మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
‘విద్య కోసం ఏఐ, విద్యలో ఏఐ‘ లక్ష్యాలకు అనుగుణంగా భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా అభ్యాస ప్రక్రియను మార్చడంలో కొత్త పాఠ్యప్రణాళిక ఒక విప్లవాత్మక అడుగు: శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
3 నుంచి 8వ తరగతి వరకు కంప్యూటేషనల్ థింకింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై సీబీఎస్ఈ కొత్త పాఠ్యప్రణాళికను ప్రారంభించిన కేంద్ర విద్యామంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
01 APR 2026 7:41PM by PIB Hyderabad
కంప్యూటేషనల్ థింకింగ్ (సీటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పై 3 నుంచి 8వ తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన సీబీఎస్ఈ కొత్త పాఠ్యప్రణాళికను కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. కేంద్ర నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల స్థాపన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌదరితో పాటు పాఠశాల విద్య, సాక్షరత విభాగం కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్, ఉన్నత విద్యా విభాగం కార్యదర్శి డాక్టర్ వినీత్ జోషి, సీబీఎస్ఈ ఛైర్మన్ శ్రీ రాహుల్ సింగ్, ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ శ్రీ దినేష్ ప్రకాష్ సక్లానీ, విద్యా మంత్రిత్వ శాఖ, సీబీఎస్ఈ, కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ, ఎన్సీఈఆర్టీకి చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సభను ఉద్దేశించి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, 3 నుంచి 8వ తరగతుల వరకు కంప్యూటేషనల్ థింకింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై కొత్త పాఠ్యప్రణాళికను ప్రారంభించడం విద్యా సంవత్సరం ఆరంభంలో భవిష్యత్తు అవసరాలకు తగిన అభ్యాసం వైపు ఒక విప్లవాత్మక అడుగు అని పేర్కొన్నారు. ఈ చొరవ పాఠశాల వ్యవస్థలో వ్యవస్థీకృత ఏఐ విద్యను భారీ స్థాయిలో అధికారికంగా ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. ఈ పాఠ్యప్రణాళికకు అనుగుణంగా క్రమబద్ధమైన మాడ్యూల్స్, సమగ్రమైన ఉపాధ్యాయ కరదీపికలు, పటిష్టమైన విద్యార్థి మూల్యాంకన విధానాలు ఉన్నాయని, ఇవి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై విద్యార్థులకు చిన్న వయస్సు నుంచే సరైన అవగాహన కల్పిస్తూ, రేపటి తరం అభ్యాసకులకు బలమైన పునాది వేస్తాయని ఆయన వివరించారు.
‘విద్య కోసం ఏఐ, విద్యలో ఏఐ‘ (ఏఐ ఫర్ ఎడ్యుకేషన్, ఏఐ ఇన్ ఎడ్యుకేషన్) దార్శనికతకు అనుగుణంగా, ఈ చొరవ యువతలో విమర్శనాత్మక ఆలోచన, డిజైన్ ఓరియంటేషన్, ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించడం ద్వారా మెరుగైన అభ్యాసం వైపు ఒక నిర్ణయాత్మక మార్పును సూచిస్తుందని మంత్రి తెలిపారు. సాంకేతికత ఆధారిత కంప్యూటింగ్‌లో భారత నాయకత్వానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తున్న తరుణంలో, ఈ పాఠ్యప్రణాళిక డిజిటల్ భవిష్యత్తును అర్థం చేసుకోవడానికి, దానిని తీర్చిదిద్దడానికి విద్యార్థులకు శక్తినిస్తుందని శ్రీ ప్రధాన్ స్పష్టం చేశారు.
దూరదృష్టితో కూడిన ఈ పాఠ్యప్రణాళికను రూపొందించినందుకు, సాంకేతికతతో కూడిన విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ), నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ)లను శ్రీ ప్రధాన్ అభినందించారు.
ఈ సందర్భంగా శ్రీ జయంత్ చౌదరి మాట్లాడుతూ, మారుతున్న ప్రపంచానికే కాకుండా, మనం ఊహించలేని విధంగా మారబోయే భవిష్యత్తు కోసం కూడా నేటి విద్య యువతను సిద్ధం చేయాలని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే విజ్ఞాన సముపార్జన, నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థిక వ్యవస్థల పనితీరును మారుస్తోందని, అందువల్ల మన పిల్లలు సాంకేతికతను కేవలం వినియోగించేవారిగా కాకుండా, దానిని ఆలోచనాత్మకంగా సృష్టించేవారుగా, బాధ్యతాయుతమైన నాయకులుగా ఎదగడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. చిన్న వయస్సు నుంచే కంప్యూటేషనల్ థింకింగ్‌ను పరిచయం చేయడం ద్వారా నిరంతరం నేర్చుకుంటూ, అస్థిరతను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటూ, అడ్డంకులను అవకాశాలుగా మార్చుకోగల ఒక తరానికి మనం పునాది వేస్తున్నామని ఆయన తెలిపారు. ఇది కేవలం విద్యా సంస్కరణ మాత్రమే కాదు, మానవ సామర్థ్యంపై జాతీయ పెట్టుబడి అని ఆయన అన్నారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 దార్శనికతకు అనుగుణంగా, భారతీయ అభ్యాసకులను రేపటి ఉద్యోగాలకే కాకుండా, ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించే ఆలోచనలు, వ్యవస్థలు, పరిష్కారాలను రూపొందించేవారిగా సిద్ధం చేయడం దీని ఉద్దేశమని ఆయన వివరించారు.
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం పర్యవేక్షణలో, పాఠశాల విద్యార్థులలో ఏఐ పట్ల సంసిద్ధతను పెంపొందించడానికి కంప్యూటేషనల్ థింకింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యప్రణాళికను సీబీఎస్ఈ అమలు చేస్తోంది. ఈ పాఠ్యప్రణాళికను 2026-27 విద్యా సంవత్సరం నుంచి 3 నుంచి 8వ తరగతి వరకు అమలు చేస్తారు. కంప్యూటేషనల్ థింకింగ్ నైపుణ్యాలపై దృష్టి సారించడం ద్వారా విద్యార్థులను ఏఐ సన్నద్ధ అభ్యాసకులుగా తీర్చిదిద్దడమే దీని లక్ష్యం. కంప్యూటేషనల్ థింకింగ్ నైపుణ్యాల ద్వారా పెంపొందే ఏఐ-సంసిద్ధత విద్యార్థులలో తార్కిక ఆలోచన, సమస్యల పరిష్కారం, ప్యాటర్న్ రికగ్నిషన్ వంటి సామర్థ్యాలను అభివృద్ధి చేయడమే కాకుండా వారు రోజువారీ జీవితంలో కృత్రిమ మేధ పాత్ర, వినియోగాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ పాఠ్యప్రణాళిక కంప్యూటేషనల్ థింకింగ్, డిజిటల్ అక్షరాస్యత, సాంకేతికతను బాధ్యతాయుతంగా ఉపయోగించడం వంటి అంశాల్లో బలమైన పునాదులు వేయడంతో పాటు, ఆవిష్కరణలు, విమర్శనాత్మక ఆలోచన, నైతిక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాలను పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రాముఖ్యత: కంప్యూటేషనల్ థింకింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిచయం ఆవశ్యకత
విద్యార్థులను భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉన్న డిజిటల్ పౌరులుగా తీర్చిదిద్దడంలో సీటీ, ఏఐలను పరిచయం చేయడం అత్యంత కీలకం.
-
ఏఐకి పునాది: కృత్రిమ మేధ ఆధారిత పరిష్కారాలను అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తులో వాటిని రూపొందించడానికి అవసరమైన మేధోపరమైన బలం, ఆలోచనా విధానాన్ని కంప్యూటేషనల్ థింకింగ్ అందిస్తుంది.
-
విజ్ఞాన వికాసం: ఇది తార్కిక ఆలోచన, వ్యవస్థీకృత సమస్య పరిష్కారం, నమూనాలను గుర్తించే సామర్థ్యాల వంటి ముఖ్యమైన మానవ సామర్థ్యాలను పెంపొందిస్తుంది.
-
భవిష్యత్తుకు సిద్ధం చేయడం: చిన్న వయస్సు నుంచే వీటిపై అవగాహన కల్పించడం వల్ల ఆధునిక పని ప్రపంచంలో ఎంతో అవసరం అయిన డేటాను సమర్థవంతంగా ఉపయోగించే సామర్థ్యం, సాంకేతికతను నైతికంగా అన్వయించే నైపుణ్యం లభిస్తాయి.
