రైల్వే మంత్రిత్వ శాఖ
‘‘కర్నాటక భారత్ గౌరవ్ రైలు: వేయి పుణ్యక్షేత్రాల యాత్ర’’ పేరుతో కాఫీ టేబుల్ బుక్‌ను ఆవిష్కరించిన శ్రీ వి. సోమన్న
ఈ పుస్తకం భారతీయ రైల్వేలు చేపట్టిన అత్యంత ప్రభావవంతమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక పర్యటన కార్యక్రమాల్లో ఒకటి.. అంతేకాదు, సమృద్ధమైన దృశ్యాత్మక, కథాత్మక వివరణపత్రం కూడా: శ్రీ వి. సోమన్న
నాడు పోస్టు చేయడమైనది:
25 FEB 2026 5:17PM by PIB Hyderabad
‘‘కర్నాటక భారత్ గౌరవ్ రైలు: వేయి పుణ్యక్షేత్రాల యాత్ర’’ పేరుతో కాఫీ టేబుల్ బుక్‌ను కేంద్ర రైల్వేలు, జల శక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ వి. సోమన్న 2026 ఫిబ్రవరి 23న రైల్ భవన్‌లో ఆవిష్కరించారు.
ఈ పుస్తకం భారతీయ రైల్వేలు చేపట్టిన అత్యంత ప్రభావవంతమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక పర్యటన కార్యక్రమాల్లో ఒక భాగం.. అంతేకాదు, ఒక సమృద్ధ దృశ్యాత్మక, కథాత్మక వివరణపత్రం కూడా అని శ్రీ సోమన్న వాఖ్యానించారు. ఈ పుస్తకం ఒక అగ్రగామి నమూనా వెనుక ఉన్న భావననీ, దృష్టికోణాన్నీ, ఉమ్మడి ప్రయత్నాన్నీ కళ్లకు కడుతుందనీ, ఇది విశ్వాసం, సంస్కృతి, వారసత్వం, ఆధునిక రైల్వే మౌలిక సదుపాయాలను ఎంతో శోభాయమానంగా అందిస్తోందని ఆయన అన్నారు. ఈ అసాధారణ కార్యక్రమానికి విశ్రాంత ఐఆర్‌టీఎస్ అధికారి డాక్టర్ అనుప్ దయానంద్ ఆలోచించి, ఆచరణ రూపాన్ని ఇచ్చారని కూడా శ్రీ సోమన్న తెలిపారు.
భారత్ గౌరవ్ పథకంలో భాగంగా, కర్నాటకలో 30,000 కన్నా ఎక్కువ మంది భక్తగణం తక్కువ ఖర్చులో కాశీకీ, ఇతర పవిత్ర స్థలాలకీ వెళ్లిరావాలనే జీవనకాలపు కలని నిజం చేసుకోవడం చరిత్రాత్మకమని శ్రీ సోమన్న వెల్లడించారు.
ఈ పుస్తకం రైలును ‘‘భారతదేశ సంచార గ్యాలరీ’’గా కళ్లకు కడుతోంది. ఎంతో దీర్ఘంగా ఆలోచించి రూపురేఖలు తీర్చిదిద్దిన రైలుపెట్టెలు, రైలులో అందుబాటులో ఉంచిన రకరకాల సౌకర్యాలు, ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేసిన ఆధ్యాత్మిక యాత్రల పట్టికతో పాటు యాత్రికులకు కలిగే సంపూర్ణ అనుభవాన్ని గురించిన విస్తృత వర్ణనను పొందుపరిచారు. హాయికీ, లభ్యతకీ, స్తోమతకీ ఎలా పెద్దపీట వేసిందీ, విశేషించి వయోవృద్ధ పౌరులు, తొలిసారి తీర్థయాత్రకు బయలుదేరే యాత్రికులను దృష్టిలో పెట్టుకొని వారికి విధానపరమైన మద్దతును అందించడంతో పాటు ప్రభుత్వ సబ్సిడీకి కూడా ఎలా అగ్రతాంబూలాన్ని ఇచ్చిందీ వివరించారు. మరీముఖ్యంగా, భారత్ గౌరవ్ రైలు విధానంలో భాగంగా ‘కర్నాటక భారత్ గౌరవ్ రైలు’కు రూపకల్పన చేయడం, ఆ భావన కార్యరూపంలోకి వచ్చిన క్రమం, దానిని విజయవంతంగా అమలులోకి తీసుకురావడం.. ఇలా ప్రతి అంశాన్నీ పూస గుచ్చినట్లుగా పేర్కొన్నారు.
కర్నాటక భారత్ గౌరవ్ రైలు
భారతీయ రైల్వేల భారత్ గౌరవ్ విధానంలో భాగంగా చేపట్టిన ఒక ప్రధానమైన యాత్రా పర్యటన కార్యక్రమానికి ఒక నిదర్శనంగా ‘కర్నాటక భారత్ గౌరవ్ రైలు’ నిలుస్తోంది. ఇది రైల్వేలను ఒక యాత్రా సాధనంగా మాత్రమే కాక పర్యటన, సంస్కృతి, ఆధ్యాత్మిక సంధానాన్ని ప్రోత్సహించేందుకు ఒక మహత్తర మాధ్యమంగా కూడా నిలబెడుతోంది. ‘‘దేఖో అప్‌నా దేశ్’’ (మన దేశాన్ని చూడండి), ‘‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’’ (ఒకే భారత్, శ్రేష్ఠమైన భారత్) వంటి జాతీయ కార్యక్రమాల స్ఫూర్తికి అనుగుణంగా ఈ కార్యక్రమం రూపొందింది. ఉమ్మడి ఆధ్యాత్మిక అనుభవాల ద్వారా జాతీయ సమైక్యతను ఇది పెంపొందిస్తోంది.
కాశీ దర్శన్, జ్యోతిర్లింగ దర్శన్, శక్తి పీఠ యాత్ర, దక్షిణ యాత్ర, ద్వారక యాత్ర, పురీ జగన్నాథ యాత్రల వంటి ఇతివృత్త ప్రధాన యాత్రల నిర్వహణ ద్వారా ఈ రైలు.. కర్నాటకకు చెందిన తీర్థయాత్రికులను భారత్ నలు మూలలా గల ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రాలకు తీసుకు పోతుంది. ప్రయాణ ఖర్చుతో పాటు శాకాహారి భోజనం, బస, ఆయా పుణ్యక్షేత్రాల్లో స్థానికంగా అయ్యే రవాణా ఖర్చులు, టూర్ గైడ్లు, దర్శనీయ స్థలాలకు తీసుకు పోవడానికి అయ్యే ఖర్చులను కలిపి ప్యాకేజీని సిద్ధం చేశారు. దీంతో ఇది ఎలాంటి అదనపు ఇబ్బందులకూ తావులేని ఆత్మగౌరవపూర్ణ అనుభూతిని అందిస్తోంది.
ఇంతవరకు 46 ట్రిప్పులను విజయవంతంగా పూర్తి చేశారు. వీటిని 28,786 మంది తీర్థయాత్రికులు ఉపయోగించుకున్నారు. దీంతో భారతీయ రైల్వేలకు సుమారు రూ.25.57 కోట్ల ఆదాయం సమకూరింది. తీర్థ స్థలాలను చూసే అవకాశాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకు పోవాలన్న విశాల పరమార్థం కూడా దీనితో నెరవేరుతోంది.
***
(రిలీజ్ ఐడి: 2233281)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4