హోం మంత్రిత్వ శాఖ
సైబర్ నేరాల నిరోధానికి సమన్వయ వ్యవస్థ- ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్
నాడు పోస్టు చేయడమైనది:
17 MAR 2026 5:30PM by PIB Hyderabad
భారత రాజ్యాంగం ఏడవ షెడ్యూల్ ప్రకారం 'పోలీసు', 'శాంతిభద్రతలు‘ రాష్ట్ర పరిధిలోని అంశాలు. సైబర్ నేరాలతో సహా అన్ని రకాల నేరాల నివారణ, గుర్తింపు, విచారణ, నేరస్తులను శిక్షించడం వంటి పనుల్లో ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలోని చట్టాల అమలు సంస్థలదే ప్రధాన బాధ్యత. ఈ సంస్థల సామర్థ్యాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా సలహాలు, ఆర్థిక సాయం అందిస్తూ రాష్ట్రాల ప్రయత్నాలకు మద్దతు ఇస్తోంది.
దేశంలో సైబర్ నేరాల నివారణ, గుర్తింపు, విచారణ, నేరస్తులను శిక్షించడం కోసం ఒక వ్యవస్థను రూపొందించే లక్ష్యంతో 2018లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 'ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్' (I4సీ)ను ఒక పథకంగా ఏర్పాటు చేసింది. అతి తక్కువ కాలంలోనే, సైబర్ నేరాలను ఎదుర్కోవడంలో దేశ సామర్థ్యాన్ని పెంచడానికి, చట్ట అమలు సంస్థల మధ్య సమర్థవంతమైన సమన్వయాన్ని పెంపొందించడానికి I4సీ కృషి చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుబంధ కార్యాలయంగా 1 జూలై 2024 నుంచి I4సీ పని చేస్తోంది. పౌరులకు ఎదురయ్యే సైబర్ నేరాల సమస్యల పరిష్కారంపై ఇది దృష్టి సారించింది. ఇందులో భాగంగా వివిధ చట్ట అమలు సంస్థలు, భాగస్వాముల మధ్య సమన్వయం, సామర్ధ్యం పెంచడం, అవగాహన కల్పించడం వంటి కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
ఆర్థిక మోసాలను వెంటనే నివేదించడానికి, మోసగాళ్లు డబ్బును దారి మళ్లించకుండా ఆపడానికి I4సీ పరిధిలో ‘సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ (సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్) ను 2021లో ప్రారంభించారు. I4సీ నిర్వహిస్తున్న ఈ వ్యవస్థ ప్రకారం, 31.01.2026 నాటికి 24.65 లక్షల పైగా ఫిర్యాదులలో రూ. 8,690 కోట్ల పైగా డబ్బును దారిమళ్లకుండా కాపాడారు. ఆన్‌లైన్ సైబర్ నేరాలపై ఫిర్యాదులు చేయడానికి టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ ‘1930’ అందుబాటులోకి వచ్చింది. పోలీసు వర్గాలు అందించిన సమాచారం ప్రకారం, 31.01.2026 నాటికి భారత ప్రభుత్వం 12.94 లక్షల పైగా సిమ్ కార్డులను, 3.03 లక్షల ఐఎంఈఐ నంబర్లను నిలిపివేసింది.
సైబర్ నేరగాళ్ల వివరాలను నమోదు చేసే 'సస్పెక్ట్ రిజిస్ట్రీ'ని బ్యాంకులు, ఆర్థిక సంస్థల సహకారంతో 10.09.2024న I4సీ ప్రారంభించింది. 31.01.2026 నాటికి, బ్యాంకుల నుంచి అందిన 23.05 లక్షల పైగా అనుమానిత డేటా, 27.37 లక్షల 'లేయర్ 1' మ్యూల్ ఖాతాల వివరాలను ఈ రిజిస్ట్రీలోని సంస్థలతో పంచుకున్నారు. దీని ద్వారా రూ. 9,518 కోట్ల పైగా విలువైన మోసపూరిత లావాదేవీలను నిలిపివేశారు.
సైబర్ నేరాల సమాచారాన్ని పంచడం, విశ్లేషించడం కోసం చట్ట అమలు సంస్థలకు ఒక మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఐఎస్) వేదిక గానూ, డేటాను భద్రపరిచే సమన్వయ వేదికగానూ సేవలందించడానికి 'సమన్వయ వేదిక‘ అందుబాటులోకి వచ్చింది. వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదైన సైబర్ నేరాల ఫిర్యాదుల ఆధారంగా నేరాలు, నేరస్తుల మధ్య ఉన్న అంతర్రాష్ట్ర సంబంధాల విశ్లేషణను ఇది అందిస్తుంది. 'ప్రతిబింబ్' మాడ్యూల్ నేరస్తుల స్థానాలను, నేరాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను మ్యాప్‌పై చూపిస్తూ సంబంధిత అధికారులకు స్పష్టతనిస్తుంది. ఈ మాడ్యూల్ ద్వారా చట్ట అమలు సంస్థలు I4సీ, ఇతర ఎస్ఎంఈల నుంచి సాంకేతిక-చట్టపరమైన సాయాన్ని సులభంగా పొందవచ్చు. దీని ఫలితంగా ఇప్పటివరకు 21,857మందికి పైగా నిందితులను అరెస్టు చేశారు. 1,49,636 పైగా సైబర్ విచారణ సహాయ అభ్యర్థనలు నమోదయ్యాయి.
సైబర్ మోసాల కేసుల్లో ఈ-ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రయత్నం చేపట్టింది. సైబర్ నేరాల కేసుల్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేసే ఈ 'ఈ-ఎఫ్ఐఆర్' విధానం ఢిల్లీ, రాజస్థాన్, చండీగఢ్, మధ్యప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అమలులోకి వచ్చింది.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ఈ రోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాలను వెల్లడించారు.
***
(రిలీజ్ ఐడి: 2241500)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7