గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
తిరువనంతపురంలో అధునాతన పట్టణ పారిశుద్ధ్యానికి ఊతమిస్తున్న ఏఐ రోబోట్
నాడు పోస్టు చేయడమైనది:
06 MAR 2026 1:04PM by PIB Hyderabad
స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 కింద అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాల్లోని కాలువలను సురక్షితంగా, ఖచ్చితంగా, మానవ ప్రమేయం లేకుండా శుభ్రం చేయడం కోసం ఏఐ ఆధారిత జీ-స్పైడర్ రోబోట్‌ను తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ వినియోగంలోకి తీసుకొచ్చింది.
మనుషుల ద్వారా వ్యర్థాలను తొలగించే పద్ధతిని పూర్తిగా నిర్మూలించడానికి, ప్రమాదకరమైన, చేరుకోలేని ప్రాంతాలలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల భద్రతను నిర్ధారించడానికి తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఒక కీలక ముందడుగు వేసింది. ఇందులో భాగంగా తంపానూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని అమాయిజాంచన్ కాలువ వద్ద కృత్రిమ మేధతో పనిచేసే ‘జీ స్పైడర్’ అనే రోబోటిక్ వ్యవస్థను ప్రవేశపెట్టింది.
అమాయిజాంచన్ కాలువ ముఖ్యంగా తంపానూర్ రైల్వే స్టేషన్ కింద ఉన్న మూసివేసిన భాగం. శుభ్రం చేయడం చాలా సవాలుతో కూడుకున్న పని. ఎత్తు తక్కువగా ఉండటం, నిరంతర నీటి ప్రవాహం, ఇరుకైన పని పరిస్థితులు మనుషులు సురక్షితంగా లోపలికి వెళ్లే మార్గాలు లేకపోవడం వల్ల సాధారణ పద్ధతుల్లో దీనిని తరుచూ శుభ్రం చేయడం, నిర్వహించడం అత్యంత కష్టతరంగా మారింది.
ఈ అడ్డంకులను అధిగమించడానికి స్థానిక స్వపరిపాలన శాఖ మంత్రి శ్రీ ఎంబీ రాజేష్ కృత్రిమ మేధతో పనిచేసే ఈ రోబోటిక్ కెనాల్ క్లీనింగ్ వ్యవస్థను ప్రారంభించారు. ఈ కార్యక్రమం తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్, టెక్నోపార్క్‌కు చెందిన జెన్‌రోబోటిక్ ఇన్నోవేషన్స్ (ప్రసిద్ధ ‘బాండికూట్’ రోబోల తయారీదారులు) మధ్య కుదిరిన ఉమ్మడి భాగస్వామ్యాన్ని సూచిస్తుంది.
ఈ అధునాతన రోబోటిక్ వ్యవస్థ ప్రవేశపెట్టడం వల్ల కార్మికులు ప్రమాదకరమైన, అపరిశుభ్రమైన వాతావరణంలోకి వెళ్లాల్సిన అవసరం పూర్తిగా తప్పుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం వ్యర్థాల నిర్వహణలో పని సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, భద్రతా ప్రమాణాలను గణనీయంగా బలోపేతం చేసే ఒక విప్లవాత్మక చర్యగా వారు పేర్కొన్నారు.
జెన్‌రోబోటిక్ ఇన్నోవేషన్స్ రూపొందించిన జీ స్పైడర్, కాలువను శుభ్రపరిచే స్వయంచాలక రోబో. దీనిని సంక్లిష్టమైన, ప్రమాదకర కాలువ పరిసరాల్లో మనుషులు వెళ్లి పని చేయలేని చోట శుభ్రపరిచేందుకు రూపొందించారు. కేబుల్ డ్రైవెన్ ప్యారలల్ రోబోటిక్స్ ఆర్కిటెక్చర్‌పై రూపొందించారు. కృత్రిమ మేధ ఆధారిత విజన్, సెన్సార్ ఇంటెలిజెన్స్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది పేరుకుపోయిన వ్యర్థాలను ఖచ్చితంగా గుర్తించి, అంచనా వేసి, తొలగించడానికి వీలు కల్పిస్తుంది.
అధునాతన యంత్ర సాంకేతికతను ఉపయోగించి ఈ వ్యవస్థ వ్యర్థాల రకాలను, నీటి ప్రవాహ పరిస్థితులను నిర్మాణపరమైన సవాళ్లను స్వయంప్రతిపత్తంగా గుర్తించి, తదనుగుణంగా తక్షణమే మారుతుంది. ఐదు-డిగ్రీల-స్వేచ్ఛ కలిగిన దీని రోబోటిక్ యంత్రాంగం, జీవక్రియలను పోలి ఉండే బయోమిమెటిక్ క్లా-టైప్ గ్రాబర్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది మిశ్రమ అసమాన వ్యర్థాలను ఖచ్చితమైన స్థానంలో పట్టుకోవడానికి సురక్షితంగా తరలించడానికి సహాయపడుతుంది. సేకరించిన వ్యర్థాలను నేరుగా నిర్దేశించిన వాహనాల్లోకి మళ్లిస్తుంది. దీనివల్ల వ్యర్థాల గుర్తింపు నుంచి సురక్షితమైన విసర్జన వరకు మొత్తం ప్రక్రియ మానవ ప్రమేయం లేకుండా పూర్తవుతుంది.
తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ అమల్లోకి తీసుకొచ్చిన జీ స్పైడర్ ఏఐ ఆధారిత రోబోటిక్ వ్యవస్థ.. పట్టణ పారిశుద్ధ్య రంగంలో ఒక విప్లవాత్మక మార్పును సూచిస్తుంది. కాలువల శుభ్రతను ఆటోమేషన్ చేయడం ద్వారా ఈ రోబో పారిశుద్ధ్య కార్మికులకు విష వాయువులు, కలుషిత నీరు, ప్రమాదకర వ్యర్థాలతో నేరుగా సంబంధం లేకుండా చేసి, వారి భద్రతను గణనీయంగా పెంచుతుంది. నీటి మట్టం ఎక్కువగా ఉన్నప్పుడు నిరంతర ప్రవాహం ఉన్న పరిస్థితుల్లో కూడా సమర్థవంతంగా పనిచేసేలా రూపొందించిన జీ స్పైడర్.. పట్టణ నీటి మార్గాల నిర్వహణ ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం కొనసాగేలా చూస్తుంది. ఇది ప్లాస్టిక్, పదునైన వస్తువులు, ఇతర హానికరమైన పదార్థాలతో కూడిన మిశ్రమ, ప్రమాదకర వ్యర్థాలను సురక్షితంగా బయటకు తీయగలదు. తద్వారా పారిశుద్ధ్య ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. క్రమబద్ధమైన, వ్యవస్థీకృత శుభ్రత ద్వారా ఈ రోబో డ్రైనేజీ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. ఇది పట్టణ వరదలను నివారించడంలో, నగరాన్ని శుభ్రంగా, సురక్షితంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
జీ స్పైడర్ ఆటోమేటెడ్ కెనాల్ క్లీనింగ్ రోబోట్ విస్తరణ సురక్షితమైన, యంత్రీకమైన, సాంకేతికతతో కూడిన కాలువల నిర్వహణ దిశగా ఒక నిర్ణయాత్మక మార్పును సూచిస్తుంది. కార్మికులు ప్రమాదకరమైన వాతావరణంలోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయడం ద్వారా ఈ కార్యక్రమం పారిశుద్ధ్య కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పిస్తుంది. పని సామర్థ్యాన్ని పెంచుతుంది. స్థిరమైన పట్టణ మౌలిక సదుపాయాల వ్యవస్థలను బలోపేతం చేస్తుంది. విస్తరించదగిన, అనుసరణీయమైన నమూనాగా నిలుస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర అధిక ముప్పు కలిగిన కాలువలు, డ్రైనేజీ వ్యవస్థలో సాంకేతికతను అమలు చేయడానికి ఈ జీ స్పైడర్ ఒక బలమైన ఉదాహరణగా నిలుస్తుంది.
స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఇటువంటి సాంకేతిక ఆధారిత చర్యలు పట్టణ పారిశుద్ధ్య వ్యవస్థలను ఆధునీకరించడానికి రాష్ట్రాలు కొత్త ఆవిష్కరణలను ఏ విధంగా స్వీకరిస్తాయో ప్రతిబింబిస్తాయి. అదే సమయంలో పారిశుద్ధ్య కార్మికుల గౌరవం, భద్రత, శ్రేయస్సుకు ఇవి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2235948)
సందర్శకుల సూచీ సంఖ్య : : 64