సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అనధికారిక రికార్డింగ్, ప్రసారాలపై కఠిన జరిమానాలతో పైరసీ నిరోధక చట్టాలను బలోపేతం చేస్తున్న సినిమాటోగ్రాఫ్ (సవరణ) చట్టం 2023


సినిమా పైరసీపై ప్రభుత్వం ఉక్కుపాదం: 3,142 టెలిగ్రామ్ ఛానెళ్లకు నోటీసులు, 800 వెబ్‌సైట్ల నిలిపివేత

బలమైన చట్టపరమైన వ్యవస్థ: పైరసీ కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ఐటీ నిబంధనలు 2021 ద్వారా మధ్యవర్తిత్వ సంస్థలకు ఆదేశం

నాడు పోస్టు చేయడమైనది: 27 MAR 2026 6:11PM by PIB Hyderabad

సినిమా పైరసీని అరికట్టడానికి చట్టపరమైన వ్యవస్థను సినిమాటోగ్రాఫ్ (సవరణ) చట్టం 2023 మరింత బలోపేతం చేసింది. సినిమాటోగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 6ఏఏ, 6ఏబీ ప్రకారం అనుమతి లేకుండా సినిమాలను రికార్డ్ చేయడం,వాటిని ప్రసారం చేయడం నిషేధం. సెక్షన్ 7(1ఏ) ప్రకారం ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే వారికి కనీసం 3 నెలల జైలు శిక్ష, రూ. 3 లక్షల జరిమానా విధిస్తారు. నేరం తీవ్రతను బట్టి దీనిని 3 ఏళ్ల జైలు శిక్ష వరకు, అలాగే సినిమా మొత్తం నిర్మాణ వ్యయంలో 5 శాతం వరకు జరిమానా విధించవచ్చు. ఐటీ చట్టం 2000 లోని సెక్షన్ 79(3) ప్రకారం పైరసీ కంటెంట్‌ కలిగి ఉన్న లేదా ప్రసారం చేస్తున్న సోషల్‌ మీడియా లేదా ఇతర మధ్యవర్తిత్వ సంస్థలకు నోటీసులు ఇచ్చేందుకు  సెక్షన్ 7(1బీ)(ii) ద్వారా ప్రభుత్వానికి అధికారం ఉంటుంది.

పైరసీ నిరోధక చర్యలు

·       పైన పేర్కొన్న చట్టపరమైన నిబంధనల మేరకు ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 79(3)(బీ) ప్రకారం టెలిగ్రామ్ యాప్‌కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కాపీరైట్ చట్టం 1957ను ఉల్లంఘిస్తూ వివిధ ఓటీటీ వేదికల్లో నిర్మాణ సంస్థలకు చెందిన సమాచారాన్ని ఎలాంటి అనుమతి లేకుండా  ప్రసారం చేస్తున్న 3,142 ఛానళ్లను తక్షణమే తొలగించాలని, వాటికి యాక్సెస్‌ను నిలిపివేయాలని 2026 మార్చి 11న ఆదేశించింది.

·       దీనితో పాటు పైరసీ కంటెంట్‌ను కలిగి ఉన్న సుమారు 800 వెబ్‌సైట్లను ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ప్రభుత్వం నిలిపివేసింది.

 3 నవంబర్‌ 2023 నాటి బహిరంగ నోటీసులో సూచించిన నిర్దేశిత రూపంలో ఫిర్యాదులను స్వీకరించడానికి నోడల్ అధికారులతో ఒక సంస్థాగత యంత్రాంగాన్ని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. ఇందులో సినిమా అసలు కాపీరైట్ యజమానులు, వారు అధికారం ఇచ్చిన వ్యక్తులు లేదా ఇంటర్నెట్‌లో పైరసీ కాపీల ప్రదర్శన గురించి సమాచారం ఉన్న ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు అందిన వెంటనే.. గుర్తించిన పైరసీ లింకులను నిలిపివేయడానికి సంబంధిత వెబ్‌సైట్లు, సోషల్ మీడియా సంస్థలకు  ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది.

చట్టవిరుద్ధమైన చర్యలు లేదా కంటెంట్‌కు సంబంధించి మధ్యవర్తులకు ప్రభుత్వాలు నోటీసు ఇచ్చినప్పుడు, అటువంటి కంటెంట్‌ను తొలగించడానికి ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 79(3)(బీ) అవకాశం కల్పిస్తుంది. కోర్టు ఉత్తర్వు ద్వారా లేదా సంబంధిత ప్రభుత్వం, దాని గుర్తింపు పొందిన సంస్థ ద్వారా నోటీసు అందినప్పుడు చట్టాన్ని ఉల్లంఘించే ఏ కంటెంట్‌నైనా మధ్యవర్తిత్వ సంస్థలు దానిని వెంటనే తొలగించాల్సి ఉంటుంది.

ఐటీ చట్టం 2000 కింద సమాచార సాంకేతిక (మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నైతిక నియమావళి) నిబంధనలు 2021ని భారత ప్రభుత్వం నోటిఫై చేసింది. సామాజిక మాధ్యమాలతో సహా అన్ని మధ్యవర్తిత్వ సంస్థలు తమ వేదికలపై ప్రదర్శించే, అప్లోడ్ చేసే, ప్రచురించే, ప్రసారం చేసే, నిల్వ చేసే, షేర్ చేసే సమాచారానికి సంబంధించి ఐటీ నియమాలు 2021లోని రెండో భాగం కొన్ని నిర్దిష్ట బాధ్యతలను విధిస్తుంది.

సమాచార సాంకేతిక (మధ్యవర్తుల మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నీతి నియమావళి) నిబంధనలలోని నియమం 3(1)(బీ) ప్రకారం మధ్యవర్తులు తమంతట తాముగా తగిన జాగ్రత్తలు, ప్రయత్నాలు చేయాలి. ఏదైనా పేటెంట్, ట్రేడ్‌మార్క్, కాపీరైట్ లేదా ఇతర యాజమాన్య హక్కులను ఉల్లంఘించే ఎటువంటి సమాచారాన్ని అయినా సరే... కలిగి ఉండటానికి, ప్రదర్శించడానికి, అప్‌లోడ్ చేయడానికి, సవరించడానికి, ప్రచురించడానికి, ప్రసారం చేయడానికి, నిల్వ చేయడానికి, అప్‌డేట్ చేయడానికి లేదా షేర్‌ చేయడానికి అనుమతి ఉండదు.

 

ఈ సమాచారాన్ని సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ నేడు రాజ్యసభలో శ్రీ పరిమల్ నత్వానీ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా వెల్లడించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2246482) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी