వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశంలో 100 పారిశ్రామిక పార్కుల ఏర్పాటు లక్షిత ‘భవ్య’ పథకం అమలుకు ‘ఎన్‌ఐసీడీసీ’ సారథ్యం


· భారత తయారీ రంగ వృద్ధిలో తదుపరి దశ నిమిత్తం పెట్టుబడి సంసిద్ధ.. కార్యకలాపాల సంసిద్ధ వ్యవస్థలకు ప్రోత్సాహం

నాడు పోస్టు చేయడమైనది: 19 MAR 2026 5:36PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా 100 కార్యకలాపాల సంసిద్ధ పారిశ్రామిక పార్కులను ఏర్పాటు లక్ష్యంగా కేంద్ర వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ రూపొందించిన ‘భవ్య’ పథకం అమలుకు ‘నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ (ఎన్‌ఐసీడీసీ) సారథ్యం వహిస్తుంది. ఈ శాఖ పరిధిలోని పరిశ్రమల ప్రోత్సాహక-అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) ఆధ్వర్యంలో జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం (ఎన్‌ఐసీడీపీ) కింద ‘ఎన్‌ఐసీడీసీ’ ఈ బాధ్యతను నిర్వర్తిస్తుంది.

భవ్య పథకం కింద వ్యాపార సౌలభ్య కల్పన దిశగా ఆమోదిత భూమి, మౌలిక సదుపాయాల సంసిద్ధ, సమీకృత సేవల లభ్యత సహితంగా పారిశ్రామిక పార్కులను ‘ఎన్‌ఐసీడీసీ’ ఏర్పాటు చేస్తుంది. పరిశ్రమల సత్వర స్థాపనకు మద్దతుగా ఈ పార్కులలో సింగిల్-విండో వ్యవస్థలు సహా సరళీకృత అనుమతి-ఆమోద యంత్రాంగాలను కూడా అందుబాటులో ఉంచుతుంది.

ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ బృహత్ప్రణాళికకు అనుగుణంగా బహుళ రవాణా అనుసంధానంతోపాటు సమర్థ చివరి అంచె సౌలభ్యానికి ప్రతిపాదిత పారిశ్రామిక పార్కులు భరోసా ఇస్తాయి. విశ్వసనీయ, సమర్థ పారిశ్రామిక కార్యకలాపాలకు చేయూతనిస్తూ భూగర్భ సదుపాయాల ఏర్పాటు సహా మౌలిక సదుపాయాల ప్రణాళికకు ఇవి ప్రాధాన్యమిస్తాయి.

ప్రాంతాలవారీగా పారిశ్రామిక మౌలిక సదుపాయాల విస్తరణ, సమతుల-సుస్థిర పారిశ్రామిక వృద్ధికి తోడ్పాటు లక్ష్యంగా పారిశ్రామిక కారిడార్లు, స్మార్ట్ సిటీల అభివృద్ధిలో ‘ఎన్‌ఐసీడీసీ’కిగల అనుభవం ఆధారంగా భవ్య పథకం రూపొందింది.

తయారీ రంగ పోటీతత్వం పెంపు, పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు ఉపాధి కల్పన దిశగా గ్రీన్‌ఫీల్డ్ పారిశ్రామిక స్మార్ట్ నగరాల అభివృద్ధిపై దృష్టి సారిస్తూ 13 రాష్ట్రాలలో 20 ప్రాజెక్టులను ‘ఎన్‌ఐసీడీసీ’ ప్రస్తుతం అమలు చేస్తోంది. దీనికి అదనంగా వస్త్ర రంగంలో సమీకృత తయారీ వ్యవస్థలకు చేయూతనిస్తూ, జౌళి మంత్రిత్వ శాఖ పరిధిలోని 7 ‘పీఎం మిత్ర పార్కు’ల అభివృద్ధికి ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీగానూ ‘ఎన్‌ఐసీడీసీ’ వ్యవహరిస్తోంది.

ధోలేరా, షేంద్ర-బిడ్కిన్, విక్రమ్ ఉద్యోగపురి, గ్రేటర్ నోయిడా సహా ‘ఎన్‌ఐసీడీసీ’ అభివృద్ధి చేసిన పారిశ్రామిక కేంద్రాలు ఇప్పటికే సమీకృత ప్రణాళిక, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడిదారులకు సకల సంసిద్ధ పారిశ్రామిక వ్యవస్థల రూపకల్పనలో ప్రగతి సాధించాయి. దేశ పారిశ్రామిక మౌలిక సదుపాయాలతోపాటు ఉత్పాదక సామర్థ్య బలోపేతానికి ఈ పరిణామాలన్నీ దోహదం చేశాయి.

‘ఎన్‌ఐసీడీసీ’ అభివృద్ధి చేసిన పారిశ్రామిక స్మార్ట్ నగరాలలో ముందస్తు మౌలిక సదుపాయాల సహిత కార్యకలాప సంసిద్ధ ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే రోడ్డు, రైలు, ఇతర రవాణా నెట్‌వర్కుల ద్వారా బహుళ రవాణా మార్గానుసంధానం పూర్తయింది. పారిశ్రామిక-పట్టణ మౌలిక సదుపాయాల సమీకృత ప్రణాళిక, పర్యవేక్షణతోపాటు సేవల పంపిణీ నిమిత్తం డిజిటల్ వ్యవస్థల వినియోగం వంటి సౌకర్యాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులలో పర్యావరణ హిత ఇంధనం, జల పునరుపయోగ వ్యవస్థల వంటి సుస్థిర మౌలిక సదుపాయాల కోసం కూడా నిధులు కేటాయించారు.

‘ఎంఎస్‌ఎంఈ’లు భారీ తయారీ సంస్థలు సహా వివిధ రకాల పెట్టుబడిదారులు ఈ పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధిపై ఆసక్తి చూపుతున్నాయి. అంతేకాకుండా అనేక ప్రాంతాల్లో పారిశ్రామిక భూమి కోసం బలమైన డిమాండ్ ప్రస్ఫుటమవుతోంది.

కేంద్ర వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని పరిశ్రమల ప్రోత్సాహక-అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐఈ) పరిధిలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఐసీడీసీ) పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా ఉత్పాదక పోటీతత్వం పెంపు, పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు ఉపాధి కల్పన కోసం అంతర్జాతీయ స్థాయి గ్రీన్‌ఫీల్డ్ పారిశ్రామిక స్మార్ట్ నగరాల అభివృద్ధికి ఈ సంస్థ సారథ్యం వహిస్తోంది. ఈ బాధ్యతలలో భాగంగా ప్రస్తుతం జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం కింద 13 రాష్ట్రాలలో 20 ప్రాజెక్టులను ‘ఎన్‌ఐసీడీసీ’ అమలు చేస్తోంది.

కార్యకలాప సంసిద్ధ పారిశ్రామిక పార్కుల ప్రాతిపదికన ‘ఎన్‌ఐసీడీసీ’ నేతృత్వంలో కార్యక్రమాలు రూపొందాయి. వీటి ద్వారా వినియోగ సంసిద్ధ వ్యవస్థలు సహా భూమి, సౌకర్యాలు, అనుమతులు సహా మౌలిక సదుపాయాలన్నీ సంసిద్ధంగా ఉంటాయి. దీనివల్ల భూసేకరణ లేదా మౌలిక సదుపాయాల కల్పన సంబంధిత జాప్యాలకు తావులేకుండా పరిశ్రమలు సత్వరం తమ కార్యకలాపాలను ప్రారంభించే వెసులుబాటు లభిస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2242759) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Gujarati , English , Urdu , हिन्दी