్రతి యువ ఆవిష్కర్త ఆలోచనల స్థాయి నుంచి ప్రభావం చూపే స్థాయికి ఎదిగేలా చేయడమే మా లక్ష్యం. పాఠశాలలు, విద్యా సంస్థలు, ఆవిష్కరణల వ్యవస్థల మధ్య బలమైన సంబంధాలను ఏర్పరచడం ద్వారా రాబోయే సంవత్సరాల్లో భారత వృద్ధి, పోటీతత్వం, స్వయంసమృద్ధిని నడిపించే సామర్థ్యం గల ప్రతిభావంతుల సమూహాన్ని మేం సిద్ధం చేస్తున్నాం” అని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో ఏటీఎల్ సారథి, మెంటార్ ఇండియా అకాడమీ ప్రారంభం.. దేశవ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ ఏటీఎల్‌లను నిర్వహిస్తూ విద్యార్థుల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల వ్యవస్థలలో ఒకటిగా నిలవాలన్న ఏఐఎం విస్తృత జాతీయ లక్ష్యంపై ఆధారపడి ఉంది. స్థానిక సంస్థాగత భాగస్వామ్యాలను ఉపయోగించుకోవడంతో పాటు ప్రభుత్వం, విద్యాసంస్థలు, పరిశ్రమ మధ్య సహకారాన్ని పెంపొందించడం ద్వారా ఆవిష్కరణలను కేవలం పరిచయం చేయడమే కాకుండా వాటిని నిరంతరంగా ప్రోత్సహించటం, విస్తరించేలా ఇవి నిర్ధారిస్తాయి.
బలమైన సంస్థాగత మద్దతు, నాయకత్వంతో ఏటీఎల్ సారథి, మెంటార్ ఇండియా అకాడమీ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ నుంచి వెలువడే ఆవిష్కరణల ఫలితాలను మెరుగుపరుస్తాయని, ప్రాంతీయ ఆవిష్కరణ కేంద్రాలను ప్రోత్సహిస్తాయని భావిస్తున్నారు. దీనితో పాటు అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే దిశగా భారతదేశపు ప్రయాణంలో అర్థవంతమైన సహకారాన్ని అందించే యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలను సృష్టిస్తాయన్న అంచనా ఉంది.
***
(రిలీజ్ ఐడి: 2249250)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11