|
బొగ్గు మంత్రిత్వ శాఖ
గని తవ్వకపు ప్రాంతాల రూపాంతరీకరణ: గనుల సుస్థిర పునర్వినియోగంలో ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ ప్రస్థానం
నాడు పోస్టు చేయడమైనది:
09 MAR 2026 3:57PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా నేలబొగ్గు (లిగ్నైట్) తవ్వకపు ప్రాజెక్టులలో క్రమబద్ధ గని పునరుద్ధరణ, పర్యావరణ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎల్‌సీఐఎల్) పలు విజయాలు సాధించింది. ఈ మేరకు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ పరిధిలోని ఈ నవరత్న హోదాగల సంస్థ సుస్థిర మైనింగ్, పర్యావరణ పునరుద్ధరణకు గణనీయ చర్యలు చేపట్టింది.
బాధ్యతాయుత మైనింగ్, పర్యావరణ సుస్థిరతపై దృష్టి సారిస్తూ తాము నేలబొగ్గు తవ్విన ప్రాంతాల్లో భారీ ఎత్తున భౌతిక-జీవ పునరుద్ధరణ కార్యక్రమాలను అమలు చేసింది. తవ్వకపు వ్యర్థాల (ఓవర్ బర్డెన్) గుట్టలు, గనులు తవ్విన గోతులు (బ్యాక్‌ఫిల్డ్ ల్యాండ్)ను క్రమపద్ధతిలో పునరుద్ధరించింది. అంతేకాకుండా వాటిని చక్కని పచ్చిక మైదానాలు, పర్యావరణ పార్కులు, జల వనరులు, ఉత్పాదక వ్యవసాయ మండలాలుగా రూపాంతరీకరించింది. తద్వారా గనుల తవ్వకపు ప్రాంతాలను పర్యావరణ, సామాజిక ప్రయోజనార్థం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం సాధ్యమని ఆచరణాత్మకంగా రుజువు చేసింది.
భారీ స్థాయిలో గనుల పునరుద్ధరణ
గనులు తవ్విన భూమిని పునరుపయుక్తంగా మార్చడంలో ‘ఎన్‌ఎల్‌సీఐఎల్’ చేపట్టిన కార్యక్రమాలు గణనీయ పునరుద్ధరణకు దోహదం చేశాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి తమ పరిధిలో గని తవ్వకపు ప్రాంతాల మొత్తం విస్తీర్ణాన్ని 6,571 హెక్టార్లుగా కంపెనీ పేర్కొంది. ఇందులో 3,236 హెక్టార్ల భూమిని భౌతికంగా, మరో 2,866 హెక్టార్ల భూమిని జీవశాస్త్ర పరంగా పునరుద్ధరించినట్లు నివేదించింది. ఇందులో భాగంగా తోటల పెంపకం కార్యకలాపాలు కూడా విస్తృతంగా చేపట్టి, గని తవ్వకపు ప్రాంతాల్లో 33.95 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపింది.
పర్యావరణ పర్యాటక కేంద్రాలుగా గని తవ్వకపు ప్రాంతాల సుందరీకరణ
నైవేలి వద్ద పునరుద్ధరించిన గని ప్రాంతాలన్నీ ఇప్పుడు పర్యావరణ పర్యాటక కేంద్రాలుగా సుందర రూపం సంతరించుకున్నాయి. ఇందులో భాగమైన ‘మైన్-1’ పర్యావరణ పర్యాటక పార్కును 2020 జూలై 23న మొక్కలు నాటే కార్యక్రమం (వృక్షారోపణ్ అభియాన్) కింద అప్పటి కేంద్ర హోం మంత్రి ప్రారంభించారు. అనంతరం ‘మైన్-2’ పార్కుకు 2021 ఆగస్టు 19న అప్పటి బొగ్గు-గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రారంభోత్సవం చేశారు.
గని తవ్వకపు గోతులను పర్యావరణ హిత నౌకా విహారానికి వీలుగా కృత్రిమ సరస్సుల తరహాలో తీర్చిదిద్దారు. అంతేకాకుండా పచ్చిక మైదానాలు, ఉద్యానాలు, పక్షుల వీక్షణ ప్రాంతాలు, జింకల ప్రాంగణాలు, నర్సరీలు, ‘మంచు మందిరాలు’ (మిస్ట్ చాంబర్)గా రూపొందించారు. వ్యర్థాల గుట్టలున్న ప్రదేశాలను వ్యవసాయ భూములుగా అభివృద్ధి చేశారు.
ఈ విధంగా ‘ఎన్‌ఎల్‌సీఐఎల్’ పరిధిలోని మైన్-1, 2 సహా గని తవ్వకపు భూములన్నీ నేడు క్రమంగా పర్యావరణ ఆవాసాలుగా రూపొందుతూ వివిధ రకాల వన్యప్రాణులను ఆకర్షిస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతాల్లోని కృత్రిమ సరస్సులు ఇప్పుడు దాదాపు 107 జాతుల వలస పక్షులకు ఆతిథ్యమిస్తున్నాయి. పునరుద్ధరించిన గని ప్రాంతాల పర్యావరణ సామర్థ్యాన్ని ఈ కార్యక్రమాలు ప్రతిబింబిస్తున్నాయి. ఇక్కడికొచ్చే పక్షి జాతులలో ఏషియన్ కోయెల్ (యూడినామిస్ స్కోలోపేసియా), బ్లాక్-హెడ్ మునియా (లోంచురా మలక్కా), బ్లాక్ కైట్ (మిల్వస్ మైగ్రాన్స్), ఏషియన్ ప్యారడైజ్ ఫ్లైక్యాచర్ (టెర్ప్సిఫోన్ పారడిసి), ఏషియన్ గ్రీన్ బీ-ఈటర్ (మెరోప్స్ ఓరియంటాలిస్), ఏషియన్ బ్రౌన్ ఫ్లైక్యాచర్ (మస్సికాపా డౌరికా) వంటివి కనిపిస్తాయి.
ఈ ప్రాంతాల్లో పర్యావరణ పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించే దిశగా 2022 అక్టోబరు 5న పాండిచ్చేరి టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో ‘ఎన్‌ఎల్‌సీఐఎల్’ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అటుపైన 2025 అక్టోబరు 2 నుంచి వారాంతాలు, సెలవు రోజులలో సందర్శకుల కోసం వీటిని ప్రారంభించారు.
వృక్షసంపద వృద్ధితో బాహ్య డంప్ ప్రదేశంలో పరచుకున్న పచ్చదనం
మరీచికోద్యానం: ప్రకృతి-పారిశ్రామిక ప్రగతి సంగమం
రాజస్థాన్‌లోని బీకానేర్ జిల్లా బార్సింగ్‌సర్‌లో “మరీచిక ఉద్యానం”: ఎడారి పర్యావరణ పార్కును ‘ఎన్‌ఎల్‌సీఐఎల్’ తీర్చిదిద్దింది. పారిశ్రామిక ప్రగతి, పర్యావరణ పరిరక్షణ సంయుక్త పురోగమనానికి ఇదొక స్ఫూర్తిదాయక నిదర్శనంగా నిలుస్తుంది. నేలబొగ్గు తవ్వకం, థర్మల్-సౌర విద్యుదుత్పత్తిని ఏకీకృతం చేస్తూ తమిళనాడు వెలుపల బార్సింగ్‌సర్ వద్ద ‘ఎన్‌ఎల్‌సీఐఎల్’ చేపట్టిన తొలి ప్రాజెక్టు ఇది. ఇక్కడ 2006లో మైనింగ్ కార్యకలాపాలు మొదలై, ఇంధనోత్పత్తికి గణనీయంగా దోహదం చేయగా, అదే సమయంలో పర్యావరణ పునరుద్ధరణకు కూడా కంపెనీ ప్రాధాన్యమిచ్చింది. అనంతరం తవ్వకపు భూముల భౌతిక పునరుద్ధరణ కార్యకలాపాలను 2016లో ప్రారంభించగా, 2019 నుంచి జీవశాస్త్ర పరంగా పునరుద్ధరణ ఊపందుకుంది. ఈ సుస్థిర, శాస్త్రీయ కృషితో దాదాపు 40 హెక్టార్లలో పచ్చదనం వెల్లివిరిసింది.
సుస్థిర ప్రగతి నిర్దేశిత దృక్కోణంలో భాగంగా ఈ ప్రాంతంలోని సుమారు 2 హెక్టార్ల విస్తీర్ణంలో ఒక పర్యావరణ ఉద్యానం రూపొందింది. కేంద్ర బొగ్గు-గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి 2024లో ఇక్కడ మొక్కల నాటే కార్యక్రమాన్ని ప్రారంభించినపుడు ఈ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో మరీచిక ఉద్యానం నేడు పర్యావరణ పునరుద్ధరణకు సజీవ ఉదాహరణగా నిలిచింది. ఇందులో పిల్లల వినోద సదుపాయాలు, బొటానికల్ గార్డెన్, పుష్పవనం, జల సమీకరణ నిర్మాణాలు, కార్మికుల విశ్రాంతి కోసం పర్యావరణ హిత గదులు వంటివి అందుబాటులో ఉన్నాయి. ఈ ఉద్యానం ఇప్పుడు ఖేజ్రీ, వేప, అమల్తాస్, శీషమ్ వగైరా 21 వృక్షజాతుల నిలయం కాగా, ఎడారి నేపథ్యంలో ఇవి ప్రకృతి పచ్చదనంతో ఆహ్లాదం కలిగిస్తున్నాయి.
సామాజిక ప్రయోజనార్థం గని నీటి నిల్వల వినియోగం
నైవేలిలో ఓపెన్-కాస్ట్ లిగ్నైట్ గనుల ప్రాంతంలో వర్షపాతం ఏటా సగటున 1200 మిల్లీమీటర్ల దాకా గణనీయంగా నమోదవుతుంది. ఈ నీటి వనరు సమర్థ నిర్వహణ కోసం ‘ఎన్‌ఎల్‌సీఐఎల్’ “సమగ్ర గని నీటి వినియోగ-వర్షజల సేకరణ వ్యవస్థ”ను నిర్మించింది. ఇందులో 191.458 హెక్టార్ల మేర 88 జల సేకరణ నిర్మాణాలున్నాయి. ఈ జలవనరు నుంచి రోజుకు 550 లక్షల లీటర్ల శుద్ధి చేసిన నీటిని గృహ-నీటిపారుదల ప్రయోజనాల కోసం పరిసరాల్లోని 40 గ్రామాలకు సరఫరా చేస్తారు. అంతేగాక తమిళనాడు నీటి సరఫరా-మురుగు పారుదల బోర్డుతో ఒప్పందం కింద రోజుకు 425.10 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. తద్వారా కడలూరు జిల్లాలోని 6 పట్టణ పంచాయతీలు, 625 గ్రామాల్లోని 7.91 లక్షల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతోంది.
గని వ్యర్థాలు నిర్మాణ సామగ్రిగా మార్పు
“వ్యర్థం నుంచి అర్థం” భావనను కూడా ‘ఎన్‌ఎల్‌సీఐఎల్’ ఆచరణలో పెట్టింది. ఈ మేరకు గని తవ్వకపు వ్యర్థాలను ఉపయుక్త నిర్మాణ సామగ్రిగా మారుస్తోంది. ఇందులో భాగంగా ‘సెంటర్ ఫర్ అప్లైడ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, ఐఐటీ-మద్రాస్ సంయుక్త సహకారంతో పరిశోధనలు నిర్వహించింది. దీంతో గని వ్యర్థాల (ఓవర్ బర్డెన్)లో 40 నుంచి 60 శాతాన్ని ఇసుక రూపంలో పొందవచ్చని తేలింది.
ఈ పరిశోధన ఫలితాలకు అనుగుణంగా గని వ్యర్థాల నుంచి నిర్మాణ కార్యకలాపాలకు అవరసమైన ఇసుక ఉత్పత్తి కోసం నైవేలి గనులలో ‘పైలట్ ఎం’ పేరిట వ్యర్థాల శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఈ మేరకు 2024 జనవరిలో ‘మైన్-1ఎ’ కింద ఏటా 2.62 ఎల్‌ఎం³ సామర్థ్యంతో ఒక ఓవర్‌బర్డెన్ ప్రాంతం నుంచి ఇసుక ప్లాంటు పనిచేయడం మొదలైంది. ఆ తర్వాత 2026 ఫిబ్రవరిలో ‘మైన్-1’లో ఏటా 6.25 ఎల్‌ఎం³ సామర్థ్యంగల మరొక ప్లాంటు ప్రారంభమైంది. సుస్థిర నిర్మాణ కార్యకలాపాల కోసం ఓవర్‌బర్డెన్ నుంచి ఎం-శాండ్ ఉత్పత్తి దిశగా కాలుష్య రహిత కార్యక్రమానికి మార్గనిర్దేశం చేసేందుకు ‘సీఫ్లో సంస్థతో ‘ఎన్‌ఎల్‌సీఐఎల్’ భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది.
మైన్ -1ఎ ఓవర్ బర్డెన్ నుంచి ఎం-శాండ్ ఉత్పత్తి చేసే ప్లాంటు
భూసార పునరుద్ధరణ – అత్యాధునిక వ్యవసాయానికి ప్రోత్సాహం
పునరుద్ధరించిన గని ప్రాంతాలలో భూసారం మెరుగు దిశగా ‘ఎన్‌ఎల్‌సీఐఎల్’ వినూత్న వ్యవసాయ పద్ధతులను అమలు చేస్తోంది. ఈ మేరకు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) సహకారంతో పాలీహౌస్‌లలో హైడ్రోపోనిక్ సాగుకు శ్రీకారం చుట్టింది. నీటి పొదుపు సహిత వ్యవసాయంలో భాగంగా ఇజ్రాయెల్ బిందుసేద్య సాంకేతికతను కూడా అనుసరిస్తోంది.
సహజ ఎరువుతో నేలను సుసంపన్నం చేయడంలో భాగంగా దేశీయ పశుగణంతో పశుపోషణ ద్వారా నేల జీవోద్ధరణను ప్రోత్సహించింది. ఈ చర్యల ద్వారా బంజరుగా మారిన ఓవర్‌బర్డెన్ ప్రదేశాలను ఉత్పాదక వ్యవసాయ భూమిగా మార్చింది.
కాలుష్య నివారణ కార్యక్రమాల విస్తరణ
గనుల సుస్థిర పునరుద్ధరణలో భాగంగా మొక్కల పెంపకం, పర్యావరణ అవగాహన కార్యక్రమాలను ‘ఎన్‌ఎల్‌సీఐఎల్’ నిర్వహిస్తోంది. ఈ మేరకు 2020 నుంచి మొక్కలు నాటే కార్యక్రమం కింద 6,45,000 మొక్కల పంపిణీ, నాటడం నిర్వహించారు.
పరిశుభ్రత కార్యకలాపాలలో కృషికిగాను ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థల స్థాయిలో ‘స్వచ్ఛత పఖ్వాడా’ కింద ‘ఎన్‌ఎల్‌సీఐఎల్’ ప్రథమ బహుమతి పొందింది. స్వావలంబన దిశగా గాంధీజీ సిద్ధాంతానికి ప్రాచుర్యం కల్పించే ప్రత్యేక కార్యక్రమం 4.0 కింద “ప్రజా ప్రయోజనార్థం వ్యర్థాలను అర్థంగా మార్చడం”పై దృష్టి సారిస్తూ ఈ వినూత్న కార్యకలాపాలను చేపట్టింది.
