రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
జాతీయ రహదారుల కార్యకలాపాలు, నిర్వహణకు ఏఐ ఆధారిత డ్యాష్‌క్యామ్ పర్యవేక్షణ వ్యవస్థను ప్రవేశపెట్టిన ఎన్‌హెచ్ఏఐ
రూట్ పెట్రోల్ వాహనాలకు (ఆర్పీవీ) ఏర్పాటు చేసిన ప్రత్యేక డ్యాష్‌బోర్డు కెమెరా ద్వారా
జాతీయ రహదారులపై వారాంతపు సర్వేల నిర్వహణ
प्रविष्टि तिथि:
20 MAR 2026 4:58PM by PIB Hyderabad
జాతీయ రహదారుల కార్యకలాపాలు, నిర్వహణలో పరివర్తన దిశగా ఎన్‌హెచ్ఏఐ కీలకమైన చర్య తీసుకుంది. సుమారు 40,000 కి.మీ. మేర జాతీయ రహదారి నెట్‌వర్క్‌లో ఏఐ ఆధారిత డ్యాష్‌క్యామ్ అనలిటిక్స్ సర్వీసు (డీఏఎస్)లను ఏర్పాటు చేయనుంది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్-వేల కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, సమాచార ఆధారిత కార్యకలాపాలు, నిర్వహణ (ఓ అండ్ ఎం)ను మెరుగుపరిచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్)లను ఈ కార్యక్రమం వినియోగించుకుంటుంది.
అధిక రిజల్యూషన్ ఉన్న చిత్రాలు, వీడియోలను ఉపయోగించుకొని రిమోట్ పర్యవేక్షణను మెరుగుపరచడం, రోడ్డు పరిస్థితులను అంచనా వేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. రూట్ పెట్రోల్ వాహనాలకు (ఆర్‌పీవీలు) ప్రత్యేక డ్యాష్‌బోర్డు కెమెరాలను అమర్చి అన్ని మార్గాల్లోనూ ప్రతి వారం సమగ్ర సర్వే నిర్వహిస్తారు. 30 రకాలకు పైగా లోపాలను, క్రమరహితంగా ఉన్న వాటిని గుర్తించడానికి అధునాతన ఏఐ/ఎంఎల్ శిక్షణ పొందిన విధానాలను ఉపయోగిస్తారు.
ముఖ్యంగా రోడ్డుపై గుంతలు, కుంగిపోవడం, తీవ్రమైన పగుళ్లను గుర్తించడంతో సహా రహదారుల పరిస్థితులపై ప్రధాన దృష్టి సారిస్తారు. పాడయిన లేదా వెలసిపోయిన లేన్ మార్కింగులు, క్రాష్ బ్యారియర్లు, పని చేయని వీధి దీపాల వంటి వాటిని ఎప్పటికప్పుడు గుర్తిస్తుంది. అక్రమంగా తెరచిన డివైడర్లు, అనధికార సూచిక బోర్డులు, అక్రమ పార్కింగులు, ఆక్రమణలను నిరంతరం పర్యవేక్షిస్తూ భద్రత, ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది.
రోడ్డు సూచికలు, పేవ్‌మెంట్ మార్కింగులు, రోడ్డు స్టడ్‌లు, జాతీయ రహదారిపై లైట్లను పర్యవేక్షించి రహదారి భద్రతను మెరుగుపరిచేందుకు నెలకు కనీసం ఒక వారాంతపు సర్వేను రాత్రి వేళల్లో నిర్వహిస్తారు. నీరు నిలిచిపోవడం, డ్రైనేజీ మూతలు లేకపోవడం, పిచ్చిమొక్కలు పెరగడం, బస్‌బేల పరిస్థితి లాంటి ఇతర కీలకమైన నిర్వహణాంశాలను కూడా పరిశీలిస్తారు.
నివేదికల వ్యవస్థీకృత పర్యవేక్షణకు దేశవ్యాప్తంగా అయిదు వ్యూహాత్మక జోన్లను ఏర్పాటు చేశారు. దీనికోసం డేటా మేనేజ్‌మెంట్, ఏఐ అనలిటిక్స్, ఇంటరాక్టివ్ విజువలైజేషన్ డ్యాష్‌బోర్డులతో కూడిన ప్రత్యేక ఐటీ వేదికను అభివృద్ధి చేస్తారు. ఈ విధానం ద్వారా వేర్వేరు సమయాల్లో రహదారి పరిస్థితులను పోల్చి చూసుకోవచ్చు. దీనివల్ల రహదారి నిర్వహణ పురోగతిని, మరమ్మతులను ఎన్‌హెచ్ఏఐ కచ్చితత్వంతో పర్యవేక్షించగలుగుతుంది. పర్యవేక్షణ సజావుగా సాగేందుకు, లోపాలను సకాలంలో గుర్తించి సరిదిద్దేందుకు ఏఐ రూపొందించిన ఫలితాలను ఎన్‌హెచ్‌ఏఐ డేటా లేక్ వేదికతో అనుసంధానిస్తారు.
జాతీయ రహదారుల కార్యకలాపాలు, నిర్వహణను సాంకేతికత ఆధారితంగా, సమర్థంగా మార్చే దిశగా వేసిన ముందడుగును ఈ కార్యక్రమం సూచిస్తుంది. ఏఐ ఆధారిత డ్యాష్‌క్యామ్ పర్యవేక్షణను ఉపయోగించడం ద్వారా సకాలంలో మరమ్మతులు చేపట్టడం, రహదారి భద్రతను మెరుగుపరచడం, జాతీయ రహదారుల్లో ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభూతిని అందించడం సాధ్యమవుతుంది.
***
(रिलीज़ आईडी: 2243230)
आगंतुक पटल : 56