ఆయుష్
13 భాషల్లో అందుబాటులోకి ఆయుర్వేద పరిశోధనలు... అనువాదిని ఏఐతో సీసీఆర్ఏఎస్ ఒప్పందం
భాషా అడ్డంకులను అధిగమించి, సాక్ష్యాధారిత శాస్త్రీయ పరిజ్ఞానాన్ని
అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏఐ సాంకేతికత వినియోగం
నాడు పోస్టు చేయడమైనది:
30 MAR 2026 4:48PM by PIB Hyderabad
భాషాపరమైన అవరోధాలను అధిగమించి, సాక్ష్యాధారాలతో కూడిన ఆయుర్వేద సమాచారాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ఆయుర్వేద విజ్ఞాన పరిశోధనా మండలి (సీసీఆర్ఏఎస్), కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) రూపొందించిన ‘అనువాదిని ఏఐ’ వేదికతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా సాక్ష్యాధారాలతో కూడిన ఆయుర్వేద పరిజ్ఞానాన్ని ప్రజలకు చేరవేయడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఈ ఒప్పందం ప్రకారం సీసీఆర్ఏఎస్ నిర్వహించిన పరిశోధన ఫలితాలు, విద్యా సంబంధిత సమాచారాన్ని హిందీతో సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లోకి అనువదించడానికి ‘అనువాదిని ఏఐ’ సహాయపడుతుంది. దీని ద్వారా సాక్ష్యాధారాలతో కూడిన ఆయుర్వేద విజ్ఞానం దేశంలోని ప్రతి మూలకు చేరవేయడం సాధ్యమవుతుంది.
అధునాతన భాషా సాంకేతికత, దేశ సంప్రదాయ వైద్య విజ్ఞానాల అపూర్వ కలయికకు నిదర్శనంగా నిలిచిన ఈ ఒప్పందంపై సీసీఆర్ఏఎస్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ వైద్య రబినారాయణ్ ఆచార్య, అనువాదిని ఏఐ ముఖ్య కార్యనిర్వాహక అధికారి డాక్టర్ బుద్ధ చంద్రశేఖర్ సంతకాలు చేశారు.
కృత్రిమ మేధ ద్వారా సాంకేతిక, శాస్త్రీయ, ప్రభుత్వ పాలనకు సంబంధించిన విజ్ఞానాన్ని వివిధ భారతీయ, విదేశీ భాషల్లోకి అనువదించడంపై అనువాదిని ఏఐ దృష్టి సారిస్తుంది. భాషాపరమైన లేదా ప్రాంతీయ నేపథ్యంతో సంబంధం లేకుండా, పరిశోధన ఆధారిత, విశ్వసనీయమైన సమాచారం పౌరులందరికీ అందుబాటులో ఉండేలా చూడటమే దీని ప్రధాన లక్ష్యం.
సీసీఆర్ఏఎస్ దేశంలోని 25 రాష్ట్రాల్లో 30 సంస్థలను కలిగి ఉంది. ఇది ఆయుర్వేద శాస్త్రాల్లో శాస్త్రీయ పరిశోధనలను నిర్వహించి ప్రచురిస్తుంది. దీని ప్రధాన ప్రచురణల్లో ఒకటైన త్రైమాసిక పరిశోధన పత్రిక 'సీసీఆర్ఏఎస్ బులెటిన్ తోపాటు ఇతర సమాచార, విద్యా, ప్రసార విషయాలను ప్రస్తుతం ప్రధానంగా ఆంగ్లంలోనే ప్రచురిస్తుంది. ఈ ఒప్పందం ద్వారా సంబంధిత పరిశోధన ఫలితాలను, విద్యా వనరులను 13 ప్రాంతీయ భాషల్లోకి అనువదించడాన్ని ‘అనువాదిని ఏఐ’ సులభతరం చేస్తుంది. ఇది ప్రామాణికమైన ఆయుర్వేద సమాచారాన్ని విస్తృత స్థాయిలో ప్రజలకు చేరవేయడమే కాకుండా తప్పుడు సమాచారం వ్యాప్తి చేందే అవకాశాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
ఈ సందర్భంగా సీసీఆర్ఏఎస్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ రబినారాయణ్ ఆచార్య మాట్లాడుతూ.. ఆయుర్వేద పరిశోధన ఫలాలు కేవలం విద్యావేత్తలకే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజలకు సైతం వారి మాతృభాషల్లో అందాలన్న తమ నిబద్ధతకు ఈ భాగస్వామ్యం నిదర్శనమని పేర్కొన్నారు.
సాంకేతికత సాయంతో విజ్ఞానాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తూ, అందరికీ సమాన అవకాశాలు కల్పించి సాధికారతను అందించేందుకే అనువాదిని ఏఐ వేదికను ప్రత్యేకంగా అభివృద్ధి చేసినట్లు ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ బుద్ధ చంద్రశేఖర్ పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని విదేశీ భాషలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ, సీసీఆర్ఏఎస్ సంయుక్తంగా ఆయుష్ ఛైర్స్ (ఆయుష్ ప్రత్యేక అధ్యాపక పదవులు) ఏర్పాటు చేసిన దేశాల భాషలతో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. తద్వారా ప్రామాణికమైన ఆయుర్వేద జ్ఞానం ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి రానుంది.
***
(రిలీజ్ ఐడి: 2247066)
సందర్శకుల సూచీ సంఖ్య : : 25