కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఏకైక రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసే చారిత్రక సవరణ: స్థిరత్వం, వృద్ధి దిశగా నిర్ణయాత్మక అడుగు


ఏళ్ల తరబడి కొనసాగుతున్న అనిశ్చితికి స్వస్తి చెబుతూ.. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పునరుద్ధరిస్తూ, రూ. 56,000 కోట్ల అభివృద్ధి వేగాన్ని పెంచే బిల్లు

జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో దూరదృష్టి కలిగిన నాయకత్వంతో సాధ్యమైన పరివర్తనాత్మక సంస్కరణ

నాడు పోస్టు చేయడమైనది: 01 APR 2026 2:58PM by PIB Hyderabad

లోక్ సభలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ (సవరణ) బిల్లు-2026 ఆమోదం పొందడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రయాణంలో కీలకమైన ఘట్టంగా కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్ర శేఖర్ వర్ణించారు.

 

 

ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడం ద్వారా ఈ బిల్లు.. పరిపాలన, పెట్టుబడులు, వృద్ధిపై దీర్ఘ కాలంగా ప్రభావాన్ని చూపిస్తున్న నిర్మాణాత్మక అనిశ్చితిని తొలగిస్తుంది.

గత కొన్నేళ్లుగా స్పష్టంగా నిర్ణయించిన రాజధాని లేకపోవడం వల్ల పరిపాలనపరమైన సందిగ్ధతకు, మౌలిక వసతుల ఏర్పాటులో జాప్యానికి, పెట్టుబడిదారుల విశ్వాసం క్షీణతకు దారితీసిందని ఆయన అన్నారు. స్పష్టమైన, స్థిరమైన, భవిష్యత్తు దృష్టితో కూడిన నిబంధనలను ఈ సవరణ అందిస్తుంది. అలాగే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ స్ఫూర్తికి అనుగుణంగా ఏకైక, అంతర్జాతీయ స్థాయి రాజధాని అనే లక్ష్యాన్ని బలోపేతం చేస్తుంది.

అమరావతి ఉద్యమాన్ని ముందుండి నడిపించిన రైతులు, మహిళల అసాధారణ త్యాగాలను కేంద్ర మంత్రి వివరించారు. 29,000కు పైగా రైతులు 34,000 ఎకరాలకు పైగా తమ పూర్వీకుల భూములను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అందించారు. విధాన నిర్ణయాల్లో మార్పుల కారణంగా దీర్ఘకాలంగా నెలకొన్న అనిశ్చితిని భరించారు.

శాంతియుత నిరసనలు తెలిపిన మహిళలు, స్థానిక సంఘాలు తీవ్రమైన కష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ, దృఢసంకల్పంతో, క్రమశిక్షనతో, అహింసాయుత పద్ధతిలో తమ ఉద్యమాన్ని 1,600 రోజులకు పైగా కొనసాగించి ప్రజాస్వామ్య స్ఫూర్తికి శక్తిమంతమైన చిహ్నంగా నిలిచారు.

ఇది న్యాయపరమైన సవరణ మాత్రమే కాదని, రాష్ట్ర భవిష్యత్తు కోసం అసమాన త్యాగాలను చేసిన వారి గౌరవాన్ని, న్యాయాన్ని, నమ్మకాన్ని పునరుద్ధరించే నైతికపరమైన చర్య అని మంత్రి స్పష్టం చేశారు.

 

అంతర్జాతీయ స్థాయి నగరంగా, ఆంధ్రప్రదేశ్ వృద్ధిని నడిపించే శక్తిగా రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దే పరివర్తనాత్మక లక్ష్యాన్ని డాక్టర్ పెమ్మసాని పునరుద్ఘాటించారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థల మద్దతుతో రూ.56,000 కోట్ల విలువైన 91 ప్రధాన మౌలిక వసతులకు సంబంధించిన ప్రాజెక్టు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అమరావతికి అధికారిక గుర్తింపు లభించడం పెట్టుబడులను వేగవంతం చేస్తుందని, విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని, రాష్ట్ర ఆర్థిక వృద్ధిని గణనీయంగా విస్తరిస్తుందని ఆశిస్తున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు.

రాష్ట్ర రాజధాని భవిష్యత్తులో రైతులే ప్రధాన శక్తిగా మారిన భాగస్వామ్య విధానానికి, సమగ్రాభివృద్ధికి మార్గదర్శక ఉదాహరణగా స్వచ్ఛంద భూసమీకరణపై నిర్మితమైన అమరావతి విధానం నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆవిష్కరణాత్మక విధానం.. అనుసరించదగిన సమవృద్ధి విధానంగా దేశం దృష్టిని ఆకర్షించదన్నారు.

ఆర్థిక ప్రదర్శనను మెరుగుపరచడంలో రాజధాని నగరాలు పోషించే కీలక పాత్రను కూడా కేంద్ర మంత్రి వివరించారు. ఆయా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల వృద్ధిలో ప్రధాన నగరాలు తమ వంతు తోడ్పాటును అందిస్తాయని తెలిపారు. అమరావతి రాజధానిగా పరిపాలన, వాణిజ్యం, ఆవిష్కరణల్లో ఆంధ్రప్రదేశ్ శక్తిమంతమైన కేంద్రంగా ఆవిర్భవించడానికి సిద్ధంగా ఉంది.

జాతీయ, రాష్ట్ర నాయకత్వాల పాత్ర గురించి వివరిస్తూ.. ఈ చరిత్రాత్మక చట్టం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయాత్మక నాయకత్వాన్ని, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు దూరదృష్టితో కూడిన ప్రణాళికను, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అందించిన కీలకమైన మద్దతును ప్రతిబింబిస్తుందన్నారు.

ఈ బిల్లు కేవలం ఒక విధాన నిర్ణయం మాత్రమే కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గమనాన్ని పునర్నిర్వచించే ఒక నిర్ణయాత్మక దిద్దుబాటు చర్య. పరిపాలనా స్థిరత్వాన్ని కల్పించడం, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పునరుద్ధరించడం, ప్రజల త్యాగాలను గౌరవించడం ద్వారా ఈ సవరణ అమరావతిని ఆకాంక్ష, దృఢత్వం, సమ్మిళిత వృద్ధికి శాశ్వత ప్రతీకగా నిలుపుతుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2247880) సందర్శకుల సూచీ సంఖ్య : : 79
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी