రక్షణ మంత్రిత్వ శాఖ
పీ8ఐ విమానం నుంచి స్వదేశీ ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ ‘ఏడీసీ-150’ ఇన్-ఫ్లైట్ రిలీజ్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన డీఆర్‌డీఓ, భారత నౌకాదళం
నాడు పోస్టు చేయడమైనది:
10 MAR 2026 7:22PM by PIB Hyderabad
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ - డీఆర్డీఓ), భారత నౌకాదళం సంయుక్తంగా ఫిబ్రవరి 21 నుంచి మార్చి 01, 2026 మధ్య గోవా తీరంలో పీ8ఐ విమానం ద్వారా స్వదేశీ ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ ‘ఏడీసీ-150’ నాలుగు ఇన్ - ఫ్లైట్ రిలీజ్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించాయి. వివిధ కఠినమైన పరిస్థితుల్లో ఈ ప్రయోగాలు జరిగాయి.
150 కిలోల బరువును మోసుకెళ్లేలా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఈ ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ నౌకాదళ రవాణా సామర్థ్యాన్ని పెంచుతుంది. తీరానికి దూరంగా నౌకలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన పరికరాలు, వైద్య సహాయం వంటివి త్వరగా అందించడానికి ఇది ఉపయోగపడుతుంది.
విశాఖపట్నంలోని నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లాబొరేటరీ (ఎన్ఎస్టీఎల్) ఈ ప్రాజెక్టుకు నోడల్ లాబొరేటరీగా వ్యవహరించింది. ఆగ్రాలోని ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏడీఆర్డీఈ) పారాచూట్ వ్యవస్థను అభివృద్ధి చేయగా, బెంగళూరులోని సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్‌వర్దినెస్ అండ్ సర్టిఫికేషన్ (సీ ఈ ఎంఐఎల్ఏసీ) ఈ విమాన ప్రయోగాలకు అవసరమైన అనుమతులు, ధృవీకరణను అందించింది. హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ (డీఆర్డీఎల్) ఈ పరీక్షలకు అవసరమైన ఇన్‌స్ట్రుమెంటేషన్ (పరికరాల) మద్దతును అందించింది.
భారత నౌకాదళ అవసరాలను తీర్చడానికి, పీ8ఐ విమానం కోసం ఉద్దేశించిన ఏడీసీ -150 వ్యవస్థను అతి తక్కువ సమయంలోనే అభివృద్ధి చేసి, అర్హత పరీక్షలను పూర్తి చేశారు. అభివృద్ధి దశలోని విమాన పరీక్షలన్నీ విజయవంతంగా ముగియడంతో, ఈ వ్యవస్థ త్వరలోనే భారత నౌకాదళంలో చేరనుంది.
***
(రిలీజ్ ఐడి: 2237945)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10