ఇందులో భాగంగా నైవేలిలోని మైన్-1 పరిధిలో 1.25 ఎకరాల విస్తీర్ణంలో తీర్చిదిద్దిన “పొదిగై హెర్బల్ పార్కు”ను 2024 అక్టోబరు 30న ప్రారంభించారు. ఈ ఉద్యానంలో దాదాపు 38 రకాల ఔషధ మొక్కలను పెంచుతున్నారు. వ్యాధుల చికిత్సలో సాధారణ మొక్కల నుంచి లభించే ఔషధ ప్రయోజనాలపై అవగాహన కల్పించడం దీని లక్ష్యం.
అలాగే, మైన్-2 వద్ద నేల ఎత్తుపల్లాలను చదును చేసి, దాదాపు 109 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించిన తర్వాత ‘లిగ్నైట్ గార్డెన్’ను ఏర్పాటు చేశారు. పూర్తిగా పునరుద్ధరించిన ఈ ప్రదేశంలో ఇప్పుడు అంబులెన్స్ పార్కింగ్, ఎఫ్‌ఎం యార్డ్ మినీ రిపేర్ షెడ్, సోలార్ ప్లాంటు ఉన్నాయి. అంతేకాకుండా పునరుద్ధరించిన ప్రదేశంలో 8,15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొబ్బరి తోటను ఏర్పాటు చేశారు.
రాజస్థాన్‌లోని బార్సింగ్‌సర్ ప్రాజెక్టులో లోగడ నిరుపయోగంగా మిగిలిన 6,700 చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు 6,000 మొక్కలతో ‘లిగ్నైట్ శక్తి నగర్ నర్సరీ’ని ఏర్పాటు చేశారు.
‘వ్యర్థం నుంచి అర్థం’ ఇతివృత్తం కింద లోహపు చెత్తతో సృష్టించబడిన శిల్పాలను కూడా ఏర్పాటు సంస్థ ఏర్పాటు చేసింది. వీటిలో కడలూరులోని “త్రీ ఫేసెస్”, చెన్నైలోని “నెమలి”, న్యూఢిల్లీలోని “జై హింద్ చక్ర”, ‘ఎన్‌ఎల్‌సీఐఎల్’ ఆర్చ్ గేట్ వద్ద “మైనర్ రీడింగ్ బుక్” విశేష ప్రాచుర్యం పొందాయి.
సుస్థిర మైనింగ్‌కు మద్దతు
సుస్థిర మైనింగ్, పర్యావరణ పునరుద్ధరణ, తవ్వకపు భూమి ఉత్పాదక పునర్వినియోగం తదితరాలను ప్రోత్సహించే కేంద్ర ప్రభుత్వ విస్తృత దృక్కోణానికి అనుగుణంగా ‘ఎన్‌ఎల్‌సీఐఎల్’ చేపట్టిన పర్యావరణ, సామాజిక హిత కార్యకలాపాలు సత్ఫలితాలిచ్చాయి.
బాధ్యతాయుత మైనింగ్, పర్యావరణ పరిరక్షణకు సమ ప్రాధాన్యంతో గనుల తవ్వకపు ప్రదేశాలను సుందర ప్రకృతి దృశ్యాలకు నెలవుగా మార్చి, పచ్చదనం నింపడమేగాక ఉత్పాదక, సమాజ ఉపయుక్త పర్యావరణ వ్యవస్థలుగా వాటిని రూపొందించవచ్చునని ‘ఎన్‌ఎల్‌సీఐఎల్’ తన కార్యక్రమాల ద్వారా రుజువు చేసింది.
***
(రిలీజ్ ఐడి: 2237292)
|