గనుల మంత్రిత్వ శాఖ
కీలక, వ్యూహాత్మక ఖనిజాల ఏడో విడత వేలాన్ని ప్రారంభించనున్న గనుల మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
22 MAR 2026 11:49AM by PIB Hyderabad
కీలక, వ్యూహాత్మక ఖనిజ బ్లాకుల ఏడో విడత వేలాన్ని 2026 మార్చి 23న కేంద్ర బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ప్రారంభిస్తారు. సహాయ మంత్రి శ్రీ సతీశ్ చంద్ర దూబేతో కలిసి ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
దేశ ఆర్థికాభివృద్ధికీ, ఖనిజ భద్రతకూ కీలక ఖనిజాలు కీలకమైనవి. ప్రపంచం వేగంగా శుద్ధ ఇంధనం, అధునాతన సాంకేతికతల దిశగా మళ్లుతున్న నేపథ్యంలో.. లిథియం, గ్రాఫైట్, అరుదైన మూలకాలు (ఆర్ఈఈ), టంగ్స్టన్, వెనేడియం, టైటానియం, ఇతర అరుదైన లోహ ఖనిజాలకు డిమాండు విశేషంగా పెరిగింది. అవి పరిమితంగా లభిస్తుండడం, అదీ కొన్ని నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాల్లోనే దొరుకుతుండడంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థకు సవాళ్లు ఎదురవుతున్నాయి.
వాటి వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం.. 2023 ఆగస్టు 17న గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టం - 1957 (ఎంఎండీఆర్ చట్టం)ను సవరించి, 24 ఖనిజాలను కీలక, వ్యూహాత్మక ఖనిజాలుగా ప్రకటించింది. ఈ ఖనిజాల కోసం మైనింగ్ లీజులు, ఉమ్మడి (కాంపోజిట్) లైసెన్సులను వేలం వేసే అధికారాన్ని ఈ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కల్పిస్తుంది. ఈ వేలంపాటల ద్వారా సమకూరే ఆదాయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందుతుంది.
గనుల మంత్రిత్వ శాఖ ఇప్పటి వరకు ఆరు విడతల వేలంపాటలను విజయవంతంగా నిర్వహించింది. ఇందులో భాగంగా ఇప్పటికే 46 కీలక, వ్యూహాత్మక ఖనిజ బ్లాకులను వేలం వేసింది. బలమైన పారిశ్రామిక భాగస్వామ్యానికీ, దేశ ఖనిజ రంగంపై పెరుగుతున్న విశ్వాసానికీ ఇది నిదర్శనం.
ఇదే వేగాన్ని కొనసాగిస్తూ ఏడో విడతలో మైనింగ్ లీజు, ఉమ్మడి లైసెన్సుల కింద పలు రాష్ట్రాల్లోని 19 బ్లాకులను మంత్రిత్వ శాఖ వేలం వేయబోతోంది. శుద్ధ ఇంధనం, అధునాతన సాంకేతికతలు, ఎరువులు, వ్యూహాత్మక పరిశ్రమల వంటి రంగాలకు అవసరమైన వివిధ ఖనిజ నిక్షేపాలు ఈ బ్లాకుల్లో ఉన్నాయి.
పారదర్శకత, సమర్థత, ఖనిజ బ్లాకుల్లో కార్యకలాపాలు వేగంగా సాగడం కోసం వేలం విధానాన్ని విశేషంగా బలోపేతం చేసింది. పనితీరు హామీల సమర్పణ, ముందస్తు చెల్లింపు, ఆసక్తి వ్యక్తీకరణ లేఖల జారీ వంటి వేలం అనంతర కాలపరిమితులను... ఖనిజాల (వేలం) రెండో సవరణ నియమాలు- 2025 సహా ఇటీవలి సంస్కరణలు క్రమబద్ధీకరించాయి. అంతేకాకుండా ఖనిజాల (వేలం) సవరణ నియమాలు- 2026 బ్యాంకు గ్యారెంటీలకు ప్రత్యామ్నాయంగా బీమా హామీ బాండ్ సదుపాయాన్ని ప్రవేశపెట్టాయి. దీంతో వేలందార్లకు మరింత సౌలభ్యం లభిస్తుంది.
ఆరోహణలో వెలను పెంచుతూ సాగే (అసెండింగ్ ఫార్వర్డ్ ఆక్షన్) పారదర్శకమైన, రెండు దశల ప్రక్రియ ద్వారా.. వేలాన్ని నిర్వహిస్తారు. దీనిప్రకారం గని నుంచి తరలించిన ఖనిజం విలువపై అత్యధిక శాతాన్ని ప్రతిపాదించిన వారిని వేలంలో విజేతగా నిర్ణయిస్తారు.
***
(రిలీజ్ ఐడి: 2243578)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13