ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా ఉద్యమ పంథా: ‘హెచ్‌ఐవీ’పై జిల్లా స్థాయి ప్రతిస్పందన కార్యక్రమానికి ‘నేకో’ సారథ్యం.. ‘సురక్ష సంకల్ప కార్యశాల’ తదుపరి మజిలీగా హైదరాబాద్

నాడు పోస్టు చేయడమైనది: 21 MAR 2026 7:48PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ‘హెచ్‌ఐవీ’పై జాతీయ స్థాయి ప్రతిస్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయిలో సత్వర చర్యల దిశగా కృషి కొనసాగుతోంది. ఇందులో భాగంగా కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ’ (నేకో) రాష్ట్రాల భాగస్వామ్యంతో ‘సురక్ష సంకల్ప కార్యశాల’ కార్యక్రమ నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. ఈ కార్యక్రమం కింద తదుపరి ‘కార్యశాల’ను ఈ నెల 25న తెలంగాణలోని హైదరాబాద్‌లో నిర్వహిస్తుంది.

‘నేకో’ అదనపు కార్యదర్శి-డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాకేష్ గుప్తా అధ్యక్షతన నిర్వహించే ఈ కార్యశాల  రాష్ట్ర-జిల్లా స్థాయి కార్యక్రమ నిర్వాహకుల నుంచి కీలక భాగస్వాముల దాకా అందర్నీ ఒక వేదికపైకి తెస్తుంది. జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలోని తెలంగాణ మిషన్ డైరెక్టర్-రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ కూడా ఈ కార్యశాలలో పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ‘హెచ్‌ఐవీ’ మహమ్మారి నియంత్రణ కార్యకలాపాల పురోగతిని సమీక్షించడంతోపాటు భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన ప్రక్రియను చేపడతారు. ఇందులో జిల్లా కలెక్టర్లతోపాటు రాష్ట్రంలోని అడిషనల్‌ జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య-ఆరోగ్య అధికారులు, ఎయిడ్స్ నియంత్రణాధికారులు కూడా పాలుపంచుకుంటారు.

‘మిషన్ ఎయిడ్స్ సురక్ష’ అనే బృహత్తర కార్యక్రమం కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తద్వారా ‘హెచ్‌ఐవీ’ వ్యాప్తి గణనీయంగాగల జిల్లాల్లో కార్యక్రమ అమలు బలోపేతానికి ‘నేకో’ రాష్ట్రాలతో సంయుక్తంగా కృషి చేస్తోంది.

ఈ ప్రత్యేక విధానం కింద ‘హెచ్‌ఐవీ’ వ్యాప్తి 0.41 గానూ, బాధితుల సంఖ్య 1,56,961గానూ ఉన్న తెలంగాణను ప్రాధాన్య రాష్ట్రంగా గుర్తించారు. ఈ కార్యక్రమం కింద చర్యలను వేగిరపరచడానికి హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, సిద్దిపేట, మెదక్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, పెద్దపల్లి, జనగాం, వికారాబాద్, కామారెడ్డి, హన్మకొండ, సంగారెడ్డి, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లితో సహా మొత్తం 19 జిల్లాలను గుర్తించారు. దీనికి సంబంధించి ఆయా జిల్లాల ప్రతినిధులు పురోగతిని వివరించడంతోపాటు సమస్యలపై చర్చిస్తారు. తదనుగుణంగా సేవా ప్రదాన బలోపేతం దిశగా లక్షిత వ్యూహాలను రూపొందిస్తారు.

ఈ ప్రాధాన్య జిల్లాల్లోని బృందాలు తమ కార్యకలాపాల పురోగతిని వివరిస్తాయి. కార్యాచరణలో ఎదురైన సవాళ్లను ప్రస్ఫుటం చేస్తూ సేవా ప్రదానం మెరుగుకు లక్షిత వ్యూహాలకు రూపమిస్తాయి. ‘హెచ్‌ఐవీ’ నివారణ-పరీక్ష సేవల లభ్యత మెరుగుదల, చికిత్స ప్రక్రియతో అనుసంధానం సహా దాని కొనసాగింపు బలోపేతం, ‘హెచ్‌ఐవీ’ బాధితులైన ప్రజలకు మెరుగైన ఆరోగ్య ఫలితాలను అందించడంపై ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారిస్తారు.

జాతీయ స్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా సమన్వయ చర్యలను ప్రోత్సహించడం ద్వారా కార్యక్రమం అమలుకు డేటా ఆధారిత, వికేంద్రీకృత విధానాన్ని ఈ కార్యశాలలు బలోపేతం చేస్తాయి. జాతీయ హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నియంత్రణ లక్ష్యాల దిశగా పురోగమనాన్ని ఈ కార్యక్రమం గణనీయంగా వేగిరపరుస్తుందని భావిస్తున్నారు. అలాగే ప్రజారోగ్య ముప్పుగా ‘ఎయిడ్స్‌’ పరిగణనను అంతం పలకడంపై భారత్‌ నిబద్ధతను ప్రస్ఫుటం చేస్తుందని ఆశిస్తున్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2243467) సందర్శకుల సూచీ సంఖ్య : : 23
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English