కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా గిరిజన ఉత్పత్తుల ఈ-కామర్స్‌ను ప్రోత్సహించడానికి ట్రైఫెడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న తపాలా శాఖ
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో గిరిజనులను భాగం చేసి వారి జీవనోపాధిని ప్రోత్సహించాలనే
ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తున్న ఎంవోయూ
దేశవ్యాప్తంగా గిరిజన ఉత్పత్తుల సేకరణ, రవాణా, పంపిణీ సజావుగా జరిగేలా చూస్తున్న పోస్టల్ విభాగం
నాడు పోస్టు చేయడమైనది:
25 MAR 2026 6:37PM by PIB Hyderabad
గిరిజన చేతివృత్తుల వారికి సాధికారత కల్పించేందుకు, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ట్రైబల్ కోపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ట్రైఫెడ్)తో కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖలోని పోస్టల్ విభాగం (డీవోపీ) ఒప్పందం కుదుర్చుకుంది.
ట్రైబ్స్ ఇండియా ఈ-మార్కెట్‌ప్లేస్‌తో సహా ట్రైఫెడ్ ఈ-కామర్స్ వేదిక ద్వారా గిరిజన ఉత్పత్తులను పంపిణీ చేయడానికి విస్తృతమైన, విశ్వసనీయమైన, తక్కువ ఖర్చుతో కూడిన రవాణా విధానాన్ని రూపొందించడమే ఈ భాగస్వామ్య లక్ష్యం.
ఈ ఎంవోయూ ప్రకారం... ట్రైఫెడ్ ఆన్‌లైన్ వేదికలకు వచ్చే గిరిజన ఉత్పత్తులను తపాలా విభాగం వినియోగదారులకు చేరవేస్తుంది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న, చిట్టచివరి వ్యక్తి వరకు చేరుకోగల తన వ్యవస్థను ఉపయోగించుకుంటూ.. దేశవ్యాప్తంగా వినియోగదారులకు గిరిజన ఉత్పత్తుల పికప్, రవాణా, పంపిణీ జరిగేలా చూస్తుంది.
సమర్థమైన ఆర్డర్ల డెలివరీ, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం ద్వారా గిరిజన చేతివృత్తుల వారికి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మార్కెట్ అవకాశాలను బలోపేతం చేసేలా ఈ ఒప్పందాన్ని రూపొందించారు. షిప్మెంట్ ట్రాకింగు వివరాలను, క్రమం తప్పకుండా ఎంఐఎస్ నివేదికను తపాలా విభాగం అందిస్తుంది. అలాగే ట్రైఫెడ్ డిజిటల్ వేదికతో ఏపీఐను ఏకీకృతం చేయడం ద్వారా ఆర్డర్ల ప్రాసెసింగ్, రవాణా సజావుగా సాగేలా చూస్తుంది.
ఈ ఒప్పందంలో భాగంగా నేషనల్ అకౌంట్ ఫెసిలిటీ పరిధిలో ట్రైఫెడ్‌కు బుక్ నౌ పే లేటర్ (బీఎన్‌పీఎల్) ఖాతాను సిద్ధం చేస్తారు. ఇది స్పీడ్ పోస్ట్ ద్వారా రవాణా చేయడానికి వీలుగా బుకింగులను, చెల్లింపు ప్రక్రియలను క్రమబద్ధీకరిస్తుంది.
సరైన ప్యాకేజింగ్, లేబులింగ్, ఆర్డరుకు సంబంధించిన సమాచారాన్ని అందించి రవాణా కార్యకలాపాలను సమర్థంగా సాగేలా ట్రైఫెడ్ తన వంతు పాత్రను పోషిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న బహుళ ప్రాంతీయ కార్యాలయాల నుంచి పికప్ చేసుకొని, అన్ని ప్రాంతాలకు చేరుకొనేలా సమర్థవంతమైన కార్యాచరణకు హామీ ఇస్తుంది.
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో గిరిజనులను భాగం చేసి వారి జీవనోపాధిని ప్రోత్సహించడంలో ప్రభుత్వం నిబద్ధతను ఈ భాగస్వామ్యం ప్రతిబింబిస్తుంది. ట్రైబల్ ఈ-కామర్స్‌కు తోడ్పాటును, రవాణా సహకారాన్ని బలోపేతం చేస్తూ.. గిరిజనుల ఆదాయ అవకాశాలను ఈ కార్యక్రమం పెంపొందిస్తుందని, అసలుసిసలు గిరిజన ఉత్పత్తులు మరింతగా అందుబాటులోకి వస్తాయని, సమగ్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని అంచనా వేస్తున్నారు.
తొలుత రెండేళ్ల కాల వ్యవధికి ఈ ఒప్పందం చెల్లుబాటవుతుంది. కాలానుగుణంగా దీనిని సమీక్షించి పరస్పర అంగీకారం మేరకు పొడిగిస్తారు.

***
(రిలీజ్ ఐడి: 2245659)
సందర్శకుల సూచీ సంఖ్య : : 52