సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
జ్ఞాన భారతం మిషన్
నాడు పోస్టు చేయడమైనది:
09 MAR 2026 3:22PM by PIB Hyderabad
జ్ఞాన భారతం మిషన్‌ను కేంద్ర బడ్జెట్ 2025-26లో ప్రకటించారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ (ఎంఓసీ) ప్రతిష్ఠాత్మకంగా చేప్టటిన ఈ కార్యక్రమం ద్వారా రాతప్రతుల వారసత్వాన్ని వెలికితీయటం, భద్రపరచటం, సంరక్షించటమే ప్రధాన లక్ష్యం.
ఈ కార్యక్రమానికి మద్దతిస్తూ, స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ (ఎస్ఎఫ్‌సీ) 2025-2031 సమయానికి గానూ రూ.491.66 కోట్ల నిధులను మంజూరు చేసింది. రాతప్రతులకు సంబంధించి సర్వే, నమోదు, పటిష్టమైన సాంకేతిక సదుపాయాలు, భాగస్వామ్య నిర్మాణం, డాక్యుమెంటేషన్, సంరక్షణ, డిజిటైజేషన్, రాతప్రతుల ప్రచురణలు, సామర్థ్య పెంపుదల, పరిశోధన వంటి కార్యకలాపాల కోసం ఈ నిధులను వినియోగిస్తారు.
2026-27 సంవత్సరానికి భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) బడ్జెట్ పెంపు ప్రతిపాదనకు సంబంధించి అంచనాల బిల్లు (2026-27)ను పార్లమెంటు ఆమోదించి.. రాష్ట్రపతి అంగీకరించాల్సి ఉంది.
అన్వేషణలు, తవ్వకాల సమయంలో భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) లైడార్, జీపీఆర్, డ్రోన్ సర్వే వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. రాజ్గిర్ (బీహార్), రాఖీగఢీ (హర్యానా), బిస్మక్‌నగర్ (అరుణాచల్ ప్రదేశ్), వరంగల్ కోట (తెలంగాణ) వంటి పురావస్తు ప్రదేశాల్లో తవ్వకాలు జరపటానికి ముందుగానే లైడార్, జీపీఆర్, డ్రోన్ సర్వేలు నిర్వహించారు.
అవసరానికి అనుగుణంగా తవ్వకానికి ముందే ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా కేంద్ర రక్షిత కట్టడాల వద్ద ఆక్రమణలను తొలగించటానికి కఠినమైన చట్ట, పాలనాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. తరచూ తనిఖీలు నిర్వహిస్తూ, అనధికారిక నిర్మాణాలు లేదా ఆక్రమణలను నిలిపివేయటానికి ఏఎస్ఐ నోటీసులు జారీ చేస్తుంది. పురాతన స్మారక చిహ్నాలు, పురావస్తు స్థలాలు, అవశేషాల చట్టం-1958, పురాతన స్మారక చిహ్నాలు, పురావస్తు స్థలాలు, అవశేషాల నియమావళి-1959లోని నిబంధనలతో పాటు, ప్రభుత్వ ప్రాంగణాల (అనధికార నివాసితుల తొలగింపు) చట్టం-1971 ప్రకారం తొలగింపు చర్యలు చేపట్టారు.
జాతీయ ప్రాముఖ్యత గల రక్షిత కట్టడాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అడాప్ట్ ఎ హెరిటేజ్ 2.0 కార్యక్రమం సెప్టెంబర్ 2023లో ప్రారంభమైంది. ఇందులో భాగంగా ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థలు, ఎన్జీఓలు, ట్రస్టులు, సొసైటీలతో భాగస్వామ్యం కుదుర్చుకోవటానికి పటిష్ఠమైన వ్యవస్థను రూపొందించారు. ఎంపిక చేసిన చారిత్రక కట్టడాల వద్ద పర్యాటకులకు అవసరమైన వసతులను అభివృద్ధి చేయటం ద్వారా ఆయా ప్రాంతాలను పర్యాటక అనుకూల ప్రదేశాలుగా మార్చటమే ఈ కార్యక్రమం ఉద్దేశం.
భాగస్వామ్య సంస్థలు, వాటాదారుల పాత్రను కేవలం పరిరక్షణేతర అంశాలకు మాత్రమే పరిమితం చేశారు. ఏఎస్ఐ మార్గదర్శకత్వంలో, సంప్రదింపులతో మాత్రమే స్మారక కట్టడాల ప్రాంగణాలను శుభ్రపరచటం, పర్యాటకులకు కనీస సౌకర్యాలైన మరుగుదొడ్లు, తాగునీరు, శిశు సంరక్షణ గదులు, బెంచీలు, నడక మార్గాలు, చెత్త కుండీలు, సూచిక బోర్డులు, ఎస్ఈఎల్ ప్రదర్శనలు, విద్యుద్దీకరణ వంటి పనులు చేపట్టటం లేదా నిర్వహించటం వంటివి చేస్తారు.
పురావస్తు పరిరక్షణకు సంబంధించిన పనులు, ఏఎస్ఐ నిపుణులు ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం కేవలం రక్షిత కట్టడాలు, ప్రదేశాల సంరక్షణకు మాత్రమే పరిమితమై ఉంటారు.
భారత జాతీయ ఆర్కైవ్స్ (ఎన్ఏఐ) అభిలేఖ్-పాటల్ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆర్కైవల్ రికార్డులను అందుబాటులోకి తీసుకురావటం ద్వారా దేశ డాక్యుమెంటరీ వారసత్వాన్ని సంరక్షించటానికి, ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చూసేందుకు వీలుగా భారీ డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఫిబ్రవరి 2026 నాటికి ఈ పోర్టల్‌లో రెఫరెన్స్ మీడియా 0.73 కోట్లు, డిజిటైజ్ రికార్డులు 0.38 కోట్లు, 18.23 కోట్లకు పైగా పేజీలు, 1,87,961 మంది సందర్శకులు, 35,167 మంది నమోదు చేసుకున్న వినియోగదారులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ఈ సమాచారాన్ని అందించారు.
***
(రిలీజ్ ఐడి: 2237293)
సందర్శకుల సూచీ సంఖ్య : : 83