ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వైద్యరంగంలో కృత్రిమ మేధ పాఠాన్ని యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా అత్యధిక మంది వీక్షించినందుకు గాను, అధికారిక గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు పొంది చారిత్రక మైలురాయిని చేరుకున్న ఎన్బీఈఎంఎస్

నాడు పోస్టు చేయడమైనది: 25 FEB 2026 8:46PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థ అయిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) బుధవారం ఒక చారిత్రాత్మక మైలురాయిని అందుకుంది. వైద్య రంగంలో కృత్రిమ మేధ పాఠాన్ని (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ హెల్త్‌కేర్ లెసన్) యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం (లైవ్ స్ట్రీమ్‌) ద్వారా అత్యధిక మంది వీక్షించినందుకు గాను ఈ సంస్థ అధికారికంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది.

 

 

దేశవ్యాప్తంగా ఉన్న రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ హెల్త్‌కేర్" ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం ద్వారా ఈ రికార్డు నమోదైంది.

ఈ  కార్యక్రమాన్ని ఒకే సమయంలో అత్యధికంగా 17,999 మంది వీక్షించారు.

వైద్యులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన ప్రాథమిక, అనువర్తిత పరిజ్ఞానాన్ని అందించే లక్ష్యంతో ఎన్బీఈఎంఎస్  అధ్యక్షుడు, ఎన్ఎంసీ  ఛైర్మన్ డాక్టర్ అభిజాత్ షేత్ నాయకత్వంలో ఈ ఏఐ శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించారు.

హార్వర్డ్ యూఎస్ఏ,  ఐఐఎం లక్నో, ఐఐఎస్సీ బెంగళూరు వంటి ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ అధ్యాపకులు ఆరు నెలల పాటు అందించే ఈ ప్రోగ్రామ్‌లో 20 మాడ్యూల్స్ ఉన్నాయి. ఈ శిక్షణ కోసం ఎటువంటి రుసుము లేదని ఎన్బీఈఎంఎస్ తెలిపింది. 

 

దేశవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణుల కోసం ఉద్దేశించిన ఈ భారీ డిజిటల్ అకడమిక్ ఈ-లెర్నింగ్ ప్రోగ్రామ్‌ను ఎన్బీఈఎంఎస్ పాలక వర్గం సభ్యుడు డాక్టర్ రాకేష్ శర్మ, హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ఏవీఎస్ సురేష్, ఎన్బీఈఎంఎస్  బృందం కలిసి జాతీయ, అంతర్జాతీయ ఏఐ  నిపుణుల సహకారంతో రూపొందించి అమలు చేశారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నుంచి న్యాయమూర్తి  స్వప్నిల్ దంగారికర్ నేతృత్వంలోని బృందం ఈ రికార్డు ప్రయత్నాన్ని అధికారికంగా పరిశీలించింది. వారు పూర్తిస్థాయి మూల్యాంకనం, ధృవీకరణ ప్రక్రియను నిర్వహించిన అనంతరం  ఈ రికార్డును  ప్రకటించారు. 

"డిజిటల్ ఇండియా, సాంకేతిక ఆవిష్కరణలు, పాలన, ప్రజా సేవలో కృత్రిమ మేధ బాధ్యతాయుతమైన వినియోగం గురించి ఎప్పుడూ స్పష్టంగా చెప్పే  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వం నుంచి  ఈ విజయం స్ఫూర్తి పొందింది" అని డాక్టర్ షేత్ చెప్పారు. "కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జె.పి. నడ్డాకు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులకు, అధ్యాపకులకు, విద్యా భాగస్వాములకు, ఈ విజయం సాధ్యపడేలా చేసిన ప్రతి ఒక్క వైద్యుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు" అని డాక్టర్ షేత్ పేర్కొన్నారు.

"గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నుంచి లభించిన ఈ గుర్తింపు కేవలం ఒక రికార్డు మాత్రమే కాదు.  వైద్య విద్యలో డిజిటల్ ఆవిష్కరణలను అందిపుచ్చుకోవడంలో భారత్ అగ్రగామిగా ఉందనడానికి ఇది ఒక నిదర్శనం" అని ఆయన అన్నారు.

దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవల నాణ్యతను పెంచే లక్ష్యంతో, నైపుణ్యం ఆధారిత అభ్యసనాన్ని ప్రోత్సహించడానికి,  మరిన్ని నూతన విధానాలను ప్రవేశపెట్టడానికి ఎన్బీఈఎంఎస్  కట్టుబడి ఉంటుందని ఆయన చెప్పారు.

"వైద్య విద్య ప్రపంచ పురోగతితో పాటు ఎదగాలని ఎన్బీఈఎంఎస్ నమ్ముతోంది. కేవలం నిపుణులను తయారు చేయడం మాత్రమే మా లక్ష్యం కాదు. కొత్త సాంకేతికతలను బాధ్యతాయుతంగా ఉపయోగించే, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే ఆరోగ్య సంరక్షణ నాయకులను సిద్ధం చేయడం మా ఉద్దేశ్యం. ఈ రికార్డు కేవలం గణాంకాలకు సంబంధించింది కాదు. మారుతున్న ప్రపంచంతో పాటు ముందుకు సాగడానికి, నాయకత్వం వహించడానికి ఎన్బీఈఎంఎస్ సిద్ధంగా ఉందని ఇది నిరూపిస్తోంది" అని ఆయన అన్నారు.

 

దేశవ్యాప్తంగా అసాధారణ స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల  వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, ఇది ఏఐ పట్ల ఆరోగ్య రంగ నిపుణులలో పెరుగుతున్న ఉత్సుకతను  ప్రతిబింబిస్తోంది.

***


(రిలీజ్ ఐడి: 2233289) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी