కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
75 సంవత్సరాల సంస్థాగత శ్రేష్ఠత్వానికి సూచికగా ఒక తపాలా బిళ్లను విడుదల చేసిన కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా
పీటీసీ సహారన్‌పూర్ కేవలం ఒక సంస్థ కాదు.. సేవలో తరిస్తున్న సజీవ వారసత్వం: శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా
నాడు పోస్టు చేయడమైనది:
02 APR 2026 2:07PM by PIB Hyderabad
సహారన్‌పూర్ లోని పోస్టల్ ట్రయినింగ్ సెంటర్ (పీటీసీ) ప్లాటినమ్ జూబిలీ ఘట్టాన్ని తపాలా విభాగం నిర్వహించింది. శిక్షణనివ్వడంలో, సంస్థాగత సామర్థ్యాల్ని పెంపొందింపచేయడంలో 75 సంవత్సరాల శ్రేష్ఠత్వానికి గుర్తుగా ఒక స్మారక తపాలా బిళ్లను విడుదల చేశారు.
ఈ స్టాంపును కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా న్యూఢిల్లీ ఆకాశవాణి భవన్‌లోని రంగ్ భవన్ సభామందిరంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ సర్వీసుల డైరెక్టర్ జనరల్ శ్రీ జితేంద్ర గుప్త, డీసీసీ మెంబర్ (ఫైనాన్స్) శ్రీ మనీష్ సిన్హా, సీజీసీఏ వందనా గుప్తా, సభ్యుడు (మానవ వనరుల అభివృద్ధి..హెచ్ఆర్‌డీ) కల్నల్ ఎస్.ఎఫ్.హెచ్. రిజ్వీతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

(ఎడమ నుంచి కుడికి: సభ్యుడు (హెచ్ఆర్‌డీ) కల్నల్ ఎస్.ఎఫ్.హెచ్. రిజ్వీ, డైరెక్టర్ జనరల్ పోస్టల్ సర్వీసెస్ శ్రీ జితేంద్ర గుప్తా, శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా, డీసీసీలో సభ్యుడు (ఫైనాన్స్) శ్రీ మనీష్ సిన్హా, సీజీసీఏ వందన గుప్తా)
సభను ఉద్దేశించి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా ప్రసంగిస్తూ ఈ సందర్భాన్ని ఒక చరిత్రాత్మక ప్రగతి ప్రస్థానంగా వర్ణించారు. పోస్టల్ ట్రయినింగ్ సెంటర్ కేవలం ఒక సంస్థ కాదని, ఇది చరిత్రను శ్వాసిస్తూ, నిరంతరం మార్పులకు లోనవుతున్న స్థలమని ఆయన అన్నారు. 75 సంవత్సరాల వేడుకను జరుపుకోవడం దేశ నిర్మాణానికి పోస్టల్ ట్రయినింగ్ సెంటర్ చిరకాలంగా అందజేస్తున్న తోడ్పాటుకు అద్దం పడుతోందని ఆయన తెలిపారు.
భవిష్యత్తు పథకాలను మంత్రి వివరిస్తూ భారత్.. 2030 కల్లా ఒక్క మన దేశానికే కాకుండా ప్రపంచానికే ఆధునిక రవాణా వ్యవస్థలో ఓ కీలక దేశంగా మారే దిశగా పురోగమిస్తోందన్నారు. ఈ మహత్వకాంక్షను సాకారం చేయడంలో తపాలా విభాగం, ఆ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది కీలక పాత్రను పోషించారని ఆయన స్పష్టం చేశారు.
పోస్టల్ ట్రయినింగ్ సెంటర్, సహారన్‌పూర్‌ను 1951 ఏప్రిల్ 2న ఏర్పాటు చేశారు. తపాలా సిబ్బందికి ఒక నిర్దిష్ట, వృత్తి నైపుణ్యంతో కూడిన శిక్షణ వ్యవస్థను పరిచయం చేసి స్వతంత్ర భారతదేశంలో పరిపాలన ప్రణాళికను బలపరచాలన్న లక్ష్యంతో ఈ పీటీసీని స్థాపించారు. అంతవరకూ లాంఛనప్రాయంగా సాగిన కార్య ఆధారిత శిక్షణను, 56.71 ఎకరాల క్యాంపస్‌లో పద్ధతి ప్రకారం రూపొందించిన సంస్థాగత ప్రణాళిక సాయంతో అమలు చేయదల్చారు. గత కొన్నేళ్లలో ఈ సెంటర్ ఉత్తర భారతదేశంలో ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల తపాలా సిబ్బందికి సేవలను అందిస్తూ, ఒక ప్రతిష్ఠాత్మక శిక్షణ సంస్థగా పేరుతెచ్చుకొంది. ప్రస్తుతం దీనిలో 11 ఉన్నత స్థాయి కంప్యూటర్ ల్యాబొరేటరీలు, ఒక ఈ-స్టూడియో భాగమయ్యాయి. ఈ -కామర్స్ లాజిస్టిక్స్‌తో పాటు, డిజిటల్ మాధ్యమం ద్వారా ఏటా సుమారు 3,000 మంది ఉద్యోగులకు కార్యకలాపాల నిర్వహణ, ఆర్థిక సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకుపోవడంతో పాటు, క్రమశిక్షణ, విశ్వసనీయత, ప్రజాసేవా సంబంధిత కీలక విలువల్ని కూడా ఈ సెంటర్‌లో నేర్పిస్తున్నారు.
ఈ స్మారక తపాలా బిళ్లలను దేశ వ్యాప్తంగా తపాలా బిళ్లల బ్యూరోల్లో అందుబాటులో ఉంచారు. ఈ స్టాంపులను www.epostoffice.gov.in లో ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా కూడా కొనుక్కోవచ్చు.
***
(రిలీజ్ ఐడి: 2248630)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15