గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
గ్రామీణ మహిళలకు కొత్త అవకాశాలను, సాధికారతను కల్పించే ‘నమో డ్రోన్ దీదీ’ పథకం
నాడు పోస్టు చేయడమైనది:
24 MAR 2026 6:35PM by PIB Hyderabad
వ్యవసాయ అవసరాల కోసం (ఎరువులు, పురుగు మందుల వినియోగం) రైతులకు అద్దె సేవలను అందించడానికి ఎంపిక చేసిన మహిళా స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీలు) డ్రోన్‌లను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘నమో డ్రోన్ దీదీ’ పథకాన్ని కేంద్ర రంగ పథకంగా ఆమోదించింది. దీని కోసం 2023-24 నుంచి 2025-26 కాలానికి రూ. 1261 కోట్ల వ్యయాన్ని కేటాయించింది. డ్రోన్‌ల కొనుగోలు కోసం మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్, దాని అనుబంధ పరికరాల ఖర్చులో 80 శాతం (గరిష్టంగా రూ. 8 లక్షల వరకు) కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుంది. డ్రోన్ కొనుగోలుకు అయ్యే మిగిలిన మొత్తాన్ని (సబ్సిడీని తగ్గించిన తర్వాత మిగిలిన కొనుగోలు వ్యయం) క్లస్టర్ స్థాయి సమాఖ్యలు (సీఎల్‌ఎఫ్‌లు), జాతీయ వ్యవసాయ మౌలిక సదుపాయాల ఫైనాన్సింగ్ సౌకర్యం కింద 3 శాతం వడ్డీ రాయితీతో రుణం పొందవచ్చు.
నమో డ్రోన్ దీదీ పథకం కింద ద్రవరూప ఎరువులు, పురుగుమందులను పిచికారీ చేయడానికి అవసరమైన స్ప్రే అసెంబ్లీతో కూడిన ప్రాథమిక డ్రోన్‌ను ఒక ప్యాకేజీగా సరఫరా చేస్తారు. ఈ ప్యాకేజీలో అదనంగా 4 స్పేర్ బ్యాటరీ సెట్లు, ఒక స్పేర్ ప్రొపెల్లర్ సెట్, నాజిల్ సెట్, డ్యూయల్ ఛానల్ ఫాస్ట్ బ్యాటరీ ఛార్జర్, బ్యాటరీ ఛార్జర్ హబ్, డ్రోన్ పైలట్‌కు 15 రోజుల శిక్షణ, డ్రోన్ అసిస్టెంట్ శిక్షణ, ఒక సంవత్సరం సమగ్ర బీమా, 2 సంవత్సరాల వార్షిక నిర్వహణ ఒప్పందం, వర్తించే జీఎస్టీ ఉన్నాయి. ఈ 15 రోజుల డ్రోన్ పైలట్ శిక్షణా కార్యక్రమంలో డ్రోన్ పైలట్ లైసెన్సు పొందడానికి తప్పనిసరి శిక్షణ, ఎగిరేందుకు సిద్ధం చేయడం, చిన్నపాటి మరమ్మతులు, నిర్వహణ, అలాగే పురుగుమందులు, ద్రవ ఎరువులను పిచికారీ చేయడానికి డ్రోన్‌లను నడపడంలో ప్రత్యక్ష శిక్షణ ఉంటాయి.
ఎరువుల శాఖ అందించిన సమాచారం ప్రకారం 2023-24లో ప్రముఖ మందుల సంస్థలు నమో డ్రోన్ దీదీ పథకం కింద స్వయం సహాయక బృందాల డ్రోన్ దీదీలకు 500 డ్రోన్‌లను పంపిణీ చేశాయి. ఈ డ్రోన్ దీదీలందరికీ డీజీసీఏచే గుర్తింపు పొందిన రిమోట్ పైలట్ సంస్థల వద్ద శిక్షణ అందించారు. రాష్ట్రాల వారీగా వివరాలు కింది అనుబంధంలో ఉన్నాయి.
నమో డ్రోన్ దీదీ పథకం కింద ప్రధాన ఎరువుల సంస్థలు అందించిన ఈ 500 డ్రోన్లపై, బెంగళూరులోని వ్యవసాయ అభివృద్ధి, గ్రామీణ పరివర్తన కేంద్రం (ఏడీఆర్‌టీసీ) డ్రోన్ కార్యకలాపాల ఆర్థిక, వ్యాపార సాధ్యాసాధ్యాలపై ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ అధ్యయనం ప్రకారం గతంలో స్వయం సహాయక బృందాలు ప్రధానంగా వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలలో నిమగ్నమై ఉండేవి. అయితే వారికి అందించిన డ్రోన్ల రాకతో డ్రోన్ సాంకేతిక వంటి ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో భాగస్వామ్యం అయ్యే అవకాశాలు పెరిగాయి. డ్రోన్ల వాడకం వల్ల వారి పనితీరు, ఉత్పాదకత పెరిగింది. మొత్తమ్మీద ఈ డ్రోన్ల వాడకం వల్ల స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలు వైవిధ్యభరితంగా మారాయి. ఇది వ్యవసాయ పద్ధతులను మెరుగుపరచడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఆదాయ అవకాశాలను పెంచినట్లు ఈ అధ్యయనం వెల్లడించింది.
ఎల్‌ఎఫ్‌సీల ద్వారా డ్రోన్‌లు అందించిన స్వయం సహాయక సంఘాల రాష్ట్రాల వారీ వివరాలు కింది విధంగా ఉన్నాయి.
ఈ సమాచారాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని నేడు లోక్‌సభలో లిఖితపూర్వకంగా అందించిన సమాధానం ద్వారా తెలియజేశారు.
***
(రిలీజ్ ఐడి: 2244758)
సందర్శకుల సూచీ సంఖ్య : : 41