-
సమగ్ర అభివృద్ధి: ఇది విద్యలో వివిధ అంశాల అభ్యాసాన్ని ప్రోత్సహిస్తుంది. గణితం, సైన్స్, హ్యుమానిటీస్ వంటి వివిధ సబ్జెక్టులను అనుసంధానించడం ద్వారా విజ్ఞానం అనేది వేర్వేరు విభాగాలుగా కాకుండా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుందని విద్యార్థులు అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది.
ఎన్ఈపీ, ఎన్‌సీఎఫ్ 2023తో అనుసంధానం
జాతీయ విద్యా సంస్కరణలకు పూర్తి అనుగుణంగా ఈ పాఠ్యప్రణాళిక రూపుదిద్దుకుంది.
* ఎన్ఈపీ 2020 దార్శనికత: పాఠశాల విద్యలో కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలను అనుసంధానించడం ద్వారా, ఈ రంగాలలో భారత్ ను ప్రపంచ నాయకత్వ స్థానంలో నిలపాలనే లక్ష్యాన్ని ఇది నెరవేరుస్తుంది.
* ఎన్‌సీఎఫ్-ఎస్ఈ 2023తో అనుసంధానం: ఈ పాఠ్యప్రణాళికలోని అభ్యాస ప్రమాణాలను (లక్ష్యాలు, సామర్థ్యాలు, ఫలితాలు) పాఠశాల విద్యకు సంబంధించిన పాఠ్య ప్రణాళిక (నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్) 2023) సూచించిన నిబంధనల నుంచి తీసుకున్నారు.
* దశల వారీ అమలు: ఎన్‌సీఎఫ్ సిఫార్సుల మేరకు, పై తరగతులలో ఏఐని నేర్చుకోవడానికి అవసరమైన పునాదిగా, ఈ పాఠ్యప్రణాళిక మొదట కంప్యూటేషనల్ థింకింగ్ ను పరిచయం చేస్తుంది.
విధానం / బోధనా పద్ధతి
ఈ బోధనా విధానాన్ని ఆటపాటలతో కూడిన అనుభవాధారితంగా రూపకల్పన చేశారు.
-
కార్యాచరణ ఆధారితం: ప్రత్యేకమైన వర్క్షీట్లు, సరదా గణిత క్రీడలు, పజిల్స్, ప్రత్యక్ష సాధనల ద్వారా అభ్యాస ప్రక్రియ సాగుతుంది.
-
సమస్యల పరిష్కారంపై దృష్టి: ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తూ, పెద్ద సమస్యలను చిన్న భాగాలుగా ఎలా విభజించాలో, చార్ట్‌లు, రేఖాచిత్రాల వంటి దృశ్య రూపాలను ఎలా విశ్లేషించాలో నేర్పిస్తారు.
-
సామూహిక అభ్యాసం: సమస్యలను సామూహికంగా పరిష్కరించడానికి ఈ పాఠ్యప్రణాళిక తోటి విద్యార్థులతో చర్చలు, గ్రూప్ వారీ లక్ష్యాలకు ప్రాధాన్యతనిస్తుంది.
మూల్యాంకనం
బట్టీ పట్టడం నుంచి నిరంతర, సామర్థ్యాధారిత పద్ధతుల ఆధారంగా మూల్యాంకనం ఉంటుంది.
-
ఇంటరాక్టివ్ సాధనాలు: వీటిలో కంప్యూటేషనల్ థింకింగ్ పజిల్స్‌తో కూడిన రాత పరీక్షలు, పరస్పర చర్చలతో కూడిన బృదాల వారీ కార్యకలాపాలు, విద్యార్థుల పురోగతిని పర్యవేక్షించడానికి 'టీచర్ అబ్జర్వేషన్ జర్నల్' వంటి పద్ధతులు ఉన్నాయి.
-
గుణాత్మక దృష్టి: విద్యార్థి తన విజ్ఞానాన్ని ఎలా అన్వయిస్తున్నాడు, ఎంత సృజనాత్మకంగా ఆలోచిస్తున్నాడు అనే సామర్థ్యాన్ని అంచనా వేయడమే దీని ప్రధాన లక్ష్యం.
***
(రిలీజ్ ఐడి: 2248105)
సందర్శకుల సూచీ సంఖ్య : : 22