పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అడవులు, వన్యప్రాణులు, పర్యావరణం, జీవవైవిధ్య పరిరక్షణ, వాతావరణ మార్పుల రంగాల్లో సహకారం బలోపేతం కోసం అవగాహన ఒప్పందంపై భారత్-నేపాల్ సంతకాలు

నాడు పోస్టు చేయడమైనది: 25 FEB 2026 8:08PM by PIB Hyderabad

అడవులు, వన్యప్రాణులు, పర్యావరణం, జీవవైవిధ్య పరిరక్షణ, వాతావరణ మార్పు వంటి రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని ప్రోత్సహించడానికి... వన్యప్రాణుల కారిడార్లు, పరస్పర అనుసంధాన ప్రాంతాల పునరుద్ధరణ, విజ్ఞానం, సాంకేతిక నైపుణ్యం, ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి... భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఈ రోజు నేపాల్ ప్రభుత్వ అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖతో ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది.

భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్, నేపాల్ ప్రభుత్వ అటవీ, పర్యావరణ మంత్రి శ్రీ మాధవ్ ప్రసాద్ చౌలగైన్‌ల సమక్షంలో న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ అవగాహన ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు.

భారత్-నేపాల్ దేశాలు గొప్ప జీవవైవిధ్యం, ప్రకృతి పరమైన వారసత్వాన్ని కలిగి ఉన్నాయి. వాటి సంబంధిత భూభాగాల్లో విస్తృతమైన రక్షిత ప్రాంతాల నెట్‌వర్క్‌లను ఇరు దేశాలూ ఏర్పాటు చేశాయి. అనేక బహుపాక్షిక పర్యావరణ ఒప్పందాలు, సదస్సులలో ఇరు దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. భాగస్వామ్య పర్యావరణ వ్యవస్థలు, సరిహద్దుల మీదుగా ఉన్న వన్యప్రాణుల ఆవాసాల దృష్ట్యా అడవులు, వన్యప్రాణులు, పర్యావరణం, జీవవైవిధ్య పరిరక్షణ, వాతావరణ మార్పు రంగాల్లో ఇరు దేశాల ప్రభుత్వాల మధ్య సమన్వయం, సహకారాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఇరు దేశాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

ఏనుగు, గంగా డాల్ఫిన్, ఖడ్గమృగం, మంచు చిరుత, పులి, రాబందులు వంటి కీలక జాతుల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ప్రకృతి దృశ్య స్థాయిలో జీవవైవిధ్య పరిరక్షణ వ్యూహాలను రూపొందించడంలో సహకారాన్ని ఈ అవగాహన ఒప్పందం పెంపొందిస్తుంది. ఇది బలోపేతమైన అటవీ, రక్షిత ప్రాంతాల నిర్వహణ... సరిహద్దుల మధ్య రక్షిత ప్రకృతి దృశ్యాలను సృష్టించే దిశగా కారిడార్లు, ఇతర పరస్పర అనుసంధాన ప్రాంతాల పునరుద్ధరణ... జీవవైవిధ్య పరిరక్షణ ముప్పులను పరిష్కరించడం... అటవీ, వన్యప్రాణులకు సంబంధించిన నేరాలను అరికట్టడం... అమలు సంస్థల ఫ్రంట్‌లైన్ సిబ్బంది సామర్థ్యాన్ని పెంపొందించడం... జీవవైవిధ్య హాట్‌స్పాట్‌లలో స్మార్ట్ గ్రీన్ మౌలిక సదుపాయాలను ప్రోత్సహించడం వంటి అంశాలపై ఈ ఒప్పందంలో ప్రధానంగా దృష్టి సారించారు.

ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం వల్ల వన్యప్రాణుల, జీవవైవిధ్య పరిరక్షణలో భారత్-నేపాల్ సహకారం మరింత బలోపేతమవుతుందని... ఉమ్మడి పర్యావరణ వ్యవస్థల రక్షణకు, ఈ ప్రాంతంలోని సహజ వనరుల స్థిరమైన నిర్వహణకు ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2232878) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी