నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఐటీఐల స్థాయిని పెంచే (పీఎమ్-సేతు) పథకం
నాడు పోస్టు చేయడమైనది:
16 MAR 2026 3:29PM by PIB Hyderabad
దేశంలో వృత్తివిద్యల శిక్షణలో మొత్తంమీద వాసినీ, ఆ విద్యల సందర్భ శుద్ధినీ పెంపొందించడమే లక్ష్యంగా ‘ప్రధాన్ మంత్రీ స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబులిటీ ట్రాన్స్‌ఫార్మేషన్ త్రూ అప్‌గ్రేడెడ్ ఐటీఐస్ (పీఎమ్ ఎస్ఈటీయూ.. ‘పీఎమ్ సేతు’)ను ప్రారంభించారు. ఈ పథకం కింద మొత్తం రూ.60,000 కోట్లు (కేంద్రం వాటా రూ.30,000 కోట్లు, రాష్ట్ర వాటా రూ. 20,000 కోట్లు, పరిశ్రమ వాటా రూ. 10,000 కోట్లు) ఖర్చు చేస్తారు.
ఈ పథకంలో రెండు భాగాలు (కంపోనంట్స్) ఉన్నాయి:
1. ఒకటో భాగం - ఇది 1,000 ప్రభుత్వ ఐటీఐల స్థాయిని పెంచడానికి సంబంధించింది. దీనికోసం హబ్ అండ్ స్పోక్ నమూనాను అనుసరిస్తారు. 200 ఐటీఐలని హబ్ (ప్రధాన) ఐటీఐలుగాను, 800 ఐటీఐలని స్పోక్ (అనుబంధ) ఐటీఐలుగాను తీర్చిదిద్దుతారు. స్థాయిని పెంచడంలో భాగంగా స్మార్ట్ క్లాస్‌రూములు, ఆధునిక ల్యాబులను ఏర్పాటు చేస్తూ, డిజిటల్ కంటెంటుతో పాటు పరిశ్రమ అవసరాలకు తులతూగే కొత్త కొత్త కోర్సులను బోధిస్తారు.
2. రెండో భాగం - దీనిలో భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, కాన్పూర్, లూధియానాల్లోని 5 ఎన్ఎస్‌టీఐల సామర్థ్యాన్ని పెంచుతారు. దీని కోసం నిర్దిష్ట రంగం వారీ శిక్షణ ప్రధానంగా ఉండే నేషనల్ ఎక్స్‌లెన్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. శిక్షణను ఇచ్చే వారికి ప్రపంచ స్థాయి భాగస్వామ్యం ద్వారా ఆధునిక శిక్షణను సమకూరుస్తారు.
పీఎమ్-సేతు పథకంలో భాగంగా ఐటీఐల ఎంపికకు సంబంధిత రాష్ట్రాల ప్రభుత్వాలు/కేంద్ర పాలిత ప్రాంతాల పాలన యంత్రాంగాలు సారథ్యం వహిస్తాయి. పరిశ్రమ సూచనలనీ, సలహాలనీ కూడా తీసుకుంటారు. మారుతున్న స్థితిగతులకూ, స్థానిక పరిశ్రమల్లోని అవకాశాలకూ తుల తూగడానికి ప్రాధాన్యాన్నిస్తారు. దీనికి అనుగుణంగానే, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు స్థాయి పెంపునకు సంబంధించిన ప్రతిపాదనల్ని పరిశ్రమ భాగస్వాముల సహకారంతో సమర్పించాల్సి ఉంటుంది. పథకం సమగ్ర దృష్టికోణం, విధానపరంగా స్థూల దిశను సూచించడం, కార్యనిర్వహణ సంబంధిత మార్గదర్శకాలను ఖరారు చేయడం, పర్యవేక్షణతో పాటు ముందుకు పోయే క్రమంలో తీసుకోవాల్సిన సమయానుగుణ దిద్దుబాటు.. వీటి కోసం జాతీయ సారథ్య సంఘాన్ని (ఎన్ఎస్‌సీ) నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికత్వ మంత్రిత్వ శాఖ (ఎమ్ఎస్‌డీఈ) ఏర్పాటు చేసింది. ఇది ఒక అత్యున్నత సంఘంగా ఉంటుంది. దీనికి ఎమ్ఎస్‌డీఈ కార్యదర్శి అధ్యక్షత వహిస్తారు. 32 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు తమ రాష్ట్ర సారథ్య సంఘాలను (ఎస్ఎస్‌సీ) ఏర్పాటు చేశాయి. ఇవి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల స్థాయిలో అత్యున్నత సంఘాలుగా వ్యవహరిస్తాయి. వీటికి ఆయా రాష్ట్ర ప్రభుత్వ /కేంద్రపాలిత ప్రాంత చీఫ్ సెక్రటరీలు సారథ్యం వహిస్తారు. పథకానికి మార్గదర్శకత్వం వహించడం, అమలు తీరును పర్యవేక్షించడం ఈ సారథ్య సంఘాల పని. 15 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు పరిశ్రమ ఆసక్తిని తెలుసుకో గోరాయి. స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్‌పీవీ)ని ఏర్పాటు చేయడం కోసం పరిశ్రమ భాగస్వామిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్‌పీ)కి ప్రతిస్పందన చర్యగా, పరిశ్రమ ఒక వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళిక (ఎస్ఐపీ)ని సమర్పించాల్సి ఉంటుంది.
కర్నాటక ప్రభుత్వం రెండు క్లస్టర్లను గుర్తించింది. బెంగళూరు, కలబురగి జిల్లాల్లో హబ్ ఐటీఐల్ని ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతానికి, జాతీయ సారథ్య సంఘం ఆమోదాన్ని కోరుతున్న ఎలాంటి వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళిక గాని, ప్రతిపాదన గాని లేవు.
ఈ సమాచారాన్ని నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికత్వ మంత్రిత్వ శాఖ (ఎమ్ఎస్‌డీఈ) సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ జయంత్ చౌధరి ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2240826)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14