ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆదాయపు పన్ను చట్టం-2025పై ఆదాయపు పన్ను శాఖ నిర్వహించే దేశవ్యాప్త అవగాహనా కార్యక్రమం ప్రారంభ్-2026ను ప్రారంభించిన కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
వినియోగదారులకు సులభతరమైన ఆదాయపు పన్ను వెబ్‌సైట్ 2.0ను
ఆవిష్కరించిన కేంద్ర ఆర్థిక మంత్రి
సానుభూతి, సాంకేతికత, విశ్వసనీయత ప్రాతిపదికన సాగే పన్ను పరిపాలనకు పిలుపునిచ్చిన ఆర్థిక మంత్రి శ్రీమతి సీతారామన్..
కొత్త పన్ను చట్టంలో స్థిరత్వం, సౌలభ్యం ఉండాలని, కొన్ని మార్పులు అవసరమని వ్యాఖ్య
ప్రారంభ్-2026 అవగాహనా కార్యక్రమంలో సామర్థ్య పెంపుదల, దేశవ్యాప్త కార్యశాలల ప్రాధాన్యతను వివరించిన రెవెన్యూ కార్యదర్శి
నాగరిక్ దేవో భవ స్ఫూర్తితో పౌర కేంద్రీకృత సేవలందించాలన్న సీబీడీటీ ఛైర్మన్
విస్తృత ప్రచారం, అవగాహనకు ఇంగ్లీష్, హిందీతో పాటు 10 ప్రాంతీయ భాషల్లో
వివరణాత్మక సమాచారంతో కరపత్రాల విడుదల
పన్ను చెల్లింపుదారుల అవగాహనకు వీడియోలు, కరపత్రాలు, మైగవ్‌తో మమేకమయ్యే కార్యక్రమాలతో కూడిన మార్గదర్శకాలను విడుదల చేసిన సీబీడీటీ
కొత్త చట్టం, నిబంధనలు, ఫారాలకు సంబంధించి పన్ను చెల్లింపుదారులకు
సాయం చేసేందుకు ఏఐ ఆధారిత చాట్‌బాట్ కర్ సాథీ ప్రారంభం
దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులకు సేవలందించేందుకు బహుభాషా సమాచార వ్యవస్థ,
డిజిటల్ సాధనాలు, ఆదాయపు పన్ను సేవా కేంద్రాలు
ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్న నూతన ఆదాయపు పన్ను చట్టం-2025
నాడు పోస్టు చేయడమైనది:
20 MAR 2026 9:21PM by PIB Hyderabad
ఆదాయపు పన్ను చట్టం-2025పై ఆదాయపు పన్ను శాఖ చేపట్టిన దేశవ్యాప్త అవగాహనా కార్యక్రమం ప్రారంభ్-2026ను ఇవాళ న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్న నూతన చట్టంలోని కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రింట్, రేడియో, టెలివిజన్, అవుట్‌డోర్, డిజిటల్, సోషల్ మీడియా వంటి పలు మాధ్యమాలకు అనుగుణంగా ఈ వినూత్న కార్యక్రమాన్ని రూపొందించారు.
ఈ ప్రచారంలో భాగంగా సృజనాత్మక ప్రచార కార్యక్రమాలు, పన్ను చెల్లింపుదారులకు మార్గదర్శకాలను, శిక్షణ వీడియోలు, కరపత్రాల వంటి సహాయక సామాగ్రిని రూపొందించారు. వీటితో పాటు డిజిటల్, ప్రత్యక్ష వేదికల ద్వారా ప్రజలతో మమేకమవటమే కాక.. మైగవ్ క్విజ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఆదాయపు పన్ను శాఖ చేపడుతున్న డిజిటల్ పరివర్తనలో భాగంగా ఆదాయపు పన్ను వెబ్‌సైట్ 2.0ను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రారంభించారు. పన్ను చెల్లింపుదారులకు సులభతరమైన వినియోగం, మెరుగైన పద్ధతిని చూపటం, వేగంగా సేవలను అందించాలన్న లక్ష్యంతో ఈ అధునాతన వెబ్‌సైట్‌ను రూపొందించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రెవెన్యూ విభాగం కార్యదర్శి శ్రీ అరవింద్ శ్రీవాస్తవ, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఛైర్మన్ శ్రీ రవి అగర్వాల్, కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు, కస్టమ్స్ (సీబీఐసీ) ఛైర్మన్ శ్రీ వివేక్ చతుర్వేది పాల్గొన్నారు. వీరితో పాటు సీబీడీటీ, సీబీఐసీ బోర్డు సభ్యులు, ఆయా విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం సందర్భంగా శ్రీమతి సీతారామన్ ప్రసంగిస్తూ.. పార్లమెంటులో ఆదాయపు పన్ను చట్టం-1961 ఆమోదం పొందిన తీరుని గుర్తు చేశారు. ఆ ఏడాదిలో రెవెన్యూ విభాగంలోని అధికారుల అసాధారణ కృషిని కొనియాడారు.
ఆదాయపు పన్ను విధానాన్ని సరళీకరించటంపై సీబీడీటీ ప్రత్యేక దృష్టి సారించిందని.. ప్రారంభ్ వంటి కార్యక్రమాల ద్వారా పన్ను చెల్లింపుదారుల సేవలకు ప్రాధాన్యతనిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా ప్రత్యక్ష, పరోక్ష పన్ను వ్యవస్థలను ఏకకాలంలో ప్రక్షాళన చేయటం.. పౌర-కేంద్రీకృత, ప్రజలకు చేరువయ్యే పాలనా తీరులోని మార్పులకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్నో ప్రయత్నాలు, విస్తృత సంప్రదింపుల అనంతరం రూపొందించిన ఈ నూతన చట్టం.. పాత నిబంధనలను మరింత స్పష్టంగా పునర్నిర్మించిందని శ్రీమతి సీతారామన్ చెప్పారు. వివాదాలను తగ్గించటం, నిబంధనలను పాటించేలా చేయటం, గందరగోళం, ఎగవేత ధోరణి నుంచి అంగీకారం, విశ్వసనీయత దిశగా ప్రజలను మళ్లించటం ఈ నూతన చట్టం ముఖ్య ఉద్దేశమని వివరించారు.
చట్టం ఎంత ముఖ్యమో, దాన్ని సమర్థవంతంగా అమలు చేయటం కూడా అంతే ముఖ్యమని కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. పన్ను చెల్లింపుదారుల దృష్టిలో పన్ను వసూలు చేసే అధికారులు, ప్రభుత్వానికి ప్రతినిధులుగా ఉంటారని.. అందువల్ల వారు సానుభూతి, నమ్మకమైన దృక్పథాన్ని అలవర్చుకోవాలని ఆమె సూచించారు. సాంకేతికతను వినియోగించుకోవటం ద్వారా అధికారుల ప్రత్యక్ష జోక్యాన్ని తగ్గించాలని, మానవీయ కోణంలో వ్యవహరించాలని పేర్కొన్నారు.
పలు భాషల ద్వారా ప్రజలకు ఆదాయపు పన్ను శాఖ చేరువవటం, డిజిటల్ వేదికలను సమర్థవంతంగా వినియోగిస్తూ సరళమైన భాషలో సమాచారాన్ని అందించటాన్ని శ్రీమతి సీతారామన్ అభినందించారు. నిపుణులతో యువత మరింతగా మమేకం కావాల్సిన అవసరాన్ని ఆమె స్పష్టం చేశారు. ఏఐ ఆధారిత పరిష్కారాలకు వివిధ సంస్థలతో కలిసి పనిచేయాలని సూచించారు.
న్యూఢిల్లీలో జరిగిన ఏఐ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదించిన మానవ్ (ఎం.ఏ.ఎన్.ఏ.వీ.) దార్శనికతను ప్రస్తావిస్తూ.. ఈ పథకం ద్వారా డిజిటల్ యుగంలో సాంకేతికతను మానవ కేంద్రీకృతంగా తీర్చిదిద్దటమే లక్ష్యమని పేర్కొన్నారు.
ఎం: నైతిక, ధర్మబద్ధమైన వ్యవస్థలు
ఏ: జవాబుదారీతనంతో కూడిన పాలన
ఎన్: జాతీయ సార్వభౌమాధికారం
ఏ: అందరికీ అందుబాటులో ఉండే, సమ్మిళిత ఏఐ
వీ: చెల్లుబాటయ్యే, చట్టబద్ధమైన వ్యవస్థలు
ప్రధానమంత్రి దార్శనికతను ప్రస్తావిస్తూ.. ఆదాయపు పన్ను చట్టం-2025 తప్పనిసరిగా నైతిక, ధర్మబద్ధమైన విలువలతో ఉండాలని శ్రీమతి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
గతంలోలాగ చట్టాలకు మితిమీరిన సవరణలు చేసే ధోరణి పునరావృతం కాకూడదని హెచ్చరిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రసంగాన్ని ముగించారు. నూతన చట్టం స్థిరంగా, సరళంగా, సులభంగా అర్థమయ్యేలా ఉంటుందని.. సాంకేతికతను మానవీయ కోణంలో వినియోగించుకుంటూ, పన్ను చెల్లింపుదారులు నిబంధనలను పాటించటమే సహజమైన ఎంపికగా భావించే వ్యవస్థను ఏర్పాటు చేయటమే అంతిమ లక్ష్యమని తెలిపారు. ఈ వ్యవస్థ సులభతరంగా, స్పష్టంగా, విశ్వసనీయంగా ఉండాలని పేర్కొన్నారు.
రెవెన్యూ కార్యదర్శి శ్రీ అరవింద్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ఆదాయపు పన్ను చట్టం-2025 కేవలం ఒక చట్టం మాత్రమే కాదని.. పన్ను వ్యవస్థను మరింత సరళంగా, స్పష్టంగా, వినియోగదారులకు అనుకూలంగా మార్చే దిశగా కీలక ముందడుగని తెలిపారు. నిబంధనలు, ఫారాలను సరళీకరించటమే కాక, క్షేత్రస్థాయి అమలు ప్రాముఖ్యతను గుర్తిస్తూ.. దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలందించేలా విస్తృతమైన శిక్షణ కల్పించటంపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి సారించిందని ఆయన వివరించారు.
ప్రజలకు సులభంగా సమాచారాన్ని చేరవేసేందుకు సంబంధిత విభాగం చేస్తున్న విశేష కృషిని శ్రీ శ్రీవాస్తవ ప్రస్తావించారు. ఎఫ్‌ఏక్యూలు, కరపత్రాలు, మార్గదర్శక సూత్రాలు, ప్రాంతీయ భాషా వనరుల ద్వారా సమాచార లభ్యతను పెంచుతున్నామని ఆయన తెలిపారు. మారుతున్న కాలానికనుగుణంగా సమాచార ప్రసార వ్యూహాలు అభివృద్ధి చెందినట్లు చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు అర్థమయ్యే రీతిలో డిజిటల్ వేదికల ద్వారా చిన్న చిన్న వీడియోలను ఉపయోగిస్తూ, నేరుగా అనుసంధానమవుతున్నట్లు ఆయన వివరించారు.
విద్యాపరమైన అంశాల ద్వారా చిన్న వయసు నుంచే విద్యార్థులకు అవగాహన కల్పించటం ముఖ్యమని శ్రీ శ్రీవాస్తవ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 300లకుపైగా కార్యశాలతో నిర్వహించే ఈ అవగాహనా కార్యక్రమం.. కేవలం సమాచారాన్ని అందించటమే కాక, భాగస్వాముల నుంచి అభిప్రాయాలను కూడా సేకరిస్తుందని తెలిపారు. ఈ సంస్కరణ కేవలం ఒక వైపు నుంచి జరిగే సమాచార మార్పిడి మాత్రమే కాదని.. నిరంతరం కొనసాగే ప్రక్రియ అని స్పష్టం చేశారు.
ఈ విస్తృత స్థాయి ప్రచార కార్యక్రమ ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, ప్రారంభ్-2026 కేవలం ఒక ప్రారంభోత్సవం మాత్రమే కాదు.. మరింత పారదర్శకమైన, వేగంగా స్పందించే, సరళీకృత పన్ను వ్యవస్థకు నాంది అని శ్రీ శ్రీవాస్తవ తెలిపారు.
స్వాగత ప్రసంగం సందర్భంగా సీబీడీటీ ఛైర్మన్ శ్రీ రవి అగర్వాల్ మాట్లాడుతూ.. ప్రారంభ్ (వికసిత్ భారత్ మిషన్ కోసం విధాన సంస్కరణలు, బాధ్యతాయుతమైన చర్యలు) నాగరిక్ దేవోభవ స్ఫూర్తితో రూపొందించినట్లు చెప్పారు. భారత పన్ను పరిపాలనా ప్రయాణంలో ఆదాయపు పన్ను చట్టం-2025 కీలక ఘట్టమని.. దీన్ని సులభంగా, పన్ను చెల్లింపుదారులకు అనుకూలమైన పద్ధతిలో అమలు చేయాలని స్పష్టం చేశారు.
దేశవ్యాప్త ప్రచారం, సదుపాయాల కల్పనే లక్ష్యంగా ప్రారంభ్‌ను రూపొందించినట్లు శ్రీ అగర్వాల్ తెలిపారు. బహు భాషల్లో ప్రచారాలు, విద్యా సంబంధిత కంటెంట్, డిజిటల్ సాధనాలు, తరచూ అడిగే ప్రశ్నలు, నిబంధనల అమలును సులభతరం చేసే మార్గదర్శక సూచికల ద్వారా స్పష్టమైన, అందుబాటులో ఉండే, భరోసానిచ్చే సమాచారాన్ని అందించటమే దీని ఉద్దేశమని వెల్లడించారు.
నూతన చట్టం, నిబంధనలు, ఫారాలు, ఇతర సందేహాల కోసం పన్ను చెల్లింపుదారులకు సమాచారాన్ని అందించేందుకు కర్ సాథీ ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ను ఆయన ప్రారంభించారు. ఆదాయపు పన్ను సేవా కేంద్రాల ద్వారా కూడా సహాయం అందుతుందని ఆయన స్పష్టం చేశారు. పౌర-కేంద్రీకృత, సాంకేతిక ఆధారిత, సానుభూతితో కూడిన పన్ను పరిపాలన పట్ల ఆదాయపు పన్ను శాఖకున్న నిబద్ధతకు ఇది నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు.
ప్రారంభ్ కార్యక్రమంలో భాగంగా రూపొందించిన అంశాలు.. కరపత్రాలు, తరచూ అడిగే ప్రశనలు, మైగవ్ క్విజ్ వంటివి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సీబీడీటీ సభ్యులు శ్రీ సంజయ్ బహదూర్ వివరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా భాగస్వాములతో నిర్వహించిన నేపథ్య చర్చలపై సీబీడీటీ (శాసనసభ) సభ్యుడు శ్రీ ప్రసేన్‌జిత్ సింగ్ ఒక నివేదికను సమర్పించారు. అనంతరం ఆ చర్చల్లో పాల్గొన్న పలువురు భాగస్వాముల అభిప్రాయాలను వెల్లడించారు.
సీబీడీటీ సభ్యురాలు (పన్ను చెల్లింపుదారుల సేవలు, ఆదాయం) శ్రీమతి జి. అపర్ణ రావుకి కృతజ్ఞతలు చెబుతూ కార్యక్రమాన్ని ముగించారు.
ఆదాయపు పన్ను చట్టం-2025ను సమర్థవంతంగా అమలు చేయటానికి సన్నద్ధమవుతున్న తరుణంలో.. ఆధునికీకరణ, వాటాదారుల భాగస్వామ్యం, పౌర కేంద్రీకృత పాలన పట్ల ఆదాయపు పన్ను శాఖకున్న నిబద్ధతను ప్రారంభ్-2026 సూచిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2243567)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6