రక్షణ మంత్రిత్వ శాఖ
ఏఎల్‌హెచ్ ఎంకే -II (ఎంఆర్) & వీఎల్-ష్టిల్ క్షిపణుల కోసం రూ. 5,083 కోట్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకున్న రక్షణ మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
03 MAR 2026 3:22PM by PIB Hyderabad
భారతీయ కోస్తాతీర రక్షక దళం అవసరాలను తీర్చడానికి ఉద్దేశించిన అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్లు (ఏఎల్‌హెచ్) ఎంకే -II (మారిటైమ్ రోల్..ఎంఆర్) రకానికి చెందినవి ఆరింటితో పాటు, భారతీయ నౌకాదళం కోసం సర్ఫేస్-టు-ఎయిర్ వెర్టికల్ లాంచ్ - ష్టిల్ క్షిపణులను సేకరించడానికి మొత్తం రూ. 5,083 కోట్లు ఖర్చయ్యే ఒప్పందాల్ని రక్షణ శాఖ 2026 మార్చి 3న కుదుర్చుకుంది.
రక్షణ శాఖ కార్యదర్శి శ్రీ రాజేశ్ కుమార్ సింగ్ సమక్షంలో న్యూఢిల్లీలోని సౌత్ బ్లాకులో ఈ ఒప్పందాలపై సంతకాలయ్యాయి.
ఏఎల్‌హెచ్ ఎంకే -II (ఎంఆర్)
ఏఎల్‌హెచ్ ఎంకే -II (ఎంఆర్) ఒప్పందం విలువ రూ.2,901 కోట్లు. దీనిలో సామగ్రి, ఇంజినీరింగ్ పరంగా సహాయక ప్యాకేజీ, పనితీరు ఆధారిత లాజిస్టిక్స్ సహాయం కలిసి ఉంటాయి. బై (భారత్‌లోనే రూపకల్పన, అభివృద్ధితో పాటు తయారీని పూర్తిగా చేపట్టే) కేటగిరీలో భాగంగా బెంగళూరు సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌తో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
జంట ఇంజన్లతో రూపుదిద్దుకొనే ఈ హెలికాప్టర్లకు ప్రస్తుతం గగనతలం నుంచి పనిచేస్తున్న వేదికల కన్నా అత్యధునాతన ఫీచర్లను జోడిస్తారు. ఈ హెలికాప్టర్లు సముద్రంలో ఉండే నౌకల నుంచే కాకుండా, తీర ప్రాంత విమానాశ్రయాల నుంచి కూడా చేపట్టే నౌకావాణిజ్య భద్రతా మిషన్లకు అండదండలను అందించ గలవు. భిన్నమైన మానవ నిర్మిత దీవులతో పాటు తీరానికి ఆవలి ఇన్‌స్టాలేషన్ల భద్రత, పరిరక్షణ కర్తవ్యాల్ని నిర్వర్తించడంలో భారతీయ కోస్తాతీర రక్షకదళం సామర్థ్యం ఈ హెలికాప్టర్ల చేరికతో ఇప్పటి కన్నా చెప్పుకోదగిన స్థాయిలో మెరుగు పడనుంది. అంతేకాదు.. మత్స్యకారుల్నీ, నౌకావాణిజ్య సంబంధిత పర్యావరణాన్నీ కూడా మరింత పక్కాగా పరిరక్షించవచ్చు.
ఈ ప్రాజెక్టులో భాగంగా 200 కన్నా ఎక్కువ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (ఎంఎస్ఎంఈస్) నుంచి సామగ్రిని సరఫరా చేసుకుంటారు. దీంతో దాదాపు 65 లక్షల పనిదినాల మేరకు ఉపాధిని కల్పించవచ్చు. ఈ ఒప్పందం దేశ నౌకావాణిజ్య భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ, మరో వైపు ఆత్మనిర్భర్ భారత్, భారత్‌లో తయారీలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తుంది.
నిట్టనిలువుగా ప్రయోగించదగ్గ ష్టిల్ క్షిపణులు
ఉపరితలం నుంచి గాలి లోకి నిట్టనిలువుగా ప్రయోగించడానికి అనువుగా ఉండే ష్టిల్ క్షిపణులతో పాటు సంబంధిత మిసైల్ హోల్డింగ్ ఫ్రేముల కొనుగోలుకు ఉద్దేశించిన ఈ ఒప్పందాన్ని కార్యరూపంలోకి తీసుకు రావడానికి రూ.2,182 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ ఒప్పందాన్ని రష్యన్ సమాఖ్యకు చెందిన జేఎస్‌సీ రొసోబోరోన్‌ఎక్స్‌పోర్ట్‌తో కుదుర్చుకున్నారు. గగనతలంలో అనేక విధాలైన బెదరింపులు ఎదురయ్యే సందర్భాల్లో, ముందువరుసలో నిలిచి పోరాడే యుద్ధనౌకల వాయు రక్షణ సామర్థ్యాల్ని గణనీయంగా పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో ఈ క్షిపణుల్ని సమకూర్చుకుంటున్నారు.
భారతీయ నౌకాదళ వేదికల్లో గగనతల రక్షణకు అంచెలవారీగా తోడ్పడే వేదికలకు తక్షణ ప్రతిచర్య, అన్ని రకాలైన వాతావరణంలోనూ కార్యరంగంలోకి దూకగలగడం, సవాళ్లతో కూడిన నౌకావాణిజ్య స్థితులలో మెరుగైన ఆధిక్యాన్ని సొంతం చేసుకోవడానికి ఈ క్షిపణి వ్యవస్థ పక్కాగా దోహద పడుతుంది. భారత్, రష్యాల మధ్య పరస్పర నమ్మకం, వ్యూహాత్మక పొందికల పునాదులపై ఏర్పడి దీర్ఘకాలంగా కొనసాగుతూ, కాల పరీక్షకు తట్టుకొని నిలిచిన రక్షణ రంగ భాగస్వామ్యానికి ఉన్న ప్రాధాన్యాన్ని ఈ ఒప్పందం మరో సారి చాటి చెబుతోంది.
***
(రిలీజ్ ఐడి: 2235150)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7