సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
టీవీ రేటింగ్ పాలసీ (టీఆర్పీ) 2026ను ప్రకటించిన ప్రభుత్వం
దేశంలో టీవీ ప్రేక్షకుల గణన ప్రక్రియలో
పారదర్శకత, జవాబుదారీతనం, విశ్వసనీయతను బలోపేతం చేయడం లక్ష్యం
ఈ విధానంలో రేటింగ్ గణన నుంచి ల్యాండింగ్ పేజీ వీక్షణల మినహాయింపు.. వీటి వినియోగం కేవలం మార్కెటింగ్ సాధనంగా మాత్రమే పరిమితం
కొత్త నిబంధనలు ప్రకారం పారదర్శక విధానాల వెల్లడి తప్పనిసరి.. డీపీడీపీ చట్టానికి అనుగుణంగా డేటా రక్షణను అమలు చేయాలని ఆదేశం
రెండు అంచెల ఆడిట్ వ్యవస్థ తప్పనిసరి.. నమూనా పరిమాణం పెంచడం ద్వారా మరింత ఖచ్చితమైన ఫలితాలను సాధించడం లక్ష్యం.
టీవీ రేటింగ్ సంస్థల ఏర్పాటు కోసం ఆర్థిక నిబంధనలను సడలించిన ప్రభుత్వం.. అర్హత ప్రమాణాలను రూ. 20 కోట్ల నుంచి రూ. 5 కోట్లకు తగ్గింపు
నాడు పోస్టు చేయడమైనది:
27 MAR 2026 6:37PM by PIB Hyderabad
దేశంలో టెలివిజన్ రేటింగ్‌లను నియంత్రించడానికి సమగ్రమైన మార్గదర్శకాలతో కూడిన ‘‘టీవీ రేటింగ్ పాలసీ 2026’’ను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నేడు విడుదల చేసింది. టెలివిజన్ ప్రేక్షకుల గణన ప్రక్రియలో పారదర్శకత, స్వతంత్రత, జవాబుదారీతనాన్ని నిర్ధారించే లక్ష్యంతో.. టీవీ రేటింగ్ సేవలను అందించే సంస్థల నమోదు, నిర్వహణ, ఆడిట్, పర్యవేక్షణకు సంబంధించి ఈ విధానం స్పష్టమైన ప్రమాణాలను నిర్దేశిస్తుంది.
విధానంలోని ముఖ్యాంశాలు
· ప్రవేశ నిబంధనల సరళీకరణ: టీవీ రేటింగ్ సంస్థగా నమోదు చేసుకోవాలనుకునే కంపెనీకి అవసరమైన నికర ఆస్తి విలువను భారీగా తగ్గించారు. ప్రస్తుతమున్న రూ. 20 కోట్ల నుంచి రూ. 5 కోట్లకు తగ్గించారు.
· సంఘర్షణ నివారణపై కఠిన చర్యలు: నిష్పక్షపాతాన్ని నిర్ధారించడానికి డైరెక్టర్ల బోర్డులో కనీసం 50 శాతం మంది బ్రాడ్‌కాస్టర్లు, ప్రకటనదారులు లేదా ప్రకటనల సంస్థలతో ఎలాంటి సంబంధాలు లేని స్వతంత్ర డైరెక్టర్లు ఉండాలి. అంతేకాకుండా సంఘర్షణకు దారితీసే కన్సల్టెన్సీ పాత్రలను ఏజెన్సీలు చేపట్టకూడదు.
· పెరిగిన నమూనా పరిమాణం, ప్రాతినిధ్య డేటా: డేటా కచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి, ఏజెన్సీలు తమ కార్యకలాపాలను 18 నెలల్లోగా (ప్రస్తుత ఏజెన్సీలకు 6 నెలలు) 80,000 మీటర్డ్ గృహాలకు విస్తరించాలి. ఇది క్రమంగా 1,20,000 గృహాలకు చేరుకోవాలి. కేబుల్, డీటీహెచ్, ఓటీటీ, కనెక్టెడ్ టీవీల వంటి అన్ని సాంకేతిక పరిజ్ఞానాల నుంచి డేటాను సేకరించాలి. మీటర్డ్ గృహాలలోని అన్ని టీవీ వీక్షణ స్క్రీన్‌ల నుంచి డేటాను సేకరించాలి.
· పారదర్శకత, గోప్యత: సంస్థలు తమ వివరణాత్మక కార్యాచరణ విధానాన్ని, వ్యక్తిగత వివరాలు దాచిన డేటాను తమ వెబ్‌సైట్‌లలో ప్రచురించాలి. వీక్షకుల గోప్యతను కాపాడటానికి అన్ని కార్యకలాపాలు తప్పనిసరిగా డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం 2023కు లోబడి ఉండాలి.
· జవాబుదారీతనం, ఆడిట్లు: త్రైమాసిక అంతర్గత ఆడిట్లు, వార్షిక స్వతంత్ర బాహ్య ఆడిట్లతో కూడిన ద్వంద్వ-ఆడిట్ వ్యవస్థ ఇప్పుడు తప్పనిసరి. కాలానుగుణంగా క్షేత్రస్థాయి తనిఖీల కోసం మంత్రిత్వ శాఖ ఒక ఆడిట్, పర్యవేక్షణ బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది.
· ఫిర్యాదుల పరిష్కారం: ఏజెన్సీలు 10 రోజులలోపు ఫిర్యాదులను పరిష్కరించడానికి ఒక నోడల్ అధికారిని నియమించాలి. ఒకవేళ అక్కడ పరిష్కారం లభించకపోతే ఆ వివాదాలను పరిష్కరించడానికి ఒక అప్పీలు అధికారిని కూడా ఏర్పాటు చేయాలి.
· ల్యాండింగ్ పేజీ మినహాయింపులు, వెల్లడి నిబంధనలు: ల్యాండింగ్ పేజీ ద్వారా వచ్చే ఎటువంటి వీక్షణలనైనా రేటింగ్ గణనలో లెక్కించకూడదు. అయితే ల్యాండింగ్ పేజీని కేవలం ఒక మార్కెటింగ్ సాధనంగా మాత్రమే వాడుకోవచ్చు. ప్రసారకర్తలు తమ ఛానల్ ఏదైనా ల్యాండింగ్ పేజీలో అందుబాటులో ఉంటే ఆ విషయాన్ని రేటింగ్ సంస్థకు ఖచ్చితంగా వెల్లడించాలి.
· అనుసరణ, జరిమానాలు: నిబంధనలను పాటించని పక్షంలో రేటింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేయడం నుంచి.. పదేపదే ఉల్లంఘిస్తే రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడం వరకు వివిధ స్థాయిల జరిమానాలు ఉంటాయి.
· వీక్షణ డేటాను ప్రచురించే వేదికలకు అనుమతి: టీవీ పంపిణీ వేదికలు లేదా ఓటీటీ వేదికలు తమ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారమయ్యే ఛానళ్ల కాలానుగుణ వీక్షణ డేటాను తమ వెబ్‌సైట్‌లలో ప్రచురించవచ్చు. దీని కోసం ఈ మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ లేదా అనుమతి పొందాల్సిన అవసరం లేదు.
· ఈ చర్యల ద్వారా భాగస్వాములను, ప్రజా ప్రయోజనాలను పరిరక్షించే ఒక నిష్పక్షపాతమైన, పోటీతత్వంతో కూడిన, సుపరిపాలన గల ప్రసార వాతావరణానికి భారత ప్రభుత్వం తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.
గతంలో 16 జనవరి 2014న జారీ చేసిన పాత మార్గదర్శకాల స్థానంలో ఈ కొత్త టీవీ రేటింగ్ పాలసీ 2026 అమలులోకి వస్తుంది. పూర్తి పాలసీ పత్రం మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.
***
(రిలీజ్ ఐడి: 2246478)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6