పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
పార్లమెంటులో ప్రశ్న: గ్రీన్ క్రెడిట్ కార్యక్రమం
నాడు పోస్టు చేయడమైనది:
16 MAR 2026 3:34PM by PIB Hyderabad
పర్యావరణానికి మేలు చేసే చర్యలను ప్రోత్సహించడానికీ, పర్యావరణ హిత జీవన శైలిని (లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ - లైఫ్) ముందుకు తీసుకెళ్లడానికీ రూపొందించిన వినూత్న విధానం గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్. పర్యావరణహిత కార్యాచరణ దిశగా సమాజాన్ని ప్రోత్సహించడం ద్వారా సుస్థిర జీవనశైలిని అలవరచుకునేలా చేయడం దీని లక్ష్యం. ఈ కార్యక్రమం ద్వారా పచ్చదనాన్ని పెంచడం, కర్బన శోషణను (కార్బన్ సీక్వెస్ట్రేషన్) మెరుగుపరచడం, పాడైపోయిన భూముల పునరుద్ధరణ, పర్యావరణ హిత సాంకేతికతలను అవలంబించడం ద్వారా కర్బనోద్గారాలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
పర్యావరణ (సంరక్షణ) చట్టం - 1986 కింద స్వచ్ఛంద పర్యావరణ అనుకూల చర్యలను ప్రోత్సహించడం, వాటి ద్వారా ‘హరిత పరపతి (గ్రీన్ క్రెడిట్స్)’ని జారీ చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబర్ 12న ‘హరిత పరపతి నియమాలు (గ్రీన్ క్రెడిట్ రూల్స్)- 2023’ను జారీ చేసింది. ఈ కార్యక్రమం కింద మొక్కల పెంపకం, క్షీణించిన అటవీ భూముల్లో పర్యావరణ పునరుద్ధరణ కోసం విధివిధానాలను 2024 ఫిబ్రవరి 22న ప్రకటించారు. అనంతరం 2025 ఆగస్టు 29న వాటిని సవరించారు.
ఇందుకోసం ఒక గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ పోర్టలును (https://moefcc-gep.in/) కూడా రూపొందించారు.
డెహ్రాడూన్‌లోని భారత అటవీ పరిశోధన, విద్యా మండలి (ఐసీఎఫ్ఆర్ఈ) గ్రీన్ క్రెడిట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ నిబంధనల నిర్వహణ, కార్యకలాపాల పర్యవేక్షణ, గ్రీన్ క్రెడిట్లను జారీ చేయడం సహా ఈ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయడం ఈ సంస్థ బాధ్యత.
ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల క్రియాశీల భాగస్వామ్యం ద్వారా క్షీణించిన అటవీ భూములను పునరుద్ధరించాలని గ్రీన్ క్రెడిట్ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం.. ఈ కార్యక్రమం కింద చేపట్టాలని ప్రతిపాదించిన అటవీ భూములను, భూభాగాలను రాష్ట్ర అటవీ శాఖ ఎంపిక చేసి నమోదు చేస్తుంది.
గ్రీన్ క్రెడిట్ కార్యక్రమం కింద ఎంపిక చేసిన భూములను డివిజనల్ నోడల్ అధికారి, రాష్ట్ర నోడల్ అధికారి పరిశీలిస్తారు. ఈ క్షీణించిన అటవీ భూముల్లో ఇప్పటికే ఎలాంటి పెంపకమూ జరగలేదనీ, అలాగే పరిహార అటవీకరణ వంటి ఇతర ఏ పథకాల కింద కూడా ఈ భూములను కేటాయించలేదని వారు నిర్ధారిస్తారు. దీనివల్ల గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ కింద ఒకే భూమిపై రెండుసార్లు ప్రయోజనాలు అందకుండా నిరోధించవచ్చు.
ఈ క్షీణించిన అటవీ భూముల్లో చేపట్టే అడవుల పెంపకం కోసం.. ఆ ప్రాంత పరిస్థితులకు అనువైన స్థానిక జాతుల మిశ్రమాన్నే ఉపయోగించాల్సి ఉంటుంది. కనీసం అయిదేళ్ల పునరుద్ధరణ పనులు పూర్తి చేసిన తర్వాత, కనీసం 40 శాతం ఉపరితల హరిత (కనోపీ) సాంద్రత సాధించిన తర్వాతే దరఖాస్తుదారులు ఈ గ్రీన్ క్రెడిట్‌లను క్లెయిమ్ చేసుకోవచ్చు. నాటిన మొక్కలు, సహజ పునరుత్పత్తి పెరిగి.. తగినంత కనోపీ విస్తీర్ణాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అయిదేళ్ల స్థాపన కాలవ్యవధిని నిర్ణయించారు. దీనివల్ల మధ్యస్థ సాంద్రత కలిగిన అటవీ స్థాయికి కావాల్సిన 40 శాతం కనోపీ సాంద్రతను సాధించడానికి వీలవుతుంది.
గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ కింద నియమించిన ‘నియమిత సంస్థ’.. గ్రీన్ క్రెడిట్ల కోసం చేసిన దరఖాస్తును పరిశీలిస్తుంది. దరఖాస్తుదారు చేపట్టిన కార్యకలాపాల ధ్రువీకరణకు సంబంధించిన నివేదికను నిర్వాహకులకు ఈ సంస్థ సమర్పిస్తుంది.
గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ కింద పునరుద్ధరించిన అటవీ భూములను.. వన (సంరక్షణ ఏవం సంవర్ధన్) అధీనియం - 1980తోపాటు దాని నియమాలు, మార్గదర్శకాల ప్రకారం పరిహార అటవీకరణ అవసరాలను తీర్చడానికి బదులుగా వాడుకోవచ్చు.
జీవవైవిధ్యాన్ని పెంపొందించడం, అటవీ వనరుల ఉత్పాదకతను మెరుగుపరచడం.. ఈ కార్యక్రమం కింద చేపట్టిన అటవీ పునరుద్ధరణ చర్యల లక్ష్యం. క్షీణించిన అటవీ భూములను పునరుద్ధరించడం ద్వారా.. కలప, ఇతర అటవీ ఉత్పత్తులు, పశుగ్రాసం, నీరు, ఇతర పర్యావరణ వ్యవస్థ సంబంధిత సేవలను అందుబాటులోకి తెచ్చి స్థానికులకు ప్రయోజనం చేకూర్చడం దీని ముఖ్యోద్దేశం.
గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ కింద పర్యావరణ పునరుద్ధరణ కోసం వివిధ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన క్షీణించిన అటవీ భూముల వివరాలు ఇలా ఉన్నాయి:
లోకసభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ కీర్తివర్ధన్ సింగ్ ఈ సమాచారాన్ని అందించారు.
***
(రిలీజ్ ఐడి: 2240847)
సందర్శకుల సూచీ సంఖ్య : : 17