రక్షణ మంత్రిత్వ శాఖ
ఓమన్‌కు తొలి విదేశీ యాత్ర విజయవంతంగా పూర్తి చేసిన ఐఎన్ఎస్‌వీ కౌండిన్య.. స్వాగతం పలికిన కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి
నాగరికతా పరమైన ఆత్మవిశ్వాసానికి మూలంగా నిలిచే సాహసయాత్రని, నవకల్పనని అనుసరించాల్సిందిగా
యువతను ప్రోత్సహించిన శ్రీ సంజయ్ సేథ్
నాడు పోస్టు చేయడమైనది:
02 MAR 2026 6:38PM by PIB Hyderabad
భారతీయ నౌకాదళం కోసం సాంప్రదాయిక పద్ధతిలో నిర్మించిన తెరచాప ఓడ (ఇండియన్ నావల్ సెయిలింగ్ వెసల్..ఐఎన్ఎస్‌వీ) కౌండిన్యకు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేథ్ 2026 మార్చి నెల 2న ముంబయిలోని నావల్ డాక్‌యార్డులో స్వాగతం పలికారు. ఈ ఓడ ఓమన్ లోని మస్కట్‌కు తన మొదటి సముద్రయానాన్ని విజయవంతంగా పూర్తి చేసి స్వదేశానికి తిరిగివచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టుకు ఉన్న జాతీయ ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు.. భారత ప్రాచీన సముద్ర జ్ఞాన వ్యవస్థల పునరుద్ధరణకు ఐఎన్ఎస్‌వీ కౌండిన్య ఒక ప్రతీకగా ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్టు దేశ యువతకు ప్రేరణను ఇస్తుందని ఆయన అన్నారు. ఈ యాత్రలో ప్రదర్శించిన సాహసం, ధీరత్వం, తిరిగి కనుగొనాలనే తపనలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, మన నాగరికతలో భాగమైన ఆత్మవిశ్వాసంపై ఆధారపడిన సాహసిక, నవకల్పనల్ని అక్కున చేర్చుకోవాల్సిందిగా దేశ యువతను ప్రోత్సహించారు.
పశ్చిమ నౌకాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ మాట్లాడుతూ,
సాంప్రదాయిక పద్ధతిని అనుసరించి నిర్మించిన ఓడను అరేబియా సముద్రంలో విజయవంతంగా నడపడంలో ఓడను నడిపిన సిబ్బంది అసాధారణ అంకిత భావాన్ని, వృత్తి నైపుణ్యాన్ని కనబరిచారని ప్రశంసించారు. ఓడలో ప్రయాణాన్ని చేపట్టాలన్న ఆలోచనను చేయడంతో పాటు అనుసంధానం మొదలు డిజైను.. సాంప్రదాయిక నిర్మాణాన్ని అనుసరించడం.. ఓడను నడిపే సిబ్బందికి సుశిక్షణను ఇవ్వడం.. సముద్రయానాన్ని పూర్తి చేయడం వరకు అన్ని ప్రక్రియల్లోనూ అలుపెరుగని శ్రమ ఇమిడి ఉందని ఆయన వివరించారు.
ఆధునిక నిర్మాణాత్మక పటిష్ఠీకరణ జోలికి పోకుండానే, చతురస్రాకార తెరచాపను కలిగి ఉండే, చెక్కలతో తీర్చిదిద్దిన నౌకను నడపటానికి అసాధారణ ప్రణాళిక, నావికా కౌశలం, బృంద స్ఫూర్తి తో పాటు సహన శక్తి కూడా అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో, ఈ యాత్రను ఫలప్రదంగా ముగించడం భారతీయ నౌకాదళం సాధించిన ఓ ప్రశంసనీయ సాఫల్యమని చెప్పవచ్చు.
ఐఎన్ఎస్‌వీ కౌండిన్య లాంఛనంగా ప్రవేశించగానే రంగురంగుల తెరచాపల కవాతుతో, సాంప్రదాయిక నీటి విల్లుతో వందనం చేస్తూ దానికి స్వాగతం పలికారు. దీంతో ఓడరేవులో అద్భుత, భావోద్వేగపూరిత వాతావరణం నెలకొన్నది. ఈ కార్యక్రమ నిర్వహణ భారత నౌకా వాణిజ్య వారసత్వానికి గర్వకారణంగా నిలవడమే కాకుండా ఓడను నడిపిన సిబ్బంది సాధించిన విజయానికి దక్కిన ప్రశంసలకు ఒక నిదర్శనంగా కూడా నిలిచింది.
ఈ కార్యక్రమంలో ముంబయిలో ఒమన్ కాన్సుల్ జనరల్‌గా ఉన్న శ్రీ మహబూబ్ ఈసా అల్‌రైసీ, సీనియర్ అధికారులు, మాజీ సైనికులు, హోడీ ఇన్నొవేషన్స్ ప్రతినిధులు, పౌర సమాజంలోని ప్రముఖ సభ్యులు, నౌకావాణిజ్య సముదాయ సభ్యులు, చరిత్రకారులతో పాటు సముద్రయానంపై ఆసక్తి ఉన్న వారు కూడా పాల్గొన్నారు.
భారతీయ నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్‌వీ కౌండిన్య 20 మీటర్ల పొడవుతో ఉంది. ఇది సాంప్రదాయిక పద్ధతుల్లో నిర్మాణం పూర్తి చేసిన ఓడ. అజంతా గుహల్లో దొరికిన 5వ శతాబ్దికి చెందిన ఒక కళాకృతిని స్ఫూర్తిగా తీసుకొని మరీ దీనికి రూపకల్పన చేశారు. ప్రాచీన భారతీయ నౌకా నిర్మాణ మెలకువల్ని (కలప పలకలను కొబ్బరి తాళ్లతో కట్టి సహజమైన జిగురుతో సీలు వేసే పని వంటి విధానాలు) ఉపయోగించి రూపుదిద్దిన ఈ ఓడ భారత సమృద్ధ సముద్ర వారసత్వ పునరుద్దరణకు ఒక ప్రతీకగా ఉంది. 2025 మే నెలలో నౌకాదళంలో చేరిన ఈ ఓడకు ప్రముఖ నావికుడు కౌండిన్య పేరును పెట్టారు. ఈ ఓడ హిందూ మహాసముద్రంలో భారత చరిత్రాత్మక నౌక వాణిజ్య సంప్రదాయాలు, నాగరికత పరమైన సంబంధాలకు ఒక సంకేతంగా అలరారుతోంది.
***
(రిలీజ్ ఐడి: 2235030)
సందర్శకుల సూచీ సంఖ్య : : 36