గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కీలక ఖనిజాల అన్వేషణను వేగవంతం చేయాలని నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్, డెవలప్మెంట్ ట్రస్ట్ (ఎన్ఎంఈడిటీ) పాలకవర్గ సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి పిలుపు


కీలక ఖనిజాల రంగంలో ఆత్మనిర్భరతపై దృష్టి పెట్టాలని, ఖనిజ అన్వేషణ ప్రాజెక్టులను, అనుమతులను వేగవంతం చేయాలని రాష్ట్రాలను కోరిన శ్రీ కిషన్ రెడ్డి

అత్యాధునిక సాంకేతికతలను అవలంబించడం, స్టార్టప్‌ల భాగస్వామ్యంతో భారత ఖనిజ అన్వేషణ వ్యవస్థలో మార్పు: శ్రీ కిషన్ రెడ్డి

నాడు పోస్టు చేయడమైనది: 25 MAR 2026 6:48PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని నేతాజీ నగర్, జీపీఓఏ-3 లో జరిగిన నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్, డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఎన్ఎంఈడిటీ) 7వ పాలకవర్గ సమావేశానికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి అధ్యక్షత వహించారు. అణు ఇంధన శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో, 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎన్ఎంఈడిటీ  పనితీరును వివరంగా సమీక్షించారు.

 

కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి సమావేశంలో ప్రసంగిస్తూ, కీలక ఖనిజాల అన్వేషణపై ప్రత్యేక వ్యూహాత్మక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఈ రంగంలో ఆత్మనిర్భరత సాధించడం భారత ఆర్థిక వృద్ధికి, ఇంధన మార్పునకు, సాంకేతిక పురోగతికి అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న అన్వేషణ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని, అనుమతులు త్వరగా లభించేలా చూడాలని, సమన్వయాన్ని మెరుగుపరుచుకోవాలని ఆయన రాష్ట్రాలను కోరారు. దీనివల్ల ఖనిజాల అన్వేషణ నుంచి  వేలం వరకు పట్టే సమయం గణనీయంగా తగ్గుతుందని ఆయన తెలిపారు.

ఖనిజాల అన్వేషణలో సామర్థ్యాన్ని, విజయవంతమయ్యే అవకాశాలను పెంచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/మెషిన్ లెర్నింగ్, డ్రోన్ ఆధారిత సర్వేలు, ఆధునిక ఖనిజ శుద్ధి (బెనిఫిషియేషన్) సాంకేతికతలను అవలంబించాల్సిన అవసరం ఉందని ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు. స్టార్టప్ ఇండియా దార్శనికతకు అనుగుణంగా, అన్వేషణ వ్యవస్థలోకి కొత్త ఆలోచనలను, అత్యాధునిక పరిష్కారాలను తీసుకురావడానికి స్టార్టప్‌లు, ప్రైవేట్ అన్వేషణ సంస్థలు, ఆవిష్కరణల ఆధారిత సంస్థల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచాలని మంత్రి కోరారు.

అణు ఇంధన శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, అన్వేషణ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి బలమైన సమన్వయం, నిరంతర పర్యవేక్షణ, సమర్థవంతమైన నిరంతర విధానాల ప్రాముఖ్యతను వివరించారు. ఫలితాలను వేగవంతం చేయడానికి శాస్త్రీయ సంస్థలను ఏకీకృతం చేయాలని, ఖనిజ అన్వేషణ విలువ శ్రేణిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

 

సమావేశంలో చర్చించిన ఎన్ఎంఈడిటీ కీలక విజయాలు 

పరిధి విస్తరణ

గనులు, ఖనిజాల (అభివృద్ధి -  నియంత్రణ) చట్టం, 1957కు 2025లో చేసిన సవరణ ద్వారా ప్రవేశపెట్టిన సంస్కరణల్లో భాగంగా, నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్ (ఎన్ఎంఈటీ) పేరును 2025 సెప్టెంబర్ 1 నుంచి  అమలులోకి వచ్చేలా నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఎన్ఎంఈడీటీ) గా మార్చారు. అన్వేషణ కార్యకలాపాలకు ఆర్థిక చేయూతను బలోపేతం చేయడానికి, లీజుదారులు చెల్లించే వాటాను రాయల్టీలో 2% నుంచి 3%కి పెంచారు.

భారతదేశంలోని సముద్ర తీర ప్రాంతాలలో  ఖనిజ అన్వేషణకు నిధులు సమకూర్చడం, అలాగే భారతదేశం లోపల, వెలుపల అన్వేషణ కార్యకలాపాలు,  గనుల అభివృద్ధిని కూడా చేర్చడం ద్వారా ఎన్ఎంఈడీటీ పరిధిని విస్తరించారు.

నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (ఎన్సీఎంఎం) కింద నిధుల కేటాయింపు కార్యక్రమాలు.

గనుల పైపొర వ్యర్థాలు (ఓవర్‌బర్డెన్), ఖనిజ వ్యర్థాలు (టెయిలింగ్స్),  బూడిద (ఫ్లై యాష్),  ఎర్రటి బురద (రెడ్ మడ్) మొదలైన వాటి నుంచి  కీలక ఖనిజాలను వెలికితీసే పైలట్ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడం కోసం ఎన్ఎంఈడీటీ 14.11.2025న మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ పథకం కింద ఒక్కో ప్రాజెక్టుకు రూ.20 కోట్ల వరకు నిధుల మద్దతు లభిస్తుంది, ఇందులో పరిశ్రమ భాగస్వాములు కనీసం 10% వాటాను అందించాల్సి ఉంటుంది.

వివిధ రకాల ముడి పదార్థాల (ఫీడ్‌స్టాక్‌) నుంచి అరుదైన భూమి ఖనిజాలను  వేరు చేయడానికి పైలట్ లైన్‌ ఏర్పాటుకు గాను, నాన్-ఫెర్రస్ మెటీరియల్స్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్ (ఎన్ఎఫ్టీడీసీ) కి ఒక పైలట్ ప్రాజెక్ట్ మంజూరుచేశారు. .

సుస్థిరమైన మైనింగ్, వనరుల సామర్థ్య కార్యక్రమాలు

గని ముఖభాగాలు, , కుప్పలు, వ్యర్థాలు, అవశేషాలు, స్లాగ్ నుంచి  సేకరించిన నమూనాల భూరసాయన విశ్లేషణ ద్వారా కీలక ఖనిజాలను గుర్తించడానికి ఎన్ఎంఈడీటీ ప్రత్యేక అధ్యయనాలకు మద్దతు ఇస్తోంది. వీటి నుంచి ఖనిజాలను తిరిగి పొందే సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం)కు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. 

నేషనల్ టెయిలింగ్స్ పాలసీ, 2025కి అనుగుణంగా ఉన్న ఈ కార్యక్రమాలు ఖనిజాల విషయంలో స్థిరత్వం, వనరుల సామర్థ్యం,  చక్రభ్రమణ వినియోగాన్ని ప్రోత్సహిస్తాయి.

ఖనిజ అన్వేషణలో సాంకేతికత ఆధునీకరణ

డేటా కచ్చితత్వాన్ని, ఖనిజ ఆవిష్కరణల విజయవంతం అయ్యే రేటును మెరుగుపరచడానికి డ్రోన్ ఆధారిత సర్వేలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/మెషిన్ లెర్నింగ్, అనువర్తనాలు ఆధునిక ఖనిజ శుద్ధి పద్ధతుల వంటి అత్యాధునిక అన్వేషణ సాంకేతికతలను ఎన్ఎంఈడీటీ ప్రోత్సహిస్తోంది. దీని ద్వారా భారత ఖనిజ అన్వేషణ వ్యవస్థను ఆధునీకరిస్తోంది.

ఖనిజ అన్వేషణకు మరింతగా ఆర్థిక మద్దతు

2025–26 ఆర్థిక సంవత్సరంలో కీలక ఖనిజాల అన్వేషణ కోసం మొత్తం 76 ప్రాజెక్టులు మంజూరు చేశారు. ఎన్ఎంఈడీటీ నిధులతో చేపట్టిన 45 బ్లాకులను ఇప్పటివరకు వేలం వేశారు, వీటిలో 10 కీలక ఖనిజాల బ్లాకులు ఉన్నాయి. పలు సానుకూల కార్యక్రమాల ద్వారా ప్రైవేట్ రంగ భాగస్వామ్యంలో కూడా గణనీయమైన వృద్ధి నమోదైంది.

ఈ సంస్కరణలన్నీ సమష్టిగా భారత ఖనిజ అన్వేషణ వ్యవస్థ బలోపేతం, కీలక ఖనిజాల లభ్యత, ప్రాజెక్టుల అమలు వేగవంతం,  ప్రైవేట్, స్టార్టప్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, ఆధునిక సాంకేతికతలను అవలంబించడం, దేశంలో స్థిరమైన ఖనిజ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. 

 

***


(రిలీజ్ ఐడి: 2245463) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी