జాతీయ మానవ హక్కుల కమిషన్
azadi ka amrit mahotsav

మార్చి 2026 నుంచి ఆన్‌లైన్ స్వల్పకాలిక ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ, భారత్‌


దేశవ్యాప్తంగా 1,147 మంది దరఖాస్తు చేసుకోగా.. వివిధ విద్యా నేపథ్యాల నుంచి 80 మంది యూనివర్సిటీ స్థాయి విద్యార్థుల ఎంపిక

ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న సంఘర్షణల నేపథ్యంలో మానవ హక్కులను అర్థం చేసుకోవడం మరింత కీలకం: ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్‌పర్సన్, జస్టిస్ వి. రామసుబ్రమణియన్

ప్రతి వ్యక్తి గౌరవాన్ని కాపాడటం పౌరుల సమష్టి బాధ్యత: ఎన్‌హెచ్‌ఆర్‌సీ సెక్రటరీ జనరల్ శ్రీ భరత్ లాల్

నాడు పోస్టు చేయడమైనది: 09 MAR 2026 6:47PM by PIB Hyderabad

భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) మార్చి 2026 విడతకు సంబంధించిన ఆన్‌లైన్ స్వల్పకాలిక ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని నేడు ప్రారంభించింది. కమిషన్‌ సెక్రటరీ జనరల్ శ్రీ భరత్ లాల్, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో చైర్‌పర్సన్ జస్టిస్ వి. రామసుబ్రమణియన్ దీనిని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన 1,147 దరఖాస్తుల్లో.. వివిధ విద్యా నేపథ్యాలు కలిగిన 80 మంది యూనివర్సిటీ స్థాయి విద్యార్థులు ఈ కార్యక్రమానికి ఎంపికయ్యారు. ఈ రెండు వారాల కార్యక్రమం 2026 మార్చి 20న ముగియనుంది.

ఈ ఇంటర్న్‌షిప్ కార్యక్రమంలో బాలికల భాగస్వామ్యం పెరుగుతుండటం పట్ల జస్టిస్ రామసుబ్రమణియన్ హర్షం వ్యక్తం చేశారు. ఏ సమాజమైనా అభివృద్ధి చెందాలన్నా, న్యాయం, సామాజిక స్పృహ పెంపొందాలన్నా మహిళల్లో విద్య, అవగాహన పెరగడం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఇక్కడ పొందే మానవ హక్కుల జ్ఞానాన్ని కేవలం వృత్తి ఎదుగుదలకే కాకుండా వారి వ్యక్తిత్వాన్ని, సమాజం పట్ల వారి దృక్పథాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించాలని ఆయన ఆకాంక్షించారు.

సిడ్నీకి చెందిన ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్’ నివేదికను ప్రస్తావిస్తూ.. నేడు ప్రపంచంలోని 78 దేశాలు శాంతి, స్వేచ్ఛ పేరుతో సరిహద్దుల వెలుపల సాయుధ పోరాటాలకు పాల్పడుతున్నాయని ఆయన చెప్పారు.శాంతి గురించి మాట్లాడే వారే ఇప్పుడు యుద్ధం గురించి మాట్లాడుతుండటం విచారకరమని ఆయన అన్నారు. ఇటువంటి సంఘర్షణల వల్ల  మానవ నాగరికతకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన పరిణామాలను కలిగిస్తాయని చెప్పారు. దాదాపు 12.2 కోట్ల మంది శరణార్థులుగా మారారని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సుమారు 20 ట్రిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని ఆయన వివరించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లోనే మానవ హక్కుల యొక్క అసలు అర్థం, ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

అంతకుముందు ఎన్‌హెచ్‌ఆర్‌సీ సెక్రటరీ జనరల్ శ్రీ భరత్ లాల్ మాట్లాడుతూ.. ఈ దేశం పౌరులందరిదని, ప్రతి వ్యక్తి  గౌరవాన్ని కాపాడటం, దేశాన్ని మరింత మెరుగైన, అందమైన ప్రదేశంగా తీర్చిదిద్దడం మనందరి సామూహిక బాధ్యత అని పేర్కొన్నారు. వికసిత్‌ భారత్‌ ఆలోచన కేవలం మాటల్లోనే కాకుండా ఇళ్లు, పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలలో ప్రజలు పొందే రోజువారీ అనుభవాలలో ప్రతిబింబించాలని చెప్పారు.

ప్రముఖ వక్తలతో జరిగే చర్చలు ఇంటర్న్‌లకు ఒక విశిష్టమైన అభ్యాస అవకాశాన్ని కల్పిస్తాయని, మానవ హక్కుల రంగంలో అనుభవం ఉన్న నిపుణులతో నేరుగా సంభాషించడానికి ఇది వీలు కల్పిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇంటర్న్‌లను మానవ హక్కుల రాయబారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా గుర్తించేలా, వ్యవస్థాగతమైన లేదా ఇతర వివక్షలను ఎదిరించేలా ఈ రెండు వారాల సమయాన్ని అవగాహన పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలని ఆయన పాల్గొనేవారిని కోరారు.

ఈ ఇంటర్న్‌షిప్ సమగ్ర ప్రణాళికను ఎన్‌హెచ్‌ఆర్‌సీ జాయింట్ సెక్రటరీ శ్రీమతి సైడింగ్‌పుయి చక్ చువక్ వివరించారు. ఇందులో నిపుణుల ఉపన్యాసాలతో పాటు.. బృంద పరిశోధన ప్రాజెక్టు ప్రదర్శన, పుస్తక సమీక్ష, ఉపన్యాస పోటీలు వంటి బృంద, వ్యక్తిగత పోటీలు ఉంటాయి. సంస్థల పనితీరుపై అవగాహన కోసం తిహార్ వసతి గృహం, పోలీస్‌ స్టేషన్ వంటి ప్రదేశాలను వర్చువల్‌ పద్ధతిలో సందర్శించే అవకాశం కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ జాయింట్ సెక్రటరీ శ్రీ సమీర్ కుమార్ కూడా పాల్గొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2237297) సందర్శకుల సూచీ సంఖ్య : : 38
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी