గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
30కి పైగా గిరిజన కళారూపాలు, 75 మంది గిరిజన కళాకారులు, 1,000 కళాకృతులతో గిరిజన కళా ఉత్సవం (ట్రైబ్స్ ఆర్ట్ ఫెస్ట్) 2026ని ప్రారంభించిన కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ జువల్ ఓరం
సంప్రదాయ కళారూపాల నుంచి ఆధునిక కళ వరకు చిత్రలేఖనంలో శతాబ్దాలుగా మార్పు…
అంతరించిపోయే స్థితిలో ఉన్న గిరిజన కళలను ప్రోత్సహించడం, సంరక్షించడంతో పాటు గిరిజన అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లేందుకు మంత్రిత్వ శాఖ కృషి: శ్రీ జుయల్ ఓరం
న్యూఢిల్లీ కె.జీ. మార్గ్ లోని ట్రావెన్కోర్ ప్యాలెస్ లో ఈ నెల13 వరకు ప్రదర్శన
నాడు పోస్టు చేయడమైనది:
02 MAR 2026 8:59PM by PIB Hyderabad
గిరిజన కళలు, భాషలు, సంప్రదాయాలు భారత సజీవ నాగరికత వారసత్వమని అనేకసార్లు పేర్కొన్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశ రాజధానిలో ట్రైబ్స్ ఆర్ట్ ఫెస్ట్ (టీఏఎఫ్) 2026 ను నిర్వహిస్తోంది.
ట్రావెన్కోర్ ప్యాలెస్‌లో 12 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాన్ని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ జుయల్ ఓరం ఈ రోజు ప్రారంభించారు. గిరిజన తెగల ఆర్థిక స్వాతంత్ర్యంతోపాటు వారి వారసత్వ సంపదను కాపాడటానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
సంగీత నాటక అకాడమీ సభ్యులు ఆలపించిన వందేమాతరం గీతంతో ఈ వేడుక ప్రారంభమైంది. భారత వాణిజ్య, పారిశ్రామిక మండలుల సమాఖ్య (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ - ఎఫ్ఐసీసీఐ), నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ (ఎన్జీఎంఏ) సమన్వయంతో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ప్రదర్శన ఏర్పాటు చేసింది. భారత గిరిజన దృశ్య సంస్కృతిని ప్రదర్శించే అత్యంత సమగ్రమైన జాతీయ ప్రదర్శనలలో ఒకటిగా ఈ ఉత్సవం 30కి పైగా గిరిజన కళా సంప్రదాయాలకు ప్రాతినిధ్యం వహించే 75 మందికి పైగా గిరిజన కళాకారులను, 1,000కి పైగా కళాఖండాలను ఒకే చోటికి చేర్చింది.
గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ దుర్గాదాస్ ఉయికే, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి రంజన చోప్రా, అదనపు కార్యదర్శి శ్రీ మనీష్ ఠాకూర్, సంయుక్త కార్యదర్శి శ్రీ అనంత్ ప్రకాష్ పాండే, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సంజీవ్ కిషోర్ గౌతమ్, ఫిక్కీ ఎఫ్ఎల్ఓ అధ్యక్షురాలు, ఆయుర్వేదంట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సుశ్రీ పూనమ్ శర్మ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారిక టీఏఎఫ్ కేటలాగ్‌ను ఆవిష్కరించారు. ఇందులో ఉత్సవంలోని కళాకారులు, కళా సంప్రదాయాలు, కళాఖండాల గురించిన సమగ్ర సమాచారాన్ని పొందుపరిచారు. ట్రైబ్స్ ఆర్ట్ ఫెస్ట్ 2026 అధికారిక ప్రారంభోత్సవంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా ఈ ఉత్సవం ఉద్దేశం, విస్తృతి, కళాత్మక వైవిధ్యాన్ని ప్రతిబింబించే టీఏఎఫ్ ప్రారంభ వీడియోను కూడా విడుదల చేశారు. సాంస్కృతిక విభాగంలో భాగంగా, మేఘాలయలోని షిల్లాంగ్‌కు చెందిన ఖ్మి క్రియేటివ్ సొసైటీ గిరిజన సంగీత సంప్రదాయాలను అద్భుతంగా ప్రదర్శించింది. గిరిజన లయలు, వాద్యాలను శక్తిమంతమైన దేశభక్తి, సమకాలీన వ్యక్తీకరణలతో మేళవించి వారు ఇచ్చిన ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ జుయల్ ఓరం మాట్లాడుతూ, సాంస్కృతిక పరిరక్షణను సామాజిక, ఆర్థిక అభివృద్ధితో అనుసంధానిస్తూ, గిరిజన సాధికారత కోసం తమ మంత్రిత్వ శాఖ ఒక సమగ్ర విధానాన్ని అనుసరిస్తోందని పేర్కొన్నారు. ప్రత్యేకంగా బలహీనమైన గిరిజన సమూహాల (పీవీటీజీ) కోసం ప్రధానమంత్రి జన్ మన్, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందరికీ చేరేలా చూసేందుకు డీఏజేజీయూఏ, నాణ్యమైన విద్య కోసం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల విస్తరణ, ట్రైఫెడ్ ద్వారా మార్కెట్ అనుసంధానాలను బలోపేతం చేయడం వంటి ప్రధాన కార్యక్రమాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ట్రైబ్స్ ఆర్ట్ ఫెస్ట్ వంటి వేదికలు కేవలం ప్రతీకాత్మక వేడుకలుగా మాత్రమే మిగిలిపోకుండా, ఒక వ్యవస్థీకృత మార్కెట్ వ్యవస్థను సృష్టిస్తాయని ఆయన చెప్పారు. ఈ వేదికలు కళాకారులను కలెక్టర్లు, గ్యాలరీలు, కార్పొరేట్ సంస్థలు, డిజైన్ ఇన్‌స్టిట్యూట్లు, సాధారణ పౌరులతో అనుసంధానిస్తాయని, తద్వారా సాంస్కృతిక వారసత్వాన్ని స్థిరమైన, గౌరవప్రదమైన జీవనోపాధిగా మారుస్తాయని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర గిరిజన వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ దుర్గాదాస్ ఉయికే మాట్లాడుతూ, గిరిజన తెగలు తమ వారసత్వాన్ని, కళాత్మక నైపుణ్యాన్ని తమదైన శైలిలో ప్రదర్శించుకోవడానికి ఇటువంటి ఉత్సవాలు ఒక ప్రామాణికమైన వేదికను కల్పిస్తాయని అభిప్రాయపడ్డారు. కళాకారులు, వివిధ సంస్థల మధ్య జరిగే ఈ పరస్పర సమన్వయం వారి సాంస్కృతిక ఆత్మవిశ్వాసాన్ని బలపరచడమే కాకుండా, వారి గుర్తింపును కూడా పెంచుతుందని ఆయన పేర్కొన్నారు. గిరిజన సమాజానికి యాజమాన్య హక్కులతో కూడిన గౌరవప్రదమైన జీవనోపాధి అవకాశాలను ఇది సృష్టిస్తుందని ఆయన వివరించారు.
గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి రంజన చోప్రా మాట్లాడుతూ, ట్రైబ్స్ ఆర్ట్ ఫెస్ట్ అనేది గిరిజన కళల ప్రోత్సాహాన్ని సమానత్వం, గౌరవం, స్థిరత్వంతో ముడిపెడుతూ, ప్రభుత్వ విధానాలను ఆచరణలోకి తీసుకువస్తుందని చెప్పారు. భారతదేశంలోని గిరిజన సమూహాలు లోతైన విజ్ఞాన వ్యవస్థలు, పర్యావరణ సంబంధిత పరిజ్ఞానం, తరతరాల నిరంతరతను ప్రతిబింబించే విభిన్నమైన కళా సంప్రదాయాలను కొనసాగిస్తున్నాయని, టీఏఎఫ్ ఈ సంప్రదాయాల జాతీయ గుర్తింపును పెంపొందించడం మాత్రమే కాక, వ్యక్తిగత గుర్తింపు, ఆర్థిక సాధికారతకు అర్థవంతమైన అవకాశాలను సృష్టిస్తుందని ఆమె అన్నారు. .
ట్రైబ్స్ ఆర్ట్ ఫెస్ట్ గిరిజన కళాకారుల శ్రమకు తగిన విలువ లభించేలా ఒక పారదర్శకమైన, సహేతుకమైన మార్కెట్ పరిస్థితులను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కళాఖండాల కొనుగోలుదారులు, గ్యాలరీలు, కార్పొరేట్ భాగస్వాములు, వివిధ సంస్థలు, సాధారణ పౌరులతో నేరుగా అనుసంధానం చేయడం ద్వారా, ఈ ఉత్సవం భారీ స్థాయిలో మార్కెట్ అనుసంధానాలను సులభతరం చేస్తుంది.
ఈ ప్రదర్శనలో వార్లీ (మహారాష్ట్ర), గోండ్ (మధ్యప్రదేశ్), భీల్ (మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్), డోక్రా (పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా), సోహ్రాయ్ (జార్ఖండ్), కోయ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్), కురుంబ (తమిళనాడు), సౌరా (ఒడిశా), బోడో (అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాలు), ఒరాన్ (జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్), మందన (రాజస్థాన్, మధ్యప్రదేశ్), గోద్నా (బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్), ఈశాన్య రాష్ట్రాల వెదురు కళాఖండాలు వంటి అనేక సంప్రదాయ కళారూపాలు కొలువుదీరాయి. ఇవి మన దేశంలోని ప్రాంతీయ వైవిధ్యాన్ని, ప్రాచీన నాగరికత నిరంతరాయ సంప్రదాయాన్ని చాటిచెబుతున్నాయి.
గిరిజన కళలు సుస్థిరత్వం, సామరస్యానికి ప్రతీకలని, ఆధునిక భారతదేశానికి ఈ విలువలు ఎంతో కీలకమని గుర్తిస్తూ, ఈ ఉత్సవంలో సమకాలీన వ్యక్తీకరణలకు కూడా చోటు కల్పించారు. ఇందులో భాగంగా గిరిజన కళాకారులు, ఆధునిక కళాకారులు కలిసి రూపొందించిన ఉమ్మడి కళాఖండాలను ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా, ఈ ప్రదర్శనలో ఈశాన్య రాష్ట్రాల నుంచి కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం.
ట్రైబ్స్ ఆర్ట్ ఫెస్ట్ కేవలం ప్రదర్శనకే పరిమితం కాకుండా, గిరిజన కళల పునరుద్ధరణ, స్థిరమైన భవిష్యత్తు, సమకాలీన రంగాల్లో గిరిజన కళల ప్రాముఖ్యత, జీవనోపాధి, మార్కెట్ అనుసంధానం వంటి అంశాలపై ప్యానెల్ చర్చలను కూడా నిర్వహిస్తోంది. ఈ ఉత్సవంలో భాగంగా గిరిజన కళల ద్వారా కథ చెప్పడం, ప్రదర్శనతో కూడిన ప్రసంగాలు, ప్రత్యక్ష కళా ప్రదర్శనలు వంటి విభిన్న వర్క్‌షాప్‌లు కూడా ఏర్పాటు చేశారు. భారతదేశం నలుమూలల నుంచి కళా రంగంలో విద్యనభ్యసిస్తున్న 100 మందికి పైగా గిరిజన విద్యార్థులకు ఈ ఉత్సవంలో ప్రత్యేక శిక్షణ లభిస్తోంది. వీరికి సీనియర్ గిరిజన కళాకారులతో మెంటార్‌షిప్ సెషన్లు, ఎగ్జిబిషన్ సందర్శన, ప్రత్యక్ష సృజనాత్మక ప్రక్రియలను స్వయంగా చూసి నేర్చుకునే అవకాశం కల్పించారు.
టీఏఎఫ్ 2026 లో ఖుమ్ - రూటెడ్ ఇన్ క్రియేటివిటీ ప్రాజెక్ట్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. దీనిని శ్రీమతి జై మదాన్ గిరిజన కళాకారులతో కలిసి రూపొందించారు. త్రిపురలో మాట్లాడే కోక్‌బోరోక్ భాషలో "ఖుమ్" అంటే పువ్వు అని అర్థం. పువ్వు పూయడం, వికసించడం, సంపూర్ణ సృజనాత్మక వ్యక్తీకరణను ఇది సూచిస్తుంది. గిరిజన మహిళా కళాకారులు కలసి రంగు, నమూనా, సంప్రదాయం ద్వారా సజీవ కళాఖండంగా మార్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ నేపథ్యం కలిగిన ఈ కళాఖండం మహిళల సృజనాత్మకత, నాయకత్వం, సాంస్కృతిక స్మృతిని చాటి చెబుతూ, “మహిళలు సృష్టిస్తే సంస్కృతి వికసిస్తుంది" అనే నినాదాన్ని నిజం చేస్తోంది.
ఈ 12 రోజుల ఉత్సవంలో భాగంగా అనేక ఆసక్తికరమైన అంశాలను పొందుపరిచారు. ఇందులో గిరిజన కళా ప్రదర్శనల సందర్శన , ప్రత్యక్ష చిత్రలేఖన ప్రదర్శనలు, బొమ్మల ప్రదర్శన ద్వారా ప్రసంగాలు, గిరిజన అంశాలపై ప్యానెల్ చర్చలు, నిపుణులైన కళాకారుల ద్వారా విద్యార్థులకు మార్గదర్శకత్వం, ప్రతిరోజూ గిరిజన సంగీత, నృత్య సంప్రదాయాలతో కూడిన సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమం గిరిజన మహిళా కళాకారులలోని నాయకత్వ పటిమ, ఉద్యమశీలతను వెలుగులోకి తీసుకురానుంది. సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన సమ్మిళిత వర్క్‌షాప్‌లు, ముఖ్యంగా ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తుల కోసం నిర్వహించే ప్రత్యేక సెషన్లు ఈ ఉత్సవంలో సమాజ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి.
గిరిజన కళలు, సంస్కృతికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావాలని మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ప్రత్యక్ష మార్కెట్ సదుపాయం ద్వారా గిరిజన కళాకారుల జీవనోపాధి అవకాశాలను బలోపేతం చేయడమే దీని లక్ష్యం. అలాగే, భారతీయ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో గిరిజన కళను ఒక గౌరవప్రదమైన, స్థిరమైన పునాదిగా నిలబెట్టాలని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
ట్రైబ్స్ ఆర్ట్ ఫెస్ట్ 2026 మార్చి 3, 2026 నుంచి ప్రజల సందర్శనార్థం అందుబాటులో ఉంటుంది. ఈ ఉత్సవం 2047 నాటికి వికసిత భారత్ సాధించాలన్న గౌరవ ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా రూపుదిద్దుకుంది. గిరిజన తెగల సమగ్ర అభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ, స్థిరమైన ఆర్థిక సాధికారత పట్ల కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను ఇది పునరుద్ఘాటిస్తుంది.
ఈ ఉత్సవంతో అనుసంధానమై గిరిజన కళాకారుల నుంచి నేరుగా కళాఖండాలను కొనుగోలు చేయడం ద్వారా వారిని ఆర్థికంగా ప్రోత్సహించాలని, అలాగే గిరిజన సమాజాల సాంస్కృతిక సమానత్వం, సుసంపన్నతను అభివృద్ధి చేయడంలో తమ వంతు పాత్ర పోషించాలని మంత్రిత్వ శాఖ భాగస్వాములందరినీ కోరుతోంది.
***
(రిలీజ్ ఐడి: 2234811)
సందర్శకుల సూచీ సంఖ్య : : 66