సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మిషన్ కర్మయోగి పరిధిలో శాస్త్రవేత్తలు, విద్యావేత్తల కోసం తొలి ‘‘పరిపాలనా సామర్థ్య నిర్మాణం’’ కార్యక్రమాన్ని ప్రారంభించిన డాక్టర్ జితేంద్ర సింగ్: విద్యావేత్తలకు పరిపాలనాపరమైన నైపుణ్యాలను అందించడమే లక్ష్యం


పార్లమెంటరీ ప్రశ్నలకు సమాధానమిచ్చేలా సామర్థ్య నిర్మాణ కమిషన్ (సీబీసీ) మాడ్యూళ్లు, సహాయక కార్యదర్శులకు ఓరియెంటేషన్ శిక్షణ ఇవ్వాలని పిలుపునిచ్చిన మంత్రి

ఉన్నతి పోర్టల్, కర్మయోగి అధికారిక ప్రణాళికను ఆవిష్కరించిన డాక్టర్ జితేంద్ర సింగ్: అంతర్జాతీయంగా సామర్థ్య నిర్మాణ భాగస్వామ్యాలను పెంపొందించేలా సీబీసీ-ఆర్ఐఎస్ ఎంవోయూ

బాధ్యత ఆధారిత పరిపాలనను ప్రోత్సహించిన మంత్రి: పరిపాలనాపరమైన అడ్డంకులను తొలగించాలని పిలుపు

నాడు పోస్టు చేయడమైనది: 05 APR 2026 5:41PM by PIB Hyderabad

శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), పీఎంవో, అణుశక్తి, అంతరిక్షం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు ‘‘శాస్త్రవేత్తలు, విద్యావేత్తల కోసం పరిపాలనా సామర్థ్య నిర్మాణం’’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మిషన్ కర్మయోగి పరిధిలో విద్యావేత్తల్లో పరిపాలనా నైపుణ్యాలను, నిర్ణయ సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉద్దేశిస్తూ చేపట్టిన తొలి కార్యక్రమమిది.

‘‘సాధనా సప్తాహ్’’ ప్రత్యేక సెషన్లో ఈ కార్యక్రమాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాస్త్రవేత్తలు, విద్యావేత్తల్లో పరిపాలనాపరమైన అంశాల్లో నిర్మాణాత్మక శిక్షణ లేకపోవడం వల్ల నాయకత్వ బాధ్యతలు చేపట్టినప్పుడు ఈ అంతరం దీర్ఘకాలంగా కొనసాగుతోందన్నారు. శాస్త్రీయ, విద్యా రంగాలకు చెందిన నిపుణులకు పరిపాలనా ప్రక్రియల్లో అనుభవం లేనప్పటికీ తరచూ సంస్థాగత బాధ్యతలను చేపట్టాల్సి వస్తోందని మంత్రి అన్నారు ఈ సమస్యను క్రమపద్ధతిలో పరిష్కరించేందుకే ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు.

శాస్త్రీయ రంగ నిపుణులతో చర్చించిన అనంతరం ఈ కార్యక్రమాన్ని తయారు చేశామని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. ఈ తరహా వ్యవస్థీకృతమైన అభ్యాసం.. సొంతంగా నేర్చుకుంటూ సమయాన్ని వృథా చేసే, క్రమరహితంగా ఉండే విధానంపై ఆధారపడే అవసరాన్ని తగ్గిస్తుందన్నారు. సాంకేతిక సాధనాలు, మానవ నిర్ణయం మధ్య సమతౌల్యాన్ని కొనసాగిస్తూనే.. కృత్రిమ మేధతో సహా నూతన సాంకేతిక పరిజ్ఞానాలకు అనుగుణంగా, వాటిని స్వీకరించేలా ఈ కార్యక్రమం ఉండాలని సూచించారు.

నిర్దేశిత పరిపాలనా కార్యక్రమాల కోసం నిర్మాణాత్మక విధానాలను అభివృద్ది చేయడంతో సహా సామర్థ్య నిర్మాణ కమిషన్ (సీబీసీ)కు కొత్త దిశానిర్దేశాలను మంత్రి అందించారు. అధికారుల్లో విధానపరమైన అవగాహనను పెంపొందించేలా పార్లమెంటరీ ప్రశ్నలకు సమాధానమివ్వడంపై ప్రత్యేకమైన కోర్సును రూపొందించాలని సూచించారు. అదనపు శిక్షణా భారం లేకుండా కొత్తగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ప్రభుత్వ ఉద్యోగులు, సహాయక కార్యదర్శులకు పరిపాలనా వ్యవస్థలను పరిచయం చేసేందుకు స్వల్ప తరహా అవగాహనా కార్యక్రమాన్ని కూడా తయారు చేయాలన్నారు.  

అన్ని విభాగాల్లోని అధికారులు త్వరగా నేర్చుకొనేలా నియమాల ఆధారిత పనితీరు నుంచి బాధ్యతల ఆధారిత విధానం దిశగా సామర్థ్య నిర్మాణం ఉండాలని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అవరోధాల యుగం ముగిసిపోయింది కాబట్టి, పరిపాలనలో సంప్రదాయ విధానాలతో పాటుగా ప్రైవేటు రంగంలో అనుసరించే విధానాలను ఏకీకృతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఈ ఆలోచనను సామర్థ్య నిర్మాణ కమిషన్ ఛైర్‌పర్సన్ ఎస్ రాధా చౌహాన్ ప్రతిబింబిస్తూ... సాంకేతిక పరిజ్ఞానాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వ సంస్థలను అనుకూలమైనవిగా, మానవతా దృక్పథంతో కూడిన వాటిగా మార్చేందుకు తదుపరి దశ మిషన్ కర్మయోగి దృష్టి సారిస్తుందన్నారు. కృత్రిమ మేధ పాత్ర పెరుగుతున్న నేపథ్యంలో దానిని పరిపాలనలో ఏకీకరించడమనేది ఇకపై ఐచ్ఛికం కాదని ఆమె అన్నారు. అదే సమయంలో ప్రజా సేవల పంపిణీ మానవతా దృక్పథంతో నిండి, పౌర కేంద్రక విధానంలో ఉండాలని తెలిపారు. పరిమాణంపై మాత్రమే దృష్టి సారించకుండా వివిధ స్థాయుల్లో పనిచేసే ప్రభుత్వ సిబ్బందికి శిక్షణను అందించడంతో పాటు.. ఉన్నతి లాంటి వేదికల ద్వారా సంస్థాగత సహకారాన్ని బలోపేతం చేయడంతో సహా నాణ్యతను, సామర్థ్య నిర్మాణ ప్రయత్నాల విస్తృతిని మెరుగుపరచాల్సిన అవసరాన్ని ఛైర్ పర్సన్ వివరించారు.

సంస్థాగత సామర్థ్య నిర్మాణ వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా మెరుగుపరిచిన ఉన్నతి పోర్టల్‌ను, కర్మయోగి కర్తవ్య కార్యక్రమ జాతీయ స్థాయి ప్రణాళికను ఆవిష్కరించడంతో సహా పలు అనుబంధ కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. సామర్థ్య నిర్మాణంలో అంతర్జాతీయ భాగస్వామ్యాలను ప్రోత్సహించేలా సామర్థ్య నిర్మాణ కమిషన్, అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం పరిశోధన, సమాచార సంస్థ (ఆర్ఐఎస్) మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంపై మంత్రి సమక్షంలో సంతకాలు చేశారు. విధాన చర్చలు, ఉత్తమ పద్ధతులను ఇచ్చిపుచ్చుకోవడం, అంశాల వారీగా శిక్షణ కార్యక్రమాల ద్వారా నిర్మాణాత్మక భాగస్వామ్యాన్ని ఈ ఒప్పందం సాధ్యం చేస్తుంది. దీనిలో పరిపాలనలో కృత్రిమ మేధ, డిజిటల్ పరివర్తన, ప్రభుత్వ రంగంలో ఆవిష్కరణ, ప్రజలకు మేలు చేకూర్చేదిగా సామర్థ్య నిర్మాణాన్ని మార్చడం తదితర విభాగాల్లో ఈ ఒప్పందం దృష్టి సారిస్తుంది.

విజ్ఞాన భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో పద్మశ్రీ ప్రొఫెసర్ అశుతోష్ శర్మ, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగ కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరండికర్, బయోటెక్నాలజీ విభాగ కార్యదర్శి డాక్టర్ రాజేష్ ఎస్ గోఖలే, భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం రవిచంద్రన్, సామర్థ్య నిర్మాణ కమిషన్ (పరిపాలన) సభ్యులు అల్కా మిట్టల్ పాల్గొన్నారు.

నిరంతర అభ్యాసం, సాంకేతిక స్వీకరణ, పౌర కేంద్రక పరిపాలన విధానానికి తగినట్టుగా భవిష్యత్తు అవసరాలకు తగినట్టుగా ప్రభుత్వ సేవలను రూపొందించడంపై మిషన్ కర్మయోగిలో నిర్దేశిత అయిదేళ్ల కాల వ్యవధిలోగా చేపట్టే సంస్కరణలు దృష్టి సారిస్తాయని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. ముఖ్యంగా సేవల పంపిణీ, సంస్థాగత పనితీరులో మెరుగైన పరిపాలనాపరమైన ఫలితాలను సాధించేలా సామర్థ్య నిర్మాణం ఉండాలని, గణించదగిన పరిపాలనా ప్రభావాన్ని సాధించే దిశగా సాధించిన మార్పును ఈ శిక్షణ ప్రతిబింబించాలన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2249249) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी