సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మహిళా నేతృత్వంలోని సహకార సంఘాలు

నాడు పోస్టు చేయడమైనది: 17 MAR 2026 4:49PM by PIB Hyderabad

ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లో సమగ్ర, భాగస్వామ్య ఆర్థికాభివృద్ధికి ముఖ్యమైన సాధనంగా సహకార సంఘాలను ప్రభుత్వం గుర్తిస్తోంది. సహకార మంత్రిత్వ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేయటం ద్వారా రైతులు, మహిళలు, గ్రామీణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మహిళల నేతృత్వంలోని సహకార సంఘాలను, స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీలు)తో అనుసంధానించి, సహకార సంఘాలను ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారు.

I. మహిళా నేతృత్వంలోని సహకార సంఘాలను ప్రోత్సహించటం:

పాడి పరిశ్రమ, వ్యవసాయం, హస్తకళలు, గ్రామీణ పరిశ్రమల వంటి వివిధ రంగాల్లో మహిళల నేతృత్వంలోని సహకార సంఘాల ఏర్పాటును, వాటి బలోపేతాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇతర మంత్రిత్వ శాఖల సమన్వయంతో వివిధ సంస్థలు, పథకాల ద్వారా సామర్థ్య పెంపు, శిక్షణ, ఆర్థిక సహాయం అందిస్తోంది.

ii. పాడి సహకార సంఘాల ప్రోత్సాహం - శ్వేత విప్లవం 2.O:

 

పాడి పరిశ్రమను బలోపేతం చేయటానికి, మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించటానికి.. ప్రభుత్వం కొత్తగా 75,000 డెయిరీ సహకార సంఘాల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. దీనితో పాటు ప్రస్తుతమున్న 46,422 డెయిరీ సహకార సంఘాలనూ బలోపేతం చేస్తోంది. మహిళల ఆర్థిక సాధికారత, ఉపాధి కల్పన, గ్రామీణ జీవనోపాధి మెరుగుదలలో డెయిరీ సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయి.

 

iii. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) మహిళా కేంద్రీకృత పథకాలు:

కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణలో పనిచేసే చట్టబద్ధమైన సంస్థే జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ). సహకార రంగానికి ప్రాధాన్యతనిస్తూ ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా మహిళల నేతృత్వంలోని స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీ)తో అనుసంధానమైన సహకార సంఘాల బలోపేతానికి పలు పథకాలను ఎన్‌సీడీసీ అమలు చేస్తోంది.

 

a. స్వయం శక్తి సహకార్ యోజన: మహిళా స్వయం సహాయక బృందాలకు (ఎస్‌హెచ్‌జీ) ఆదాయాన్నిచ్చే పనులు, వ్యవస్థాపక అభివృద్ధికి, సామర్థ్య పెంపుదలకు ఆర్థికసాయం అందించటం ద్వారా మహిళా సహకార సంఘాలను ప్రోత్సహించి, బలోపేతం చేయాలని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతిగా.. మహిళా స్వయం సహాయక బృందాలకు ఈ సహకార సంఘాలు కాలపరిమితి రుణాలు లేదా నిర్వహణ మూలధన రుణాలను మంజూరు చేస్తాయి.

 

b. నందిని సహకార్ పథకం: పాడి పరిశ్రమ, పశు సంవర్ధకం, ఆహార శుద్ధి, ఇతర అనుబంధ రంగాల్లోని మహిళా నేతృత్వంలోని సహకార సంఘాలకు మాత్రమే ఆర్థిక సహాయాన్ని అందించి.. సహకార సంస్థల్లో మహిళల భాగస్వామ్యాన్ని ఈ పథకం పెంపొందిస్తుంది.

 

c. యువ సహకార్ యోజన: అభివృద్ధి చెందుతున్న, వినూత్న రంగాల్లో సహకార సంఘాలను ఏర్పాటు చేసి, నిర్వహించేలా యువ మహిళా పారిశ్రామిక వేత్తలను ఈ పథకం ప్రోత్సహిస్తుంది. ఇందుకోసం ఎన్‌సీడీసీ ద్వారా ఆర్థిక సాయం, మద్ధతును అందిస్తుంది. ఈ పథకం ద్వారా ప్రాజెక్టు వ్యయంలో మహిళా సహకార సంఘం కేవలం 20% వాటాను భరించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తానికి సులభతర ఆర్థిక రుణ సదుపాయం అందుతుంది. మహిళా నేతృత్వంలోని సహకార సంఘాలకు ఎన్‌సీడీసీ ఇచ్చే టర్మ్ లోన్ పై 2% వడ్డీ రాయితీని కల్పిస్తుంది.

ఈ సమాచారాన్ని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా లిఖితపూర్వక సమాధానంగా లోక్‌సభకు అందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2241494) సందర్శకుల సూచీ సంఖ్య : : 85
